కరోనా వైరస్ (కోవిడ్ 19) ప్రపంచాన్ని ఇంకా వణికిస్తూనే వుంది. భారతదేశంలో కరోనా మొదటి వేవ్.. పీక్స్‌ని చూసేసింది, క్రమంగా ఆ గ్రాఫ్ తగ్గుతూ వస్తోంది. ఈ సమయంలో కరోనా వైరస్‌కి (Covid 19 Corona Virus New Strain) సంబంధించి కొత్త ట్రెయిన్ భయాలు మొదలయ్యాయి.
యూకేలో గత సెప్టెంబర్‌లోనే ఈ కొత్త స్ట్రెయిన్‌ని కనుగొన్నారు. అప్పటినుంచీ పరిశోధనలు జరుగుతూనే వున్నాయి. ఈ పరిశోధనల్లో, కరోనా కొత్త స్ట్రెయిన్ అత్యంత వేగంగా ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందే గుణం కలిగి వున్నట్లు తేలింది.
మరోపక్క, కొత్త స్ట్రెయిన్ ద్వారా కరోనా సోకినవారి సంఖ్య క్రమంగా పెరుగుతుండడంతో, యూకే నుంచి వచ్చే ప్రయాణీకులపై ఆంక్షలు విధిస్తున్నాయి ప్రపంచంలోని పలు దేశాలు. భారత దేశం కూడా యూకే నుంచి వచ్చే విమానాల్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
అయితే, సెప్టెంబర్‌లో ఈ కొత్త స్ట్రెయిన్ వెలుగు చూసిన దరిమిలా, ఇప్పటికే ప్రపంచంలోని చాలా దేశాలకు ఇది పాకేసి వుండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బ్రిటన్ నుంచి వచ్చినవారి వివరాలు సేకరించి, వారికి ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమయ్యింది.
అయితే, కొత్త స్ట్రెయిన్ వల్ల అదనపు సమస్యలు ఏమీ లేవనీ, కరోనా వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వస్తున్న దరిమిలా, మరీ అంత భయపడాల్సిన పనేమీ లేదని వైద్య నిపుణులు భరోసానిస్తున్నారు.
‘ముప్పు ఇంకా తొలగిపోలేదు.. అలాగని, భయపడాల్సిన పనిలేదు. కానీ, జాగ్రత్తలు మాత్రం తీసుకోవాల్సిందే. మాస్క్ ధరించడం, చేతులు పరిశుభ్రంగా వుంచుకోవడం, సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం అనేవి న్యూ నార్మల్ అని భావించాలి..’ అని వైద్య నిపుణులు కుండబద్దలుగొట్టేస్తున్నారు.
ఆ దేశం, ఈ దేశం అన్న తేడాల్లేకుండా ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ (Covid 19 Corona Virus New Strain) భయంతో విలవిల్లాడుతున్న దరిమిలా, వ్యాక్సిన్ ఎంతవరకు ఈ భయాల్ని పోగొట్టగలుగుతుందన్న ఉత్కంఠ అంతటా నెలకొంది. మన దేశంలో జనవరి నెలలో ఏ వారంలో అయినా కరోనా వ్యాక్సిన్ వినియోగంలోకి రావొచ్చని అంచనా వేస్తున్నారు.