Democracy Rulers Vs People.. మొన్న ఆఫ్గనిస్తాన్.. తాజాగా శ్రీలంక.! అక్కడి పరిస్థితులు వేరు, ఇక్కడి పరిస్థితులు వేరు. కానీ, అక్కడా ఇక్కడా అన్యాయమైపోయింది సామాన్య ప్రజానీకమే.!
ఆప్గనిస్తాన్‌లో తాలిబన్ల అరాచకం నేపథ్యంలో అక్కడి ప్రజాస్వామ్య ప్రభుత్వం (!?) కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే. కీలక నేతలంతా దేశం విడిచి పారిపోయారు. ప్రజల జీవితాలు ఛిద్రమైపోయాయ్.!
శ్రీలంకలో కూడా అదే జరుగుతోంది. ప్రధాన మంత్రి రాజీనామా చేస్తే, అధ్యక్షుడు పారిపోవాల్సి వచ్చింది.
అయితే, ఇద్దరూ దేశం విడిచి పారిపోలేదు.. అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారంతే. కానీ, దేశం విడిచి పారిపోవాల్సిన పరిస్థితులు మాత్రం వచ్చాయి.!
Democracy Rulers Vs People.. ప్రజలు, ప్రభుత్వాలు.. రాజకీయాలు.!
దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్ అంటాడో కవి. కానీ, దేశమంటే రాజకీయం.! ఔను, దేశమంటే రాజకీయం మాత్రమే కొందరికి.
తమదే శాశ్వత అధికారం అనే భ్రమల్లో కొందరు వుంటారు. రాజకీయాల్లో వ్యక్తి పూజ పెరిగిపోతే, ప్రజాస్వామ్యానికి పాతర పడినట్లే లెక్క.
అయినాగానీ, రాజకీయాలన్నీ వ్యక్తి పూజ చుట్టూనే నడుస్తాయి. అధినేత మెప్పు కోసం నాయకులు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. ప్రజల కళ్ళకి ‘సంక్షేమ గంతలు’ కట్టేయడం పాలకులకు కొత్తేమీ కాదు.
Also Read: లీనా.! ‘కాళీ’పై వెకిలితనమా.! వాళ్ళపై చెయ్యగలవా.?
ప్రజల్ని ఆ మాయలో వుంచి, పాలకులు చేసే తప్పిదాలు, తద్వారా ప్రజల నెత్తిన పడే అప్పుల భారాలు.. వెరసి, ప్రజల బతుకే చివరికి ఛిద్రమైపోతుంటుంది.
అలా ప్రజాగ్రహం పుట్టుకొస్తే, నాయకులు చాలా తేలిగ్గా ‘పలాయనం’ చిత్తగిస్తారు. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. ప్రపంచంలో ఎక్కడైనా ఇదే నిప్పులాంటి నిజం.!