Dasara Review.. ఓ కొత్త దర్శకుడి చేతిలో అంత బడ్జెట్ ఎలా పెట్టారు.? ఏకంగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ‘దసరా’ సినిమాని నాని ఎలాపోల్చగలిగాడు.? ఇలా చాలా అనుమానాలతో థియేటర్లలోకి అడుగు పెడతాం.!
సినిమా ప్రారంభమవుతూనే, మనల్ని కొత్త ప్రపంచంలోకి తీసుకెళుతుంది. ఎటు చూసినా బొగ్గు మసి కనిపిస్తుంది. మనుషుల మొహాల నిండా.. ఆ ఊరి నిండా.!
భయం తగ్గించుకోవడానికి ‘లిక్కర్’ సాయం తీసుకునే హీరో, అతనికి ధైర్యాన్నిచ్చే ఓ స్నేహితుడు.! ఈ ఇద్దరికీ ఓ స్నేహితురాలు. ఆ ఊరిలో ఓ సారా కొట్టు, దాని చుట్టూ రాజకీయం.!
‘దసరా’ కథ గురించి చెప్పుకోవాలంటే.. ఇలా మొదలు పెట్టాలి.! ఇదొక రివెంజ్ స్టోరీ.! ఓ గ్రామంలోని ‘రా’ అండ్ ‘రస్టిక్’ కథ.!
Dasara Review.. ధరణిగా జీవించేశావ్ నానీ.!
ధరణి పాత్రలో నాని ఒదిగిపోయాడనటం కంటే, జీవించాడనటం సబబేమో.! నాని ఎలాగూ నేచురల్ స్టార్ అతని గురించి కొత్తగా ఏం చెప్పగలం.?
దీక్షిత్ శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కొన్ని చోట్ల నానిని డామినేట్ చేసేశాడనటం అతిశయోక్తి కాకపోవచ్చు. ‘మహానటి’తో పోల్చదగ్గ పాత్ర కాదుగానీ, కీర్తి సురేష్ మరోమారి తనదైన ప్రత్యేకతను చాటుకుంది.
సినిమాలో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది సినిమాటోగ్రఫీ గురించి. అలాగే తెలంగాణలో.. అందునా, సింగరేణి ప్రాంతంలో వినిపించే ప్రత్యేకమైన స్లాంగ్ గురించి.
ఇటు సినిమాటోగ్రపీ మనల్ని వేరే లోకంలోకి తీసుకెళితే, ఆ స్లాంగ్.. మనల్ని ఓ పల్లెటూరులో కూర్చోబెడుతుంది. రివెంజ్ డ్రామా.. కొత్తదేమీ కాదు. కాకపోతే, ఇంటర్వెల్ బ్లాక్.. క్లయిమాక్స్.. బీభత్సమైన కిక్ ఇస్తాయి.
ఆ సాగతీత కాస్త ఇబ్బందికరం..
ఫస్టాఫ్ వేగంగా గడిచిపోతుంది. సెకెండాఫ్‌లో మాత్రం సాగతీత అనిపిస్తుంది అక్కడక్కడా. సముద్రఖనితో చెప్పించిన ‘పురాణాల కంటే గొప్పోళ్ళం కాదు..’ అని చెప్పించిన డైలాగ్ వేరే లెవల్.!
కొన్ని డైలాగ్స్ అర్థం చేసుకోవడానికి ఇబ్బంది పడతాం. కానీ, అవి మట్టిలోని మాణిక్యాల్లాంటివి.! వెతుక్కోవాల్సిందే.. తప్పదు.!
సంగీతం విషయానికొస్తే.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరింత ఎఫెక్టివ్‌గా ఆశిస్తాం. కథ అలా డిమాండ్ చేస్తుంది మరి.! ఆ విషయంలో ఫుల్ మార్క్స్ ఇవ్వలేం.

సెకెండాఫ్ మీద ఎడిటింగ్ విభాగం ఇంకాస్త ఫోకస్ పెట్టి వుంటే బావుండేది. ‘రంగస్థలం’ సినిమా తాలూకు పోలికలు కనిపిస్తాయ్.. చిత్రంగా ఆ ‘రంగస్థలం’ విడుదలైన ఐదేళ్ళకు ఈ ‘దసరా’ వచ్చింది.
‘ఆర్ఆర్ఆర్’, ‘కేజీఎఫ్’ చిత్రాల సరసన ‘దసరా’ నిలుస్తుందంటూ, సినిమాపై అంచనాల్ని పెంచేశాడు నాని. వాటిని మైండ్‌లో పెట్టుకుని సినిమా చూస్తే మాత్రం, ‘నానీ.. ఏం చెప్పావ్.? ఏం చేశావ్.?’ అనిపిస్తుంది.
ఆ సినిమాల ఆలోచన పక్కన పడేసి సినిమా చూస్తే మాత్రం, వారెవ్వా నాని.. అనిపిస్తుంది. ప్రాణ స్నేహితుడ్ని కోల్పోయిన సీన్‌లో.. నాని పీక్స్ అంతే.!
మొత్తంగా చూసుకుంటే, ‘దసరా’ చూడదగ్గ సినిమానే.! నాని కోసం మాత్రమే కాదు, దీక్షిత్ శెట్టి కోసం, కీర్తి సురేష్ కోసం కూడా.!
Also Read: Happy Birthday Vishwak Sen: మాస్ కా ‘మ్యాజిక్’ దాస్.!
కాస్సేపు వీర్లపల్లి అనే గ్రామానికి వెళ్ళి.. అక్కడి మట్టి వాసనని, బొగ్గు మసినీ.. ధరణి, సూరిగాడు, వెన్నెల స్నేహాన్నీ.. అక్కడి రాజకీయాల్నీ అనుభూతి చెంది రావొచ్చు.!
మేకింగ్ పరంగా చూసుకుంటే, ఎక్కడా నిర్మాతలు రాజీపడలేదు. దర్శకుడు కోరినవన్నీ సమకూర్చినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. టెక్నీషియన్ల నుంచీ దర్శకుడికి మంచి సహకారమే లభించింది.
కొన్ని చోట్ల దర్శకుడు తడబడినట్లు కనిపిస్తుంది. ప్రధానంగా సెకెండాఫ్‌లో. తొలి సినిమా కావడంతో, ఆ పొరపాట్లను అర్థం చేసుకోవాల్సిందే.
కాకపోతే, పెరిగిన అంచనాల నేపథ్యంలో… కాదు కాదు, నాని పెంచేసిన అంచనాల వల్ల ‘ఇలా చేసి వుంటేనా..’ అన్న అభిప్రాయం ఆడియన్స్‌లో కలగడం సహజం.
దర్శకుడు శ్రీకాంత్ ఓదెల నుంచి తదుపరి సినిమాని ఖచ్చితంగా వేరే లెవల్‌లో ఆశించొచ్చు. ముందు ముందు తెలుగు తెరపై ఓ అద్భుతాన్ని ఆయన్నుంచి ఆశించొచ్చు కూడా.!