టాలీవుడ్ రివ్యూ: మూవీ ఆఫ్ ది ఇయర్ 2021
Movie Of The Year 2021 కరోనా ప్యాండమిక్ తెలుగు సినీ పరిశ్రమని నిలువునా ముంచేసింది. 2020 సంవత్సరాన్ని కోవిడ్ 19 పూర్తిగా మింగేసిందని చెప్పొచ్చు.. తెలుగు సినిమాకి సంబంధించినంత వరకూ. 2021లో కరోనా కష్టాలుండవని తెలుగు సినీ పరిశ్రమ భావించినా, సేమ్ సీన్ రిపీట్ అయ్యింది.
పరిశ్రమ మరింతగా కుంగిపోయింది. అయినా కానీ, ధైర్యం కూడదీసుకుని కొన్ని సినిమాలు నిర్మాణం పూర్తి చేసుకున్నాయ్. ప్రేక్షకుల ముందుకొచ్చాయ్. వీటిల్లో ఎన్ని కోవిడ్ 19తో పాటు రాజకీయ గాయాల నుంచి కోలుకున్నాయో, ఎవరు విజేతగా నిలిచారో చూద్దాం.
సినీ సంక్రాంతి.. ఊపు తెచ్చిందిగానీ.!
రవితేజ నటించిన ‘క్రాక్’ (Krack) సినిమాతో సంక్రాంతి ఊపు వచ్చింది తెలుగు సినీ పరిశ్రమకి. దాంతో పాటే వచ్చిన కొన్ని సినిమాలు ఫ్లాఫ్ అయినా, 2021 బిగినింగ్ బాగానే ఉందని ‘క్రాక్’ విజయంతో సినీ పరిశ్రమలో చర్చ జరిగింది. వాతావరణం కాస్త మెరుగవుతుందన్న తరుణంలో సెకండ్ వేవ్ సినీ పరిశ్రమని మళ్లీ దెబ్బ కొట్టింది.
ఈసారి కోలుకోవడం చాలా చాలా కష్టమైంది. కొంతమంది ప్రముఖుల్ని సినీ పరిశ్రమ కోవిడ్ కారణంగా కోల్పోవల్సి వచ్చింది కూడా. మొదటి వేవ్‌తో పోల్చితే సెకండ్ వేవ్ తీవ్రంగా బాధించినా సినిమా పరిశ్రమ వేగంగా కోలుకుంది. చెప్పుకోదగ్గ సినిమాలే వచ్చాయ్.
Also Read: శిష్యుడి ‘ఉప్పెనంత’ విజయం.. ఆ ధైర్యమిచ్చింది ఈ గురువే.!
ఏదైనా సినిమా రిలీజవుతోందంటే, ఆ హీరో, ఈ హీరో అన్న తేడా లేకుండా అందరూ కలిసి కట్టుగా ఆయా సినిమాల్ని ప్రమోట్ చేయడం జరిగింది. అలా ఓ మోస్తరు సినిమాలు కూడా పెద్ద విజయాల్ని అందుకున్నాయ్.‘సీటీమార్’ తదితర సినిమాల విజయం ఇందుకు ఓ ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
పంజా వైష్ణవ్ తేజ్ (Panja Vaishnav Tej) తెరంగేట్రం చేసిన ‘ఉప్పెన’ క్లియర్ విక్టరీ సాధించింది. ప్రేక్షకులకి సినిమాలోని మెయిన్ ఎలిమెంట్ ఎలా అంత బాగా కనెక్ట్ అయ్యింది.? అన్నదానిపై ఇప్పటికీ చాలామంది ఆశ్చర్యపోతూనే వున్నారు. నటీనటులకి, దర్శకుడికీ బోల్డంత పేరు తెచ్చిన సినిమా ఇది.
