పాపం రకుల్ ప్రీత్ సింగ్‌ని (Rakul Preet Singh Check) సోషల్ మీడియాలో చాలా గట్టిగానే ఆడేసుకుంటున్నారు హేటర్స్. బాలీవుడ్ డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా తెరపైకొచ్చిన విషయం విదితమే. ఇప్పటికే ఆమె విచారణకు ఓసారి హాజరయ్యింది. తిరిగి తన షూటింగ్ పనుల్లో బిజీ అయిపోయింది.
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుట్ అనుమానాస్పద మరణానికి సంబంధించిన కేసులో విచారణ సందర్భంగా ఈ డ్రగ్స్ వ్యవహారం తెరపైకొచ్చింది. సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిని అరెస్ట్ చేశారు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు.
రియా చక్రవర్తికి స్నేహితురాలైన రకుల్ ప్రీత్ సింగ్‌తోపాటు, డ్రగ్స్ కేసులో దీపికా పడుకొనే, శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్ తదితర బాలీవుడ్ నటీమణుల్నీ విచారణకు పిలిచారు ఎన్సీబీ అధికారులు. విచారణలో ఏం తేలింది.? అన్నది తేలాల్సి వుంది.
ఇక, తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్, మీడియాలో వస్తున్న కథనాల్ని తట్టుకోలేకపోతున్న రకుల్ ప్రీత్ సింగ్, వాటిని నిలువరించాలంటూ న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించింది. మరోపక్క, తన తాజా చిత్రం ‘చెక్’ ఫస్ట్ లుక్ విడుదలైన నేపథ్యంలో, ఆ వివరాల్ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది రకుల్ ప్రీత్ సింగ్.
హీరో నితిన్ సరసన రకుల్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. మరో హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్. రకుల్ ఓ లాయర్ పాత్రలో కనిపించనుంది. ‘చెక్’ సినిమా ఫస్ట్ లుక్, కొన్ని ఫొటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది రకుల్. అంతే, ‘డ్రగ్స్ చెక్’ అంటూ రకుల్‌ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు హేటర్స్.
‘పనిగట్టుకుని నాపై దుష్ప్రచారం చేస్తున్నారు..’ అంటూ రకుల్ వాపోతున్నా, ఈ ట్రోలింగ్ మాత్రం ఆగడంలేదు. సుశాంత్ సింగ్ రాజ్పుట్ అనుమానాస్పద మరణానికి సంబంధించి విచారణ జరుగుతున్న సమయంలో వెలుగు చూసిన ఓ ‘డ్రగ్స్ చాట్’ ఇప్పుడిలా రకుల్ ప్రీత్ సింగ్ మెడకి చుట్టుకున్నట్లు కనిపిస్తోంది.