Table of Contents
అతడు నన్ను లైంగికంగా వేధించాడంటూ కొన్నేళ్ళ తర్వాత ఒకప్పటి వేధింపుల ప్రక్రియ గురించి చెప్పి, పాపులర్ అవడమే ‘మీ..టూ..’ అవుతుందా? ఈ ప్రశ్న ఇప్పుడు చాలామందిని వేధిస్తోంది. అసలు ‘మీ..టూ..’ అంటే ఏంటి.? అని చర్చించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రముఖ నటుడు అర్జున్ సర్జాపై కన్నడ హీరోయిన్ శృతి హరిహరన్ చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల తర్వాత ‘మీ..టూ..’ ఉద్యమం పక్కదారి పట్టిందనే అనుమానాలు అంతటా వ్యక్తమవుతున్నాయి. బాలీవుడ్ నటి తనూశ్రీ దత్తా, బాలీవుడ్ నటుడు నానా పటేకర్‌పై ఆరోపణలు చేయడంతో, దేశంలో ఈ ‘మీ..టూ..’ అంశం తాలూకు ప్రకంపనల తీవ్రత పెరిగింది. కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న వ్యక్తిపై ఈ ‘మీ..టూ..’ ఆరోపణలు తీవ్ర ప్రభావం చూపి, ఆయన తన పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది.
ఎందుకిలా డైల్యూట్ అవుతోంది?
అర్జున్ సర్జా, దక్షిణాదిలో మంచి పేరున్న నటుడు. నానా పటేకర్ కూడా మంచి నటుడే. అయితే, నానా పటేకర్‌లా అర్జున్ అగ్రెసివ్‌గా కనిపించడు. తన పని తాను చేసుకుపోతాడు. సుదీర్ఘ కాలంగా సినిమాల్లో వున్నా, ఏనాడూ అర్జున్ వివాదాల జోలికి పోలేదు. హీరోయిన్లతో ఇంటిమేట్ సీన్స్ విషయంలో చాలా రిజర్వ్‌డ్‌గా వుంటాడనే గొప్ప పేరు ఆయనకు వుంది. ఈ విషయంలో చాలామంది హీరోయిన్లు ఆయనకు ‘కితాబులు’ ఇచ్చిన సంగతిని మర్చిపోలేం.
తమిళ, తెలుగు సినిమాల్లో అర్జున్‌కి స్టార్‌డమ్ వుంది. అంతకు మించిన మంచి పేరుంది. అలాంటి వ్యక్తి, ఓ హీరోయిన్‌ని.. అదీ కూతురు వయసున్న హీరోయిన్‌ని లైంగికవ వేధింపులకు గురిచేశాడంటే ఎవరూ నమ్మలేకపోతున్నారు. ‘నువ్వే తప్పుడు ఆరోపణలు చేశావ్..’ అంటూ శృతి హరిహరన్‌ని చాలామంది నిలదీస్తున్నారు. సినీ పరిశ్రమలో ఒకరిద్దరు మినహాయిస్తే, చాలామంది మద్దతు అర్జున్‌కే కన్పిస్తోంది. అలాగని అర్జున్‌కి క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చేయలేం. అదే సమయంలో, శృతి హరిహరన్ ఆరోపణలు చేసినంతమాత్రాన అర్జున్ నేరస్తుడైపోడు.
అర్జున్ వర్సెస్ శృతి హరిహరన్
ఓ సినిమా షూటింగ్‌లో తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడనీ, సన్నివేశాల్ని ఇంటిమేట్‌గా తనకోసమే మార్చాడనీ అర్జున్‌పై అభియోగాలు మోపింది శృతి. అయితే, ఈ వయసులో తనకు అలాంటి సన్నివేశాలు వద్దని అర్జున్ చెప్పారంటూ సాక్షాత్తూ దర్శకుడే వివరణ ఇచ్చాడు. సినిమా విడుదలయ్యాక, అర్జున్ చాలా బాగా నటించాడనీ, తనలాంటివారిని ఆయన ప్రోత్సహించిన తీరు గొప్పదనీ శృతి చెప్పిన విషయాన్నీ అర్జున్ ‘కోట్’ చేశాడు.
అర్జున్ వివరణపై శృతి సంతృప్తి చెందలేదు. ఆయన పెద్ద నటుడు గనుక ఏం చేసినా చెల్లిపోతుందనీ, తన ఆరోపణలకు కట్టుబడి వున్నాననీ శృతి హరిహరన్ అంటోంది. ఇంకో నటి, అర్జున్ కారణంగా తానెలా వేధింపులకు గురయ్యిందీ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్‌ని శృతి తెరపైకి తెచ్చింది. అయితే ఆ వ్యక్తి తన పేరు వెల్లడించడానికి సుముఖత వ్యక్తం చేయలేదట.
అర్జున్ నుంచి త్యాగరాజన్ వరకు
మరో తమిళ ప్రముఖుడు త్యాగరాజన్‌పై స్టిల్ ఫొటోగ్రాఫర్ ప్రీతిక మీనన్ ‘మీ..టూ..’ ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. ప్రముఖ తమిళనటుడు ప్రశాంత్ తండ్రి త్యాగరాజన్. ఈయన దర్శకుడు, నిర్మాత కూడా. ఓ సినిమా షూటింగ్‌లో తనతో త్యాగరాజన్ అసభ్యకరంగా ప్రవర్తించాడని ప్రీతిక మీనన్ సంచలన ఆరోపణలు చేసింది. ఆ ఘటన జరిగినప్పుడు తన వయసు 21 ఏళ్ళనీ, అప్పుడు తాను ఆ వేధింపులపై ఎలా స్పందించాలో తెలియక మిన్నకుండిపోయానని ఆమె అంటోంది. తనపై వచ్చిన ఆరోపణలపై ఈ రోజు త్యాగరాజన్ వివరణ ఇవ్వబోతున్నారట.
నన్నూ వేధించారు: సంజన
కన్నడ బ్యూటీ సంజన, తనను కూడా ఓ సినిమా షూటింగ్ సమయంలో లైంగికంగా వేధించారని వాపోయింది. ‘గండ హెండాతి’ అనే సినిమా షూటింగ్ టైమ్‌లో దర్శకుడు తనతో అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా, ఒక్క ‘కిస్’ సీన్ వుందని చెప్పి తనను ఒప్పించి, 50కి పైగా ముద్దు సీన్స్‌ని తీశారనీ, ఈ క్రమంలో తనను బెదిరింపులకు గురిచేశారని, అలాగే ఓ తెలుగు సినిమా షూటింగ్ సమయంలో విదేశాల్లో తాను వేధింపులకు గురయ్యానని సంజన చెబుతోంది. ఆమె ఆయా వ్యక్తుల పేర్లనూ బయటపెట్టింది.
ఏదిఏమైనా, ‘మీ..టూ..’ ఉద్యమ ప్రకంపనల తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. అదే సమయంలో, ఉద్యమం పక్కదారి పట్టేలా కన్పిస్తోందన్న ఆరోపణలూ ఉన్నాయి. ‘మనమంతా ఐక్యంగా వుండాలి..’ అంటూ కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ లాంటివాళ్ళు ‘మీ..టూ..’ ఉద్యమానికి మద్దతిస్తోన్న సంగతి తెల్సిందే. వేధింపులకు గురయ్యామంటున్నవారే కాదు, తమకు అలాంటి పరిస్థితులు ఎదురు కాకపోయినా ఈ ఉద్యమానికి బాసటగా నిలుస్తున్నారు.