Table of Contents
Chandrababu Arrest Political Vengeance.. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడిని స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సీఐడీ అరెస్టు చేసింది.
సో.! ఇక్కడ ఓ ముచ్చట తీరిపోయింది.! ఎవరి ముచ్చట.? అన్నది తర్వాత మాట్లాడుకుందాం.!
చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో, రాష్ట్ర రాజకీయాలు అనూహ్యంగా వేడెక్కాయ్. చంద్రబాబు అరెస్టుని, వైసీపీ తప్ప దాదాపు అన్ని రాజకీయ పార్టీలూ ఖండించాయి.
తప్పు చేసి వుంటే, చంద్రబాబుని ఎవరూ సమర్థించరు. అయితే, అరెస్టు తీరుపై మాత్రం సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
హత్య కేసు కాదు కదా.! స్కామ్.. నోటీసులు ఇచ్చి, అరెస్టు చేసుకోవచ్చన్నది ఓ వాదన.! ఎవరి గోల వారిది.!
Chandrababu Arrest Political Vengeance.. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగమేనా.?
అరెస్టువుతానన్న విషయం చంద్రబాబుకి ముందే తెలుసు. అలాంటప్పుడు ముందస్తు బెయిల్ కోసం ఎందుకు ప్రయత్నించలేదు.?
రాజకీయాలన్నాక విమర్శలు సహజాతి సహజం. అరెస్టులు ఇంకా సహజాతి సహజం. వ్యవస్థల్ని రాజకీయాల కోసం వాడుకోవడమూ అంతే సహజం.
సో, చంద్రబాబు అరెస్టుని మరీ బూతద్దంలో చూసెయ్యాల్సిన పనిలేదు. బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుంటారు.. ఆ తర్వాత వ్యవహారం కోర్టు పరిధిలోకి వెళుతుంది.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏం జరిగిందో చూశాం. ఓ ఎంపీ అత్యంత దారుణంగా హత్యకు గురైతే, ఆ కేసు ఇప్పటికీ అతీ గతీ లేకుండా సాగుతోంది.. అదీ సీబీఐ విచారణలో.
వ్యవస్థలు ఎలా తగలడ్డాయంటే..
దేశంలో వ్యవస్థలు ఇలా తగలడినప్పుడు, స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏదో అద్భుతం జరిగిపోతుందనుకుంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.
పవన్ కళ్యాణ్, ఈ అరెస్టు తీరుని ఖండించారంటే.. విపక్ష నేతగా ఆయన బాధ్యత అది. బీజేపీ కావొచ్చు, కాంగ్రెస్ కావొచ్చు.. అదే కోణంలో చంద్రబాబు అరెస్టు తీరుని ఖండించాయ్.
అధికారంలో ఎవరు వున్నాగానీ.. వ్యవస్థల్ని తమ చెప్పు చేతల్లో పెట్టుకుని.. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఇదిగో ఇలాంటి అరెస్టులకు తెరలేపడం సబబు కాదన్నది సర్వత్రా వినిపిస్తోన్న విమర్శ.
ముచ్చట తీరిపోద్ది.!
ఇక, ఇప్పుడు ముచ్చట విషయానికొద్దాం.! చేతనైతే అరెస్టు చేయండని చంద్రబాబు సవాల్ విసిరారు. ఆయన ముచ్చటని సీఐడీ తీర్చేసింది.!
రేప్పొద్దున్న టీడీపీ అధికారంలోకి వస్తే మాత్రం, ఇప్పుడు అధికారంలో వున్నవారి ముచ్చట తీరిపోతుంది. రాజకీయాలు ఇదివరకటిలా వుండవ్.!
ప్రజా సేవ కాదు, రాజకీయమంటే జస్ట్ కక్ష సాధింపు చర్యలు మాత్రమే సుమీ.!
Also Read: ఇండియా! భారత్! రెండు పేర్ల మధ్య చిచ్చు పెడుతున్నదెవరు?
చివరగా.. అక్రమాస్తుల కేసులో అరెస్టయి, దాదాపు ఏడాదిన్నర జైల్లో వున్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఏళ్ళ తరబడి సా..గుతోంది ఆ కేసు.
మరి, చంద్రబాబు విషయంలో ఏం జరుగనుంది.? ఇదీ అంతే.! అప్పుడు వైఎస్ జగన్ కేసులో లూటీ అయ్యిందని చెప్పబడిన సొమ్ములో కాస్తంతైనా ప్రభుత్వ ఖజానాకి చేరిందా.?
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ విషయంలో, నొక్కేయబడిందని చెప్పబడుతున్న సొమ్ము ప్రభుత్వ ఖజానాకి చేరుతుందా.?
కోర్టులు.. కేసులు.. అంటూ కోర్టు సమయం.. దర్యాప్తు సంస్థల సమయం.. వెరసి, బోల్డంత ప్రజాధనం వృధా.! రాజకీయ నాయకులకేం.. కేసుల పుణ్యమా అని పాపులారిటీ పెరిగి, అధికార పీఠం తేలిగ్గా దక్కుతుంది.!