Cancer Liquor Tobacco.. ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ బాధితుల సంఖ్య రోజు రోజుకీ అనూహ్యంగా పెరుగుతోంది. భారత్ లాంటి దేశాల్లో ఈ మహమ్మారి తీవ్రత అంతకు మించి.. కనిపిస్తోంది.!
క్యాన్సర్‌పై పోరాటంలో భాగంగా వ్యాక్సిన్లను అభివృద్ధి చేసేందుకు ఆయా దేశాలు ప్రయత్నిస్తున్నాయి. అయితే, పరిశోధనలు ఆశించిన మేర సత్ఫలితాలను ఇవ్వడంలేదు.
కొన్ని రకాల క్యాన్సర్లను నివారించేందుకు ఇప్పటికే వ్యాక్సిన్లు అందుబాటులో వున్నాయ్. కానీ, అవి సరిపోవు.! క్యాన్సర్ కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయి.
నిజానికి, క్యాన్సర్ చికిత్స.. అంటే, అది అత్యంత ఖరీదైన వ్యవహారం. పోనీ, అంతా ఖర్చు చేసినా ప్రాణాలు కాపాడుకోగలమా.? అంటే, అదీ అనుమానమే.
చికిత్స కంటే, నివారణ ముఖ్యం.. ఇదీ క్యాన్సర్ విషయంలో వైద్యులు ప్రముఖంగా చెప్పే మాట. ఆరోగ్యకరమైన జీవన శైలి, చాలా క్యాన్సర్లు రాకుండా చేస్తుందని వైద్యులు చెబుతుంటారు.
కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆరోగ్యకరమైన జీవన శైలి సాధ్యమేనా.? ప్రధానంగా మద్యం, ధూమపానం.. క్యాన్సర్ కేసులు పెరగడానికి కారణమవుతున్నాయి.
లిక్కర్ అనేది, ఆయా వ్యక్తుల వ్యక్తిగత దురలవాటు. ధూమపానం అలా కాదు. ధూమపానం చేసేవారితోపాటుగా, కుటుంబ సభ్యులు, సన్నిహితులు కూడా క్యాన్సర్ బారిన పడే ప్రమాదముంది.
కల్తీ ఇంకో ముఖ్యమైన అంశం. ఆహార పదార్థాల కల్తీ కూడా చాలా రకాల క్యాన్సర్లకు కారణమవుతోందని పరిశోధనలు చెబుతున్నాయి.
ప్రభుత్వాల వైపు నుంచి, క్యాన్సర్ నివారణ చర్యలంటే.. కల్తీని అరికట్టడం అలాగే, ధూమపానంతోపాటు మద్యపానానికి ఆస్కారం లేకుండా చేయడం చాలా ముఖ్యం.
మద్యంపై వచ్చే ఆదాయం ప్రభుత్వాలకు కీలకం. పొగాకు ఉత్పత్తులూ ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయాన్ని తీసుకొస్తాయ్. సో, వాటిని ప్రభుత్వాలు బ్యాన్ చేయడానికి ఇష్టపడవు.
క్యాన్సర్ పట్ల అవగాహన విషయంలో కావొచ్చు, క్యాన్సర్ వైద్యానికి సంబంధించి కావొచ్చు.. ప్రభుత్వాలు వేల కోట్లు ఖర్చు చేస్తున్నమాట వాస్తవం.
పైన చెప్పుకున్నట్లు, మద్యాన్ని నిషేధిస్తే.. పొగాకు ఉత్పత్తుల్నీ నిషేధిస్తే.. క్యాన్సర్‌పై విజయం దిశగా ముందడుగు వేసినట్లే అవుతుంది. కానీ, పిల్లి మెడలో గంట కట్టేదెవరు.?
