‘మాస్కు ధరించండి.. తరచూ చేతుల్ని శుభ్రం చేసుకోండి.. ఆరు అడుగుల భౌతిక దూరం ఇతరులతో పాటించండి..’ అంటూ ఏడాదిగా ఎంత ప్రచారం చేస్తున్నా, ‘మాస్కు’ ధరించడం అనేది ఓ ప్రసహనంగా మారిపోయింది చాలామందికి. దాన్నొక ఫ్యాషన్ ఐటమ్‌గానో, లేదంటే అదొక ఇబ్బందికరమైన అంశంగానో చాలామంది చూస్తున్నారు (Corona Virus Covid 19 Second Wave In India).
మాస్కు ధరించకపోతే ఏమవుతుంది.? ఇంకేమవుతుంది, కరోనా వైరస్ సెకెండ్ వేవ్ వస్తుంది. వస్తుంది కాదు, వచ్చేసింది. దేశంలో కరోనా వైరస్ గ్రాఫ్ కిందికి దిగినట్లే దిగి మళ్ళీ పైకెళుతోంది.
ఇది మొదటి వేవ్‌తో సమానంగా వెళుతుందా.? అంతకన్నా ఎక్కువ ఎత్తుకి చేరుకుంటుందా.? లేదంటే, మొదటి వేవ్ కంటే కాస్త తక్కువగా వుంటుందా.? అన్నది అంచనా వేయడం ఇప్పటికిప్పుడు కష్టం.
దేశంలో కరోనా వైరస్‌పై పోరాటంలో భాగంగా పెద్దయెత్తున వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతోంది. అయితే, 130 కోట్ల మంది ప్రజలున్న భారతదేశంలో వ్యాక్సినేషన్ అంత ఆషామాషీ వ్యవహారం కాదు.
వ్యాక్సిన్ వేసుకున్నాసరే, మాస్కు ధరించాలి.. చేతుల్ని తరచూ శుభ్రం చేసుకోవాలి.. భౌతిక దూరం పాటించాలి.. అని వైద్య నిపుణులు చెబుతున్నారు.
కరోనా వైరస్ దేశ ఆర్థిక వ్యవస్థను చిదిమేసింది. ప్రజల ఆర్థిక స్థితిగతుల్ని మార్చేసింది. ఎన్నో ప్రాణాలు పోయాయి. మన ఇంట్లోనో, పక్కింట్లోనో కరోనా మృతుల్ని చూశాం.
కరోనాతో (Corona Virus Covid 19 Second Wave In India) స్వయంగా మనమే బాధపడటమో, మన కుటుంబ సభ్యులకు కరోనా సోకడమో లేదంటే మన సన్నిహితులకు కరోనా సోకడమో చూశాం. అయినాగానీ, మారకపోతే ఎలా.?