Table of Contents
Pawan Kalyan Target 75 Seats.. అప్పుడెందుకు తగ్గారు.? ఇప్పుడెందుకు మొండికేస్తున్నారు.? 2024 ఎన్నికల్లో 21 సీట్లకు సర్దుకుపోయిన జన సేనాని, ఇప్పుడేంటి, 35 శాతం సీట్లను డిమాండ్ చేస్తున్నారు.?
ఇదీ, ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ.! 35 శాతం కాదు, 40 శాతం.. అంటూ, స్థానిక ఎన్నికల నేపథ్యంలో ‘ప్రతిపాదనల్ని’ జన సేన, మిత్రపక్షమైన టీడీపీ ముందుంచింది.
సార్వత్రిక ఎన్నికల్లో కొన్ని ఈక్వేషన్స్ నేపథ్యంలో త్యాగాలు చేయక తప్పలేదు. కానీ, ఇకపై తగ్గేది లేదు.. అంటోంది జన సేన.! అనడమే కాదు, తమదైన డిమాండ్లను మిత్ర పక్షం టీడీపీ ముందు బలంగా వుంచుతోంది.
స్థానిక ఎన్నికల్లో 35 శాతం సీట్లను జన సేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశించడంలో, తనదైన వ్యూహం దాగుంది.
Pawan Kalyan Target 75 Seats.. 2029 నాటికి లెక్కలు మారనున్నాయ్..
సార్వత్రిక ఎన్నికల నాటికి.. అంటే, 2029 ఎన్నికల నాటికి, అసెంబ్లీ అలాగే పార్లమెంట్ సీట్ల విషయమై ఇదే ‘కోటా’ వుండాలనే సంకేతాల్ని జన సేనాని పవన్ కళ్యాణ్ ఇప్పటినుంచే బలంగా ఇస్తున్నారన్నమాట.
తక్కువలో తక్కువ 75 సీట్లని 2029 ఎన్నికల్లో కూటమి పంపకాల్లో భాగంగా జన సేనకు దక్కాల్సిందేనన్నది జన సేనాని ఆలోచన. అందుకు తగ్గట్టుగానే, ఇప్పటినుంచే టీడీపీకి తెగేసి చెబుతున్నట్లుంది పరిస్థితి.
నిజానికి, స్థానిక ఎన్నికల నేపథ్యంలో పార్టీకి సంబంధించిన కమిటీల్ని మొత్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాలకూ ప్రకటించేశారు జన సేనాని పవన్ కళ్యాణ్.
సమన్వయం మరింత తేలికవుతుంది..
ఈ కమిటీలు లేకపోవడమే నిన్న మొన్నటిదాకా జన సేన పార్టీకి ఓ లోటు.! కార్యకర్తలు ఆందోళన చెందుతూ వచ్చింది కూడా ఈ విషయమ్మీదనే.
ఇప్పుడిక కార్యకర్తలు, స్థానిక నాయకుల్ని సమన్వయం చేసుకోవడం తేలికవుతుంది. ఇతర పార్టీల్లోంచి జన సేనలోకి చేరికలకు సంబంధించి కూడా ఈ కమిటీలు కీలక భూమిక పోషిస్తాయి.
ఇవన్నీ, 2029 ఎన్నికల నాటికి జన సేన మరింతగా బలపడేందుకు ఉపకరిస్తాయి. ‘స్నేహ పూర్వక పోటీ’ అంటూ స్థానిక ఎన్నికల విషయమై జనసేనాని ఇప్పటికే సంకేతాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.
టీడీపీకి జనసేనాని అల్టిమేటం..
ఇది ఒక రకంగా, తాము బలంగా వున్నామనీ.. సరైన నిర్ణయం టీడీపీ తీసుకోవాల్సిందేనని, కూటమికి జనసేనాని అల్టిమేటం ఇచ్చినట్లే భావించాల్సిన అంశమేమో.
ఏదిఏమైనా, జనసేన బలపడింది.. 2024 ఎన్నికలతో పోల్చితే. చాలా బలమైన రాజకీయ శక్తిగా జన సేన మారుతోంది. ఈ పరిణామాల్ని వైరిపక్షం అయిన వైసీపీ కూడా నిశితంగా గమనిస్తోంది.
వైసీపీ – జనసేన.. ఈ కాంబినేషన్ ఎలా వుంటుందన్న చర్చ వైసీపీలో జరుగుతోంది. మరోపక్క, టీడీపీ లేకుండా కేవలం జనసేన – బీజేపీ కలిస్తే ఎలా వుంటుంది.? అన్న కోణంలోనూ చర్చోపచర్చలు జరుగుతున్నాయి.