24 ఏళ్ళ వయసులోనే, నా ఆట తీరు విషయమై నేను హామీ ఇవ్వలేకపోయాను.. నలభయ్యేళ్ళ వయసులో ఎలా హామీ ఇవ్వగలను.? అంటూ మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ (Mahendra Singh Dhoni About Playing IPL T20) చేసిన తాజా వ్యాఖ్యలు సగటు క్రికెట్ అభిమానిని ఆశ్చర్యపరిచింది.
ధోనీ చెప్పింది అక్షర సత్యం. క్రికెట్ ఓ చిత్రమైన గేమ్. ఏ మ్యాచ్ ఏ ఆటగాడికి ఎలాంటి పరీక్ష పెడుతుందో చెప్పలేం. ఏ ఆటగాడికైనా ప్రతి మ్యాచ్ ప్రత్యేకమే. చెత్త ఇన్నింగ్స్ ఆడాలని ఎవరైనా అనుకుంటారా.? ఛాన్సే లేదు. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్, వికెట్ కీపింగ్.. ఇలా దేన్ని తీసుకున్నా, ఏ ఆటగాడూ చెత్త ప్రదర్శనను కోరుకోడు.
ఇక, అసలు విషయానికొస్తే, చెన్నయ్ సూపర్ కింగ్స్ కెప్టెన్ అయిన ధోనీ, ఆ జట్టుకి బ్రాండ్ అంబాసిడర్. అంతే కాదు, ధోనీ వుంటే చాలు మ్యాచ్ గెలిచేస్తామన్నధీమా క్రికెట్ అభిమానుల్లోనే కాదు, టీమ్ మెంబర్స్ మదిలో కూడా వుంటుంది. టీమిండియా కెప్టెన్ ధోనీ.. అనే ట్యాగ్ వున్నప్పుడూ అదే పరిస్థితి. కెప్టెన్సీ వదిలేసి, ఆటగాడిగా వున్నప్పుడూ ధోనీ మీద అదే నమ్మకం అందరిలోనూ వుండేది.
నిజానికి, ధోనీ గొప్ప ఆటగాడు.. అలాగని, చరిత్రలో ఇంకెవరూ ఇలాంటోళ్ళు లేరా.? అంటే ఎవరి ప్రత్యేకత వాళ్ళదే. కపిల్ దేవ్, సిద్దూ, రవిశాస్త్రి, సచిన్ టెండూల్కర్, అనిల్ కుంబ్లే, అజారుద్దీన్, సౌరవ్ గంగూలీ.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామందే వున్నారు.
వయసు మీద పడ్డంతో ఆట తీరులో మార్పులొస్తాయ్.. వైఫల్యాలూ వెంటాడుతాయి. ధోనీ ఇందుకు అతీతమేమీ కాదు. కానీ, ధోనీ లేని ఐపీఎల్ ఊహించగలమా.? ఊమించాల్సిందే.. తప్పదు. ఇంకా ఎక్కువ కాలం ధోనీ ఐపీఎల్ ఆడలేకపోవచ్చు.
నిజానికి, ఈ సీజన్ ధోనీ ఆడటమే గొప్ప. కానీ, ఆడుతున్నాడు.. ఆట పట్ల అతని అంకిత భావం అలాంటిది. అంతకు మించి ధోనీ (Mahendra Singh Dhoni About Playing IPL T20) అవసరం అంతలా చెన్నయ్ సూపర్ కింగ్స్ జట్టుకి వుంది.