విమానం ఏంటీ.? పుట్టింటికి చేరడం ఏంటీ.? పైగా అది ఎయిర్ ఇండియా విమానం.? ఎయిర్ ఇండియా అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ. కానీ, ఇది నిన్నటి మాట. ఇకపై ఎయిర్ ఇండియా ఓ ప్రయివేటు సంస్థ. కానీ, ఎయిర్ ఇండియా (Air India TATA) పుట్టింటికి చేరింది. అవును ఎయిర్ ఇండియా టాటా సొంతమైంది.
1932లో మొదలైన టాటా విమానం కథ ఎన్నో, ఎన్నెన్నో మలుపులు తిరిగింది. చివరికి పుట్టిల్లు.. అదేనండీ టాటా ఇంటికి చేరింది. 1932లో టాటా ఎయిర్ సర్వీసెస్ పేరుతో జహంగీర్ రతన్‌జీ దాదా భోయ్ (జెఆర్‌డీ) టాటా నెలకొల్పిన సంస్థ, ఆ తర్వాత టాటా ఎయిర్ లైన్స్‌గా మారింది. అనంతరం బ్రిటీష్ ఇండియా ప్రభుత్వం ఈ సంస్థను తన అధీనంలోకి తెచ్చుకుంది. తిరిగి టాటా నియంత్రణలోకి వెళ్లింది.
‘ఎయిర్ ఇండియా’ అనే పేరు 1946లో పెట్టారు. తర్వాత మళ్లీ పెద్ద కథ నడిచింది. ఎయిర్ ఇండియాలో వాటా కేంద్రానికి వెళ్లింది. 1953లో ఎయిర్ ఇండియాను జాతికి అంకితం చేయడం జరిగింది. 2.8కోట్లు ఇచ్చి అప్పటి కేంద్ర ప్రభుత్వం టాటాల నుంచి మొత్తం వాటాల్ని కొనుగోలు చేసింది.
ఇప్పుడు, ఇన్నేళ్లకి దాదాపు 18,000 కోట్లతో ఎయిర్ ఇండియాని తిరిగి టాటా సొంతం చేసుకుంది. ప్రయివేటు, ప్రభుత్వం.. తిరిగి ప్రయివేటు. ఇంకెవరన్నా ఎయిర్ ఇండియాని సొంతం చేసుకుని ఉంటే, అప్పటి పరిస్థితి ఇంకోలా ఉండేదేమో. కానీ, ఎయిర్ ఇండియా తిరిగి టాటా గూటికి చేరింది. ఇక్కడితో ఎయిర్ ఇండియా కష్టాలు తొలగిపోతాయేమో.
ఎయిర్ ఇండియా అంటే, విమానయాన రంగంలో భారత ప్రయాణీకుల ఆత్మగౌరవం అనే భావన చాలా మందిలో ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలకు ఎయిర్ ఇండియా విమానాలు వెళ్లి వస్తున్నాయి. అత్యంత నమ్మకమైన ఎయిర్ లైన్స్ ఇది. ఎయిర్ ఇండియా ఇకపై టాటా బ్రాండ్‌తో భారత ఆత్మ గౌరవాన్ని విమానయాన రంగంలో తిరిగి నిలబెడుతుందని ఆశిద్దాం.
చివరిగా, ప్రభుత్వాలు ఎయిర్ ఇండియాని నమ్ముకుని అమ్మేసుకున్నా, టాటాలు మాత్రం ఆ ఎయిర్ ఇండియాని ( Air India TATA ) కష్టాల్లో ఉన్నప్పుడు అక్కున చేర్చుకున్నారు. ఎంతైనా ఎయిర్ ఇండియా టాటా కన్నబిడ్డ కదా.