Aan Paavam Pollathathu Telugu Review.. రెండు చేతులు కలిస్తేనే, చప్పట్లు కొట్టగలుగుతాం.! ఒక్క చేత్తో ఎంత ఊపినా శబ్దం రాదు కదా.!
ఆలు మగల మధ్య అభిప్రాయ బేధాలు కూడా అంతే. పొరపాటు ఇరువైపులా జరిగి వుండొచ్చన్న కోణంలో ఎవరూ ఆలోచించరు.
గృహ హింస చట్టం, మగాడికి శాపం.! మగాడు కనీసం వివరణ ఇచ్చుకునే అవకాశం లేకుండానే, శిక్షలు పడిపోతుంటాయ్.! పోలీస్ స్టేషన్‌లో మగాళ్ళకే చావు దెబ్బలు.
కోర్టుల్లో మగాళ్లకు చీవాట్ల సంగతి సరే సరి.! సమాజం కూడా, మహిళల వైపే నిలబడుతోంది ఈ విషయంలో.! మగ న్యాయవాదులు కూడా, మహిళలకే మద్దతుగా నిలుస్తున్నారు.
చాలా కుటుంబాలు ఈ గృహ హింస చట్టం కారణంగా సర్వనాశనమైపోతున్నాయన్న వాదన లేకపోలేదు. కుటుంబాలు కాదు, మగాళ్ళ జీవితాలు నాశనమైపోతున్నాయి.
ఎన్నో ఆత్మహత్యలు ఈ గృహ హింస చట్టం కారణంగా జరుగుతున్నాయి.. అవి కూడా, మగాళ్ళ ఆత్మహత్యలే.! మరి, ఇంతటి ముఖ్యమైన అంశాన్ని, ఫన్ టోన్‌లో ప్రస్తావిస్తే.?
Aan Paavam Pollathathu Telugu Review.. మగాళ్ళకీ కష్టాలుంటాయ్.. భార్యల నుంచి..
రియో రాజ్, మాళవిక మనోజ్ జంటగా తెరకెక్కిన సినిమానే Aan Paavam Pollathathu. తమిళ సినిమా. తెలుగు సినీ అభిమానులకు పరిచయమున్న నటీనటులెవరూ లేరీ సినిమాలో.
‘ఆన్ పావమ్ పొల్లాతాతు’ అని తెలుగులో ప్రస్తావించుకోవాలి ఈ సినిమా టైటిల్‌ని. అంటే, ‘మగాళ్ళు ప్రమాదకరం.. అనేది మూఢ నమ్మకం’ అని చెప్పదలచుకున్నాడు దర్శకుడు.
రాజు భార్య రాణి.. అంటాడు భర్త. కాదు, రాణి అంటే రాణి మాత్రమే.. అంటుంది భార్య.! ఈ ఒక్క డైలాగ్, హీరోయిన్ క్యారెక్టర్‌ని దర్శకుడు ఎలా డిజైన్ చేశాడో చెప్పడానికి నిదర్శనం.

కుటుంబం కోసం మగాడు పడే కష్టం గురించి, దర్శకుడు చక్కగా చెప్పాడు. నిజానికి, ఇలా చెప్పడం ఈ రోజుల్లో పెద్ద నేరం.. అన్నట్లు తయారైంది పరిస్థితి.
తరచూ ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుంటాయి. భర్త అంటే భరించేవాడు కాబట్టి, భార్య ఎంతలా టార్చర్ పెడుతున్నా, భరిస్తూ వుంటాడు.
ఒకానొక సమయంలో, బంధం తెగిపోతుంది. విడాకుల కోసం కోర్టుకు వెళుతుంది భార్య. ఇక, అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది.
విడాకుల కేస్ టేకప్ చేస్తాడో భార్యా బాధితుడు. అటువైపు కూడా, భర్తని వేపుకు తిన్న భార్యే లాయర్.! ఎత్తులు, పై ఎత్లులు.. వెరసి, కొంత ఫన్, ఇంకొంత ఎమోషన్.!
నిజానికి, ఇది చాలా సున్నితమైన టాపిక్. ఏమాత్రం లైన్ తప్పినా, తేడా కొట్టేస్తుంది. కానీ, దర్శకుడు చాలా తెలివిగా, అవసరమైనంత మేర ఫన్ జోడించాడు.
ఫన్ వర్కవుట్ అయ్యింది. భర్తని భార్య టార్చర్ పెడుతోంటే నవ్వొస్తుంటుంది.. అంతలోనే, కాస్త బాధేస్తుంది సగటు మగాడికీ.. అలాగే, మహిళలకి కూడా.!
భార్య పాత్రలో మాళవిక మనోజ్, చాలా బాగా నటించింది. నటించిందనడం కంటే, జీవించిందనడం కరెక్టేమో.! అమాయకపు భర్త పాత్రలో రియో రాజ్ కూడా జీవించేశాడు.

మగ లాయర్, మహిళా లాయర్.. ఇద్దరూ తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఫైనల్ జడ్జిమెంట్ ఓ ట్రాన్స్‌జెండర్‌తో ఇప్పించడం, సినిమాలో మరో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్.
‘ఆడ గొప్పా.? మగ గొప్పా.? అన్న విషయమై మీరిలా కొట్టుకుంటున్నారు.. ఎల్జీబీటీ హక్కుల కోసం ఉద్యమాలు జరుగుతున్న సమయంలో.. ఈ పరిస్థితుల్లో ట్రాన్స్‌జెండర్‌నైన నేను మీ కేసులో తీర్పు ఇవ్వబోతున్నాను’ అంటారు జడ్జి.
ఇది ఒకింత ఆసక్తికరమైన సన్నివేశం సినిమాలో. ‘ఎందుకురా ఆడాళ్ళిలా మగాళ్లని వేపుకు తింటారు’ అంటూ, జూనియర్ లాయర్ చేసే కామెంట్స్.. ఆ సీన్‌ని వేరే లెవల్‌కి తీసుకెళ్తాయ్.
గయ్యాళి గంపలకు నచ్చకపోవచ్చేమో..
కొంతమంది గయ్యాళి గంపలకు ఈ కథ నచ్చకపోవచ్చు. అది సహజమే. కానీ, మనసు పెట్టి ఆలోచిస్తే, భార్యాభర్తలిరువురూ ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు. నేటి యూత్ చూడాల్సిన సినిమా ఇది.
పూర్తిగా మగాడి కోణంలో తీసిన సినిమా.. అనే కంప్లయింట్స్ వస్తే రావొచ్చు గాక.! పూర్తిగా మహిళల కోణంలో తీసిన సినిమాలు, మగాళ్ళను విలన్లుగా చూపిస్తాయ్ కదా.!
ఎక్కడా బోర్ కొట్టించకుండా సినిమాని నడిపించడంలో దర్శకుడు సఫలమయ్యాడు. తెలుగు డైలాగ్స్ చాలా బావున్నాయి. సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి తగ్గట్టుగా వున్నాయి.
ఓటీటీలో అందుబాటులో వుంది.. ఫ్రీగా చూసెయ్యొచ్చు గనుక, ఓ లుక్కేయొచ్చు నిర్మొహమాటంగా. టైమ్ పాస్ మాత్రమే కాదు, మంచి మెసేజ్ కూడా దొరుకుతుంది.
