Teacher Vs Student… ఎటు పోతోంది సమాజం.? క్రమశిక్షణ పేరుతో విద్యార్థి ప్రాణం తీసిందొక టీచర్.! ప్రిన్సిపల్ మందలించిందని, ఆమె ప్రాణం తీశారు విద్యార్థులు.!
రెండు తెలుగు రాష్ట్రాల్ని కుదిపేశాయి ఈ ఘటనలు.! ఓ ఘటనలో ఒకటో తరగతి కంటే తక్కువ చదువుతున్న విద్యార్థి ప్రాణం పోయింది, టీచర్ కొట్టడంతో.
ఇంకో ఘటనలో, అత్యంత కిరాతకంగా ప్రిన్సిపల్‌ని చంపేశారు నిండా పద్ధెనిమిదేళ్ళు కూడా లేని విద్యార్థులు.! తప్పెవరిది.?
ఇక్కడ పిల్లల పెంపకంలో లోపముందా.? ఉపాధ్యాయ వృత్తిలోనే లోపముందా.? తప్పెక్కడ జరుగుతోంది.? ఈ ఘటనలకు సమాజమెలా బాధ్యత వహించాల్సి వుంటుంది.?
ఇంతకీ, ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వాల పాత్ర ఏంటి.? ఎలాంటి చర్యలు ముందు ముందు ప్రభుత్వాలు తీసుకోవాలి.?
ఎల్కేజీనో యూకేజీనో.. ఇంకా ఒకటో తరగతికి కూడా రాలేదు ఆ చిన్నారి.! కుటుంబంతో తిరుపతికి వెళ్ళాడు.. దాంతో, హోంవర్క్ పెండింగ్‌లో పడింది.
స్కూలుకు వెళితే, టీచర్ తిట్టింది.. కొట్టింది కూడా.! చెంప ఛెళ్ళుమనిపించింది టీచర్. ‘వద్దు కొట్టొద్దంటూ’ తొలుత బతిమాలాడు.. భయంతో బిక్కుబిక్కుమన్నాడు.
కానీ, టీచర్ వినలేదు.. కొట్టింది. ఒకే ఒక్క చెంప దెబ్బ.. అంతే, ఆ చిన్నారి ప్రాణం పోయింది. విగత జీవిలా టీచర్ చేతుల్లోనే వాలిపోయాడు.
ఆ వయసు పిల్లల్ని కొట్టకూడదన్న కనీసపాటి ఇంగితం ఆ టీచర్‌కి లేకుండా పోయింది. తను కూడా మాతృమూర్తి అయి వుంటుంది.. పిల్లల్ని ఎలా సాకాలో తెలియకపోతే ఎలా.?
ప్రిన్సిపల్ హత్య విషయానికొస్తే, ఇది మరీ దారుణం. అత్యంత కిరాతకంగా చంపేశారు. చంపింది విద్యార్థులేనని పోలీసుల విచారణలో తేలింది.
ఎందుకు చంపారు.? అంటే, మందలించిందని అట.! మందలిస్తే చంపేస్తారా.? ఇదేం పైత్యం.? ఎందుకింత దారుణంగా విద్యార్థులు తయారవుతున్నారు.?
సోషల్ మీడియా ప్రభావమా.? లేదంటే, ఓటీటీలో హింసాత్మక కంటెంట్ వల్లనా.? కారణమేదైతేనేం.. నిండు ప్రాణం గాల్లో కలిసిపోయింది.
టీచర్ల రక్షణకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని రెండో ఘటనలో ఉపాధ్యాయులు ఆందోళనలు చేస్తోంటే, క్రమశిక్షణ పేరుతో విద్యార్థుల ప్రాణాలు తీస్తున్న టీచర్లపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
చివరగా.. భారత దేశ భవిష్యత్తుగా చిన్నారుల్ని చూస్తున్నాం.! వాళ్ళని భావి పౌరులుగా తీర్చిదిద్దాల్సింది ఉపాధ్యాయులే. ఒకర్ని ఒకరు చంపుకునే పరిస్థితి.. అత్యంత ప్రమాదకరం.