‘లవ్ స్టోరీ’, ‘జాతి రత్నాలు’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ఇలా పలు సినిమాలు మంచి విజయాల్నే అందుకున్నాయి ఈ ఏడాది. కరోనా పాండమిక్ సమయంలోనూ థియేటర్లకు ప్రేక్షకుల్ని ఈ సినిమాలు బాగానే రాబట్టాయి.. తెలుగు సినీ పరిశ్రమలో బోల్డన్ని ఆశల్ని నింపాయి.
ముగింపు అదిరింది..
ఏడాది చివర్లో, అంటే 2021 డిసెబర్‌లో ‘అఖండ’ (Akhanda), పుష్ప’ (Pushpa), ‘శ్యామ్ సింగరాయ్’ (Shyam Singha Roy) సినిమాలు తెలుగు సినీ పరిశ్రమకి కొండంత బలాన్నిచ్చాయని చెప్పుకోవచ్చు. టాప్‌తో సంబంధం లేకుండా, కంటెంట్‌తో సంబంధం లేకుండా ఈ సినిమాల్ని ప్రేక్షకులు సొంతం చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల వివాదం వల్ల తలనొప్పి ఎదురైనా, ఈ మూడు సినిమాలూ ఆ లోటును తెలియనివ్వలేదు. పైగా ఆ వివాదాలు ఈ సినిమాల పట్ల సింపతీని ప్రేక్షకుల్లో పెంచి ఆ సినిమాల్ని పెద్ద విజయాల వైపు మళ్లించాయ్. అయితే, ఈ వివాదాల వల్ల ఆయా సినిమాలు నష్టపోయిన మాట వాస్తవమే.
Movie Of The Year 2021 ‘వకీల్ సాబ్’ నిఖార్సయిన విజేత..
ఓ సినిమా మీద ఇంతలా రాజకీయపరమైన కక్ష సాధింపులు ఇంతకు ముందెప్పుడూ లేవు. ఓ మంత్రి సినిమా సమీక్షకుడిగా మారిపోయి ‘వకీల్ సాబ్’ మీద దుష్ర్పచారానికి తెర లేపడం సిగ్గు చేటు. చెత్త సినిమా అంటూ, వెకిలి చేష్టలు చేశారు అధికార పార్టీ నాయకులు. ఏహ్య భావంతో రగిలిపోయారు. ధియేటర్లలో సినిమా ప్రదర్శనకు అడ్డు తగిలారు. వీటన్నింటినీ తట్టుకుని నిలబడింది ‘వకీల్ సాబ్’ సినిమా.
Also Read: ఓటీటీ బొమ్మ.. ఆ కిక్కే వేరప్పా.!
కరోనా ప్యాండమిక్ రెండో వేవ్ కూడా ‘వకీల్ సాబ్’ (Vakeel Saab) సినిమాని చుట్టుముట్టింది. అటు రాజకీయం, ఇటు కరోనా వైరస్.. రెండూ కలిసి ‘వకీల్ సాబ్’ మీద పగబట్టేశాయ్. ఇది నిజంగానే ‘వకీల్ సాబ్’ సినిమాకి అగ్నిపరీక్ష. చిత్రమేంటంటే, ‘వకీల్ సాబ్’ సినిమా రికార్డు స్థాయి వసూళ్లను సాధించింది.. అని అధికార పార్టీ నాయకులే ప్రకటించారు. ఓ మంత్రి ఈ సినిమా వసూళ్ల లెక్కల్ని అధికారికంగా ప్రకటించేశారు కూడా.
సో, ఎలా చూసినా 2021 సంవత్సరానికి సంబంధించినంత వరకూ అసలు సిసలు విజేత ‘వకీల్ సాబ్’ (Movie Of The Year 2021) సినిమానే. రాజకీయ కక్ష సాధింపులు, కరోనా ప్యాండమిక్ లేకపోయుంటే, ‘వకీల్ సాబ్’ వసూళ్ల రికార్డులు ఇంకే స్థాయిలో ఉండేవో ఏమో.
మొత్తమ్మీద 2021 తెలుగు సినిమా పరిశ్రమకి చిత్ర విచిత్రమైన అనుభవాల్ని మిగిల్చింది. 2022లో మరిన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి వుంది.