మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) సినిమాలో ఛాన్స్ అంటే మాటలా.? బిగ్‌బాస్ ఫేం దివి (Divi Vadthya) ఆ గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న సినిమాలో దివి (Divi To Play Key Role In Mega Star Film) నటించబోతోంది. ఈ విషయాన్ని చిరంజీవి స్వయంగా బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4 సాక్షిగా ప్రకటించారు.
”నేను నటించబోతోన్న ‘వేదాళం’ రీమేక్‌లో దివి నటించబోతోంది. ఈ విషయమై ఇప్పటికే దర్శకుడు మెహర్ రమేష్‌కి స్పష్టమైన సూచన చేశాను. సినిమాలో ఓ లేడీ పోలీస్ అధికారి పాత్రలో దివి కన్పిస్తుంది. అయితే, కేవలం చిన్న పాత్రకి మాత్రమే ఆమెను పరిమితం చేయదలచుకోలేదు. ఆమె పాత్రను ఇంకా పెంచాలని కూడా దర్శకుడు మెహర్ రమేష్‌కి సూచించాను..’ అని చిరంజీవి చెప్పడంతో దివి ఎగిరి గంతేసింది.
దివి నిజంగానే స్టన్నింగ్ బ్యూటీ. సరిగ్గా 50వ రోజు విజయదశమి పండగ ఎపిసోడ్‌లో దివి బిగ్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయింది. నిజంగానే అది షాకింగ్ ఎలిమినేషన్. ఎట్టి పరిస్థితుల్లోనూ దివి టాప్ 5 లిస్ట్‌లో వుండాల్సిన కంటెస్టెంట్.
ఏమయ్యిందో, ఏ ప్రత్యేక కారణంతోనోగానీ.. దివి అకస్మాత్తుగా బిగ్ హౌస్ నుంచి ఎవిక్ట్ అయ్యింది. బిగ్ హౌస్ నుంచి దివి బయటకు వచ్చేసినా, ఆమెకి ఫాలోయింగ్ తగ్గలేదు. తాజాగా వచ్చిన మెగా ఛాన్స్‌తో.. దివి రేంజ్ అమాంతం పెరిగిపోయినట్లే.
ఇదిలా వుంటే, దివి హీరోయిన్‌గా ఓ రెండు సినిమాలు త్వరలో తెరకెక్కబోతున్నాయని సమాచారం. అందులో ఒకటి.. ఓ యంగ్ హీరో నటిస్తోన్న సినిమా. అక్కినేని నాగార్జున స్వయంగా ఈ ఆఫర్‌ని దివికి వచ్చేలా చేశాడట.
అన్నట్టు, దివి గతంలో కొన్ని సినిమాలు చేసిన విషయం విదితమే. అయితే, బిగ్‌బాస్‌కి ముందు పరిస్థితి వేరు. ఇప్పుడు పరిస్థితి వేరు. దివి రేంజ్ ఇప్పుడు ఇంకో రేంజ్‌కి పెరిగింది. మెగాస్టార్ చేసిన తాజా ప్రకటనతో దివి ఇమేజ్ మెగా రేంజ్‌కి వెళ్ళిపోయిందనుకోవచ్చు.