అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్, తెలుగు సినిమాతోనే తెరంగేట్రం (Janhvi Kapoor Tollywood Debut) చేస్తుందని అంతా అనుకున్నారు. చాలాకాలం క్రితమే ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమా సీక్వెల్ చేయబోతున్నారనీ, ఆ సినిమాతో చిరంజీవి (Mega Star Chiranjeevi) తనయుడు రామ్ చరణ్ (Ramcharan), శ్రీదేవి (Sridevi) కుమార్తె జాన్వీ కపూర్ వెండితెరకు పరిచయమవుతారని గాసిప్స్ వచ్చాయి.
కానీ, అలా జరగలేదు. ఆ తర్వాత కూడా చాలాసార్లు జాన్వీ కపూర్ పేరు టాలీవుడ్లో ‘గాసిప్స్’ రూపంలో వినిపిస్తూనే వుంది. శ్రీదేవి తెలుగు సినిమాలతోపాటు, తమిళ హిందీ సినిమాలతోనూ సత్తా చాటింది.. హీరోయిన్గా నెంబర్ వన్ అన్పించుకుంది ఒకప్పుడు.
అలాంటి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) కూడా మొత్తంగా ఇండియన్ సినిమా స్క్రీన్‌పై ‘క్వీన్’గా ఓ వెలుగు వెలిగిపోవాలని శ్రీదేవి అభిమానులు ఆశించారు, ఆశిస్తూనే వున్నారు. ఇక, జాన్వీ కపూర్ తండ్రి బోనీ కపూర్.. తన కుమార్తె సౌత్ సినిమాల్లో నటించడంపై ఇప్పటికే స్పష్టత ఇచ్చేశాడు.
బాలీవుడ్లో పలు సినిమాలకు కమిట్ అయి వున్న జాన్వీ ఇప్పట్లో తెలుగు సినిమాల్లో నటించే అవకాశం లేదని, తెలుగుతోపాటు తమిళంలోనూ ఆమె నటించడానికి కొంత సమయం పడుతుందని చెప్పాడు బోనీ కపూర్. ఇదిలా వుంటే, తాజాగా మరోమారు టాలీవుడ్లో జాన్వీ నటించడంపై గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan).. ఇలా పలువురు అగ్రహీరోల సినిమాలతో జాన్వీ కపూర్‌ని లింకప్ చేస్తున్నారు. అఖిల్ సినిమాకి కూడా జాన్వీ పేరుని జోడిస్తుండడం గమనార్హం. ‘తెలుగు సినిమాల్లో నాకూ నటించాలని వుంది. కానీ, దానికి కొంత సమయం పట్టొచ్చు..’ అని చెప్పింది జాన్వీ.
ఇటీవల జాన్వీ నటించిన ‘గుంజన్ సక్సేనా’ విడుదలైన విషయం విదితమే. నటిగా తొలి సినిమా ‘ధడక్’తోనే తానేంటో ప్రూవ్ చేసుకున్న జాన్వీ, తెలుగులోనూ సత్తా చాటాలని ఆశిద్దాం. ఈలోగా ఆమె చుట్టూ గాసిప్స్ వస్తూనే వుంటాయనుకోండి.. అది వేరే విషయం.