Akhanda2 Release Suspense.. సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్.. పైగా, పెద్ద హీరో సినిమా.! కానీ, విడుదలకు నోచుకోవడం లేదు.! సినిమా విడుదల వాయిదా పడటం వింతేమీ కాదు.!
కానీ, చివరి నిమిషంలో.. అది కూడా, కొద్ది గంటల్లో సినిమా రిలీజ్ అవ్వాల్సి వుండగా, విడుదల ఆగిపోవడమే అత్యంత అవమానకరమైన విషయం.!
ఇంతటి అవమాన భారాన్ని అటు హీరో, ఇటు నిర్మాత, ఇంకో పక్క దర్శకుడు.. అన్నిటికీ మించి, సదరు హీరో అభిమానులు జీర్ణించుకోవడం చాలా చాలా కష్టం.
తప్పు నిర్మాణ సంస్థ వైపే వుందని హీరో అభిమానులు అంటున్నారు. ఇంకోపక్క, సినిమాపై రావాల్సిన బజ్ రాలేదనీ, అదే కొత్త సమస్యలు తెచ్చిపెడుతోందనీ ఇంకో వాదన వినిపిస్తోంది.
ఇలాంటి స్పెక్యులేషన్స్ చాలానే ప్రచారంలోకి వస్తాయ్. నిర్మాణ సంస్థ అయితే, సినిమాని వీలైనంత త్వరగా విడుదల చేయాలనే ప్రయత్నిస్తోంది.
హీరోతోపాటు దర్శకుడు కూడా, నిర్మాణ సంస్థకి అండగా నిలబడతారు.. అది సహజంగానే జరిగే ప్రక్రియ.
ఓటీటీ చేతుల్లోకి సినిమా వెళ్లిపోయాక, ఓటీటీ సంస్థలు చెర్నాకోల్ పట్టుకుని సినిమాల్ని ఆడించడం సర్వసాధారణమైన విషయంగా మారిపోయింది.
అదే సమయంలో, ‘అఖండ-2’ సినిమాకి డిస్ట్రిబ్యూటర్ల వైపు నుంచి కూడా తలనొప్పులు ఎదురయ్యాయి. సమస్యలన్నీ మూకుమ్మడి దాడి చేశాయి ‘అఖండ-2’ సినిమా మీద.
నందమూరి బాలకృష్ణ అంటే, కేవలం హీరో మాత్రమే కాదు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అధికా పార్టీ ఎమ్మెల్యే. ముఖ్యమంత్రికి బావమరిది. ఓ మంత్రికి స్వయానా మేనమామ, అందునా.. పిల్లనిచ్చిన మేనమామ.
సరే, సినిమాలకి రాజకీయాన్ని ఉపయోగించుకుంటున్నారా.? లేదా.? అన్నది వేరే చర్చ. ఖచ్చితంగా ఆ ‘సాయం’ అయితే వుండి తీరుతుంది.
అయినాగానీ, ‘అఖండ-2’ కష్టాలు తీరడం లేదు. డిసెంబర్ 12న సినిమా వస్తుందనే ప్రచారం జరుగుతోంది. కానీ, దానికి అంత సమయం లేదు.
డిసెంబర్ 19 లేదా 25 అంటే, లెక్కలు మారిపోతాయి. సంక్రాంతి వరకూ ఆగడం సబబు కాదు.! మరెలా.? ఏమోగానీ, ఈ సస్పెన్స్ భరించలేకపోతున్నాడు సగటు బాలయ్య అభిమాని.
