అందరూ ఊహించిందే.. అబిజీత్, బిగ్‌బాస్ విన్నర్ అవుతాడని. సోషల్ మీడియా పోటెత్తేసింది అబిజీత్ (Abijeet Ruled Bigg Boss Telugu 4) కోసం. ఏముంది అబిజీత్‌లో అంత ప్రత్యేకంగా.? అంటే, అతని సంయమనం. ఔను, బిగ్‌బాస్ తెలుగు సీజన్ నాలుగుకి సంబంధించి అబిజీత్ పెర్ఫామెన్స్ అల్టిమేట్. ఇందులో ఇంకో మాటకు తావు లేదు.
డాన్సులేయకపోవడం అనేది అసలు పాయింటే కాదిక్కడ. డాన్సుల్ని ప్రమాణికంగా తీసుకుంటే, అమ్మ రాజశేఖర్ విన్నర్ అవ్వాలి. గ్లామర్‌ని లెక్కల్లోకి తీసుకుంటే దివి విన్నర్ అయి తీరాలి. కామెడీ అనుకుంటే అవినాష్.. ఏడుపు అనుకుంటే ఇంకెవరో.!
కానీ, బిగ్‌బాస్ అంటే.. అన్నీ వుండాలి.. అంతకు మించి వుండాలి. ఆ ‘అంతకు మించి’ అంటే, అదే ‘సంయమనం’. ఇతరులు రెచ్చగొడుతున్నా రెచ్చిపోకూడదు. అనవసరంగా ‘పులిహోర’ కలపకూడదు. టాస్క్‌ని ఎలాగైనా గెలిచేయాలన్న కసి మాత్రమే కాదు, గెలిచే క్రమంలో కాస్తంత బుర్ర పెట్టి ఆడాలి.
ఇలాంటి విషయాలన్నిటిలోనూ అబిజీత్ ఫుల్ మార్కులేయించేసుకున్నాడు. పీఆర్ టీమ్‌ని పెట్టేసుకుంటే గెలిచేస్తారంటూ అబిజీత్‌పై ట్రోలింగ్స్ నడిచాయి. అలా ఓట్లేసినవారెంతమంది.? జెన్యూన్‌గా పడ్డ ఓట్లెన్ని.? పీఆర్ టీమ్‌ని పెట్టుకునే సత్తా చాలామందికి వుంటుంది.
కానీ, అందరూ బిగ్‌బాస్ వరకూ రాలేరు. చాలా ఈక్వేషన్స్ వుంటాయి. మిగతా అన్ని విషయాల్నీ పక్కన పెడితే, ఎవరు తనను ఎలా అవమానించినా అబిజీత్ (Abijeet Ruled Bigg Boss Telugu 4) సంయమనం కోల్పోలేదు. మోనాల్ విషయంలో కావొచ్చు, అఖిల్ విషయంలో కావొచ్చు.. అబిజీత్ తాను నమ్మినదానికే కట్టుబడి వున్నాడు.
ఈ క్రమంలో చాలా అవమానాల్ని ఎదుర్కొన్నాడు. అంత స్ట్రాంగ్‌గా నిలబడ్డాడు కాబట్టే, స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ వచ్చింది అబిజీత్‌కి. ‘స్టేజ్ మీద ఇద్దరు పిల్లలు వున్నారు.. వారిని ఆశీర్వదించండి.. మీలా వారు సక్సెస్ అవ్వాలని కోరుకోండి..’ అని మెగాస్టార్ చిరంజీవినీ, కింగ్ అక్కినేని నాగార్జుననీ కోరారు అబిజీత్ తల్లి. ఇదే అబిజీత్ సక్సెస్ సీక్రెట్.
అమ్మ నుంచి వచ్చిన ఆ పాజిటివిటీనే, అబిజీత్ అందరికీ పంచాడు. దటీజ్ అబిజీత్.