Table of Contents
Hypertension Health Tips.. ఓ సైన్మా హీరో, మాస్ డైలాగ్ చెబుతాడు ‘బీపీ’ గురించి. ‘నాకు బీపీ వస్తే మొత్తం ఏపీ వణుకుద్ది’ అని.
ఇంకో సినిమాలో హీరోకి బీపీ పెరగ్గానే, చేతి మణికట్టు నుంచి మెదడు వరకూ నరాలు ఉబ్బిపోతాయ్.. రెచ్చిపోయి, విలన్లని చితక్కొట్టేస్తాడు.!
ఆయా సినిమాల్లో హీరోల పాత్రలకు ఎలివేషన్స్ ఇచ్చే క్రమంలో దర్శకులు ఆ డైలాగులు చెప్పించడం, యాక్షన్ బ్లాక్స్ డిజైన్ చేయడం జరుగుతుంటుందిగానీ.. బీపీ విషయంలో అవేవీ వాస్తవం కాదు.
బీపీ.. బ్లడ్ ప్రెజర్.. రక్త పోటు.. హైపర్ టెన్షన్.. పేరేదైతేనేం, అది వచ్చిందంటే కొంప మునిగిపోతుంది.
పెరిగితేనే కాదు, తగ్గినా ప్రమాదమే సుమీ.!
హై బీపీ లేదా అధిక రక్తపోటు మాత్రమే కాదు, తక్కువ రక్త పోటు కూడా ప్రమాదకరమే. అయితే, ఎక్కువమంది బాధపడుతున్నది మాత్రం అధిక రక్తపోటుతోనేనని అధ్యయనాలు చెబుతున్నాయి.
అసలు అధిక రక్త పోటు ఎందుకు వస్తుంది.? అన్ని అనారోగ్య సమస్యల్లానే రక్త పోటు కూడా,
మన నిర్లక్ష్యంతోనే వస్తుంది. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. చికిత్స కంటే నివారణ మేలు.. అన్న మాట అధిక రక్తపోటు విషయంలో కూడా వర్తిస్తుంది.

ఒక్కసారి అధిక రక్తపోటు.. అని వైద్యులు నిర్ధారించాక, ఖచ్చితంగా వైద్యుల సూచనలు, సలహాల మేరకు మందులు వాడాల్సిందే. ఇందులో ఇంకో మాటకు తావు లేదు.
రక్తపోటు నియంత్రణలో వుండాలంటే ఏం చేయాలి.?
వైద్యులు సూచించే మందులొక్కటే సరిపోవు.. క్రమబద్ధమైన జీవనాన్ని అలవర్చుకోవాలి. రోజూ ఉదయం, సాయంత్రం కాస్సేపు వ్యాయామం తప్పనిసరి. మనసుని ప్రశాంతంగా వుంచుకోవడం అన్నిటికన్నా మంచి మెడిసిన్.!
Also Read: ఇంట్లోనే వైద్య పరీక్షలా.! సొంత వైద్యం కూడానా.?
‘నాకు బీపీ వుంది.. నేను అరుస్తాను.. అందరితోనూ గొడవకు వెళతాను..’ అనుకుంటే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. ఆ కుంటి సాకు, నిలువునా మనిషిని నాశనం చేసేస్తుందని గుర్తుంచుకోవాలిక్కడ.
అధిక రక్తపోటు కారణంగా, చాలా తీవ్రమైన సమస్యలు కాలక్రమంలో ఎదుర్కోవాల్సి రావొచ్చు.
కిడ్నీలు.. అదేనండీ మూత్రపిండాలు ఫెయిల్ అవడం దగ్గర్నుంచి, గుండె పోటు వరకూ.. దాంతోపాటుగా, పక్షవాతం.. చివరికి మరణం కూడా సంభవించే అవకాశముంది.
Hypertension Health Tips ఉప్పు మానేస్తే ముప్పు తగ్గేనా.?
వైద్యులు అధిక రక్తపోటు అని నిర్ధారించగానే, ‘ఉప్పు వాడకం తగ్గించాలి..’ అనే మాట తెరపైకొస్తుంది. అది నిజమే.
ఉప్పు వాడకం తగ్గించాలి తప్ప, మానెయ్యకూడదు. పూర్తిగా మానేస్తే మళ్ళీ అది ఇంకో సమస్యను తెచ్చిపెడుతుందని వైద్యులు చెబుతుంటారు.
సమతుల ఆహారం ఏ అనారోగ్యానికైనా మంచి మందు. మానసిక ప్రశాంతత కూడా అంతే. తగినంత వ్యాయామం కూడా అన్ని అనారోగ్య సమస్యల నుంచీ ఉపశమనం కలిగిస్తుంది.
Also Read: పబ్బుకెళ్లి బజ్జీలు తినకూడదా అధ్యక్షా.?
అర్థమయ్యింది కదా.! చెడిపోయాక ఆరోగ్యాన్ని బాగు చేసుకునేందుకు నానా రకాల మందులూ వాడటం కంటే, అనారోగ్య సమస్యలు రాకుండానే జాగ్రత్తపడాలి. అద్గదీ అసలు సంగతి.
చివరగా.! ఔను, ఎవరికి బీపీ వస్తే, వాళ్ళకే వణుకుద్ది.!