Table of Contents
Andhra Pradesh Bifurcation.. అప్పుడెప్పుడో ఎనిమిదేళ్ళ క్రితం జరిగిన విభజన అది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాన్ని రెండుగా విభజిస్తూ, ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ జరిగింది. అది, 2014 నాటి వ్యవహారం. అప్పటికీ, ఇప్పటికీ చాలా మారింది.
విభజించిన కాంగ్రెస్ పార్టీ, రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా అడ్రస్ కోల్పోయింది. ఆ విభజనకు సహకరించిన బీజేపీ, కాస్తో కూస్తో తెలంగాణలో పుంజుకుంటోంది. తెలంగాణకు ‘గుండెకాయ’ హైద్రాబాద్ కావడంతో, ఆర్థికంగా నిలదొక్కుకుంది. మరి, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి.?
అయ్యో పాపం ఆంధ్రప్రదేశ్.. ఇంకెన్నాళ్ళు.?
అసలు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది.? ఇదొక మిలియన్ డాలర్ క్వశ్చన్ అయిపోయింది. ఏకైక రాజధాని అమరావతి అంటారు కొందరు. ఒకటి చాలదు, మూడు రాజధానులంటారు ఇంకొందరు. ఏదో ఒకటి ఏడ్చి చావాలి కదా.. అని జనం నెత్తీనోరూ బాదుకుంటున్నా, ‘తగ్గేదే లే’ అంటోంది రాజకీయం.
ప్రత్యేక హోదా రాలేదు, రైల్వే జోన్ వచ్చిందో లేదో తెలీదు. దుగరాజపట్నం పోర్టు అడ్రస్ లేదు.. కడప స్టీలు ప్లాంటు ఊసే లేదు. పోలవరం ప్రాజెక్టు ఎనిమిదేళ్ళలో ఎందుకు పూర్తి కాలేదో ఎవరూ చెప్పలేరు. ఇదొక జాతీయ ప్రాజెక్టు అన్న ఇంగితం కేంద్రంలో అధికారంలో వున్నోళ్ళకి లేకపోవడం అత్యంత శోచనీయం.
చెప్పుకుంటూ పోతే, ఆంధ్రప్రదేశ్‌కి కేంద్రం చేయాల్సినవి చాలానే వున్నాయ్. అది చేశాం, ఇది చేశాం.. ఉద్ధరించేస్తున్నాం.. అనే రాష్ట్ర నాయకులు, జాతీయ నాయకులూ చెబుతుంటారు. కానీ, రాష్ట్రం నానాటికీ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతోంది తప్ప, తేరుకోవడంలేదు.
Andhra Pradesh Bifurcation ఆనాటి ఆ గాయాన్ని మళ్ళీ రేపుతున్నారెందుకు.?
విభజన అత్యంత దుర్మార్గంగా జరిగిందన్న కోణంలో తాజాగా పార్లమెంటు సాక్షిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించడం.. అదీ ఏడేళ్ళ తర్వాత ఆ వ్యాఖ్యలు రావడంతో, పాత గాయాన్ని సరికొత్తగా ‘కెలికినట్లు’ అయ్యింది.
అన్యాయం నిజమే కదా.. అన్న భావన ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో రావడం సహజమే. తెలంగాణను అవమానిస్తారా.? అంటూ తెలంగాణ నాయకులు గుస్సా అవడమూ సహజమే. ఎవరి గోల వాళ్ళది.
కాంగ్రెస్ పాలనలో ఏం జరిగిందన్నది అప్రస్తుతం. బీజేపీ హయాంలో ఏం జరుగుతోందన్నదే ముఖ్యం. తెలంగాణ పట్ల కేంద్రం సవతి ప్రేమ చూపుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ అంటున్నారు. విభజన సమస్యల్ని పట్టించుకోవడంలేదంటూ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే.
ఇది కూడా ఎన్నికల స్టంటేనా.?
ఇంకో రెండేళ్ళలో ఎన్నికలు జరుగుతాయ్. సో, మళ్ళ ఆనాటి విభజన గాయాల్ని తెరపైకి తెచ్చి రాజకీయ లబ్ది పొందాలనే ప్రయత్నాలైతే కొత్తగా షురూ అయ్యాయని అనుకోవాలేమో. పోన్లే, ఇలాగైనా విభజన సమస్యలు చర్చకు వచ్చి, ఆయా సమస్యల పరిష్కారమైతే అంతకన్నా కావాల్సిందేముంది.?
Also Read: పరాన్నజీవి ప్రొడక్షన్స్: ఈ చరిత్ర ఏ పైత్యంతో.!
కానీ, ఇప్పటికే ఎనిమిదేళ్ళు పూర్తయిపోయింది. ఇంకో రెండేళ్ళలో కొత్తగా తెలుగు రాష్ట్రాల్ని కేంద్రం ఉద్ధరించేదేముంటుంది.? ఈ విచిత్ర రాజకీయం, తెలుగు రాష్ట్రాల మధ్య మళ్ళీ ‘చిచ్చు’ రేపకుండా వుంటే చాలు.!
ఏదిఏమైనా, ఎనిమిదేళ్ళ తర్వాత.. అంతకు ముందు జరిగిన అన్యాయం గురించి మాట్లాడుకుంటూ, ఇప్పటికీ తెలుగు రాష్ట్రాలకు న్యాయం చేయకపోవడమంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకేముంటుంది.? అందుకేనేమో, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ‘రాజ్యాంగాన్ని మార్చేయాల్సిందే’నని అన్నది.