Table of Contents
Cadaver Telugu Review.. అసలు కడవర్ అంటే ఏంటి.? ఈ ప్రశ్నకు సమాధానం తర్వాత తెలుసుకుందాం. ‘కడవర్’ పేరుతో ఓ సినిమా వచ్చింది. డస్కీ బ్యూటీ అమలాపాల్ నటించి, నిర్మించిన చిత్రమిది.
కేవలం ఓటీటీ కోసమే అన్నట్లుగా ఈ సినిమాని తెరకెక్కించారేమో.! కానీ, థియేటర్లలో విడుదలైనా, ఈ సినిమాకి మంచి అప్లాజ్ వచ్చేదే.
మరీ అద్భుతం అనలేంగానీ, ఇప్పుడొస్తున్న చాలా చెత్త సినిమాలతో పోల్చితే ‘కడవర్’ ఓ ‘వెరీ గుడ్’ ఫిలిం అని చెప్పుకోవచ్చు.
అమలా పాల్ సమ్‌థింగ్ స్పెషల్..
తెలుగులో ‘నాయక్’ తదితర సినిమాల్లో నటించింది అమలా పాల్. నటిగా ఆమె ఎప్పుడో మంచి గుర్తింపు సంపాదించుకుంది. గ్లామరస్ హీరోయిన్.. అనే ఇమేజ్ ఛట్రం ఆమెకు కొంత ఇబ్బందికరంగా అనిపించినట్టుంది.
తన నటనా ప్రతిభను ఆవిష్కరించేందుకు భిన్నరకాలైన పాత్రలు ఎంచుకుంటోంది. ఈ క్రమంలో ఆమె ఓటీటీ వైపు కూడా చూస్తోంది. ఆ మధ్య ఓ వెబ్ సిరీస్‌లో నటించింది అమలా పాల్.
పోలీస్ డాక్టర్.!
ఇప్పుడీ ‘కడవర్’ కూడా భిన్నమైనదే. పోలీస్ అవ్వాలనుకుని, వైద్యురాలిగా మారుతుంది ఈ సినిమాలో భద్ర (అమలా పాల్).

మార్చురీలో ఆమె పనిచేస్తుంటుంది.. పోస్టుమార్టమ్ చేసే క్రమంలో హత్య, ఆత్మహత్య, సాధారణ మరణం.. వంటి వాటి గురించి ‘రూఢీ’ చేయడం ఆమె పని.
ఓ సీరియల్ కిల్లర్‌ని పట్టుకునే క్రమంలో పోలీసులు, భద్ర సాయం తీసుకుంటారు. పోలీస్ చేయాల్సిన పనిని డాక్టర్ చేస్తే ఎలా వుంటుంది.? ఇంతకీ ఆ సీరియల్ కిల్లర్ ఎవరు.? అవన్నీ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
మృతదేహాలతోనే సావాసం చేస్తుంది భద్ర. ఈ క్రమంలో మనకి సినిమా నిండా శవాలే కనిపిస్తాయ్. అదే సమయంలో ఓ అందమైన ప్రేమకథ కూడా కనిపిస్తుంది. గుండె లోతుల్ని తాకే సెంటిమెంట్ కూడా వుంది ఈ సినిమాలో.
Cadaver Telugu Review.. ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్..
థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌కి కూడా కొరత లేదు. ఓవరాల్‌గా చెప్పాలంటే ఇదొక ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్. అమలా పాల్ నటిగా మరోమారు మంచి మార్కులేయించుకుంది. ఇతర ప్రధాన పాత్రధారులంతా తమ పాత్రల పరిధి మేర నటించారు.
సినిమాటోగ్రఫీ చాలా బావుంది. ఎడిటింగ్ కూడా ఆకట్టుకుంటుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ముఖ్యమైన సన్నివేశాల్ని బాగా ఎలివేట్ చేసింది.
Also Read: ప్చ్.! తొక్కేస్తున్నారు.. పాపం చిన్న పిల్లాడ్ని.!
ఓవరాల్‌గా ‘కడవర్’ ఓ ఎంగేజింగ్ థ్రిల్లర్ అని చెప్పుకోవచ్చు. ఓటీటీ బొమ్మ గనుక, కాస్త ఖాళీ చూసుకుని ఎంచక్కా థ్రిల్ అవ్వొచ్చు ‘కడవర్’ చూసి.
ఇంతకీ ‘కడవర్’ అంటే ఏంటి.? వైద్య అవసరాల కోసం ఉపయోగించే మృతదేహాన్ని ‘కడవర్’ అంటారట.! ఆ విషయాన్ని ప్రధాన పాత్రధారి భద్ర, సినిమా ముగింపు సందర్భంలో చెబుతుంది.