ఓ వైపు కొన్ని దేశాలు ఇప్పటికే కరోనా వ్యాక్సిన్‌ని (Covishield Vaccine Against Corona Virus) తమ పౌరులకు అందించేస్తున్నాయి. ఇంకోవైపు కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ దూసుకొచ్చేసింది. మరి, కొత్త స్ట్రెయిన్‌పై ఏ వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తుంది.? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి శాస్త్రవేత్తలు తటపటాయించాల్సి వస్తోంది.
అయితే, కరోనా వైరస్ (కోవిడ్ 19)పై పోరులో ‘కోవిషీల్డ్’ని బ్రహ్మాస్త్రంగా అభివర్ణిస్తున్నారు కొందరు శాస్త్రవేత్తలు. నిజానికి, ఇప్పటికే అందుబాటులో వున్న ఫైజర్ అలాగే మోడెర్నా వ్యాక్సిన్లతో పోల్చితే, ఆక్స్‌ఫర్డ్ ఆస్ట్రా జెనకా ‘ఏజెడ్‌డీ 1222’ (కోవిషీల్డ్) టీకా సామర్థ్యం తక్కువే.
ఫైజర్, మోడెర్నా టీకాలు 90 శాతం వరకు కరోనా వైరస్‌కి అడ్డుకట్ట వేయగలవు. అదే, కోవిషీల్డ్ విషయానికొస్తే.. దీని సామర్థ్యం కేవలం 70 శాతమే. అయితే, మూడో దశ ప్రయోగాల్ని రెండు విధాలుగా ఆక్స్‌ఫర్డ్ ఆస్ట్రా జెనకా జరపడం గమనార్హం.
ఓ విధానంలో రెండు డోసులు ఇచ్చి పరీక్షించారు.. ఇంకో విధానంలో ఒక పూర్తి డోసు, ఇంకోటి అరడజను డోసుతో ప్రయోగాలు చేశారు. ఒకదానిలో 62 శాతం ఫలితం రాగా, ఇంకోదాట్లో 90 శాతం సామర్థ్యాన్ని కోవిషీల్డ్ సాధించింది. కొత్త స్ట్రెయిన్‌ని సైతం ఎదుర్కొనే సత్తా కోవి షీల్డ్‌కి వుందని ఆస్ట్రాజెనకా నిపుణులు చెబుతుండడం మరో ఆసక్తికరమైన అంశం.
దీంతో, బ్రిటన్ యుద్ధ ప్రాతిపదికన కోవిషీల్డ్ వ్యాక్సిన్‌కి అనుమతులు మంజూరు చేసింది. పైగా, కోవిషీల్డ్ వ్యాక్సిన్ (Covishield Vaccine Against Corona Virus) ధర కూడా తక్కువేనన్న ప్రచారం జరుగుతోంది. భారత కరెన్సీలో దీని ధర 250 రూపాయలు మాత్రమే (ఒక డోసు) వుండొచ్చని సమాచారం. మరోపక్క, భారతదేశం తయారు చేస్తోన్న కోవాక్జిన్ కోసం ప్రపంచ దేశాలు ఎదురుచూస్తున్నాయి.
చవకగా మాత్రమే కాదు, అత్యంత సమర్థవతంగా కరోనా వైరస్‌పై కోవాగ్జిన్ పనిచేయగలదన్నది శాస్త్రవేత్తల అంచనా. వ్యాక్సిన్ తయారీ, దాంతోపాటుగా దాన్ని సరైన వాతావరణంలో నిల్వ చేయడం.. వంటి వాటికి సంబంధించిన సానుకూలతల ఆధారంగా ఆయా దేశాలు ఆయా టీకాల వైపు మొగ్గు చూపుతాయి.
ఇప్పటికే, చాలా దేశాలు తమ పౌరులకు వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించినప్పటికీ, వ్యాక్సిన్‌పై ప్రయోగాలు ఇంకా కొనసాగుతూనే వున్నాయి. ఇప్పటికే అందుబాటులో వున్న అన్ని వ్యాక్సిన్లూ, అత్యవసర వినియోగం కోసం అనుమతి పొందినవే.