Table of Contents
తెలుగులో మల్టీస్టారర్ చిత్రాలు చాలా చాలా అరుదుగా వస్తుంటాయి. కొత్త తరహా కథలు తెలుగు తెరపై సినిమాలుగా అలరించాలంటే మల్టీస్టారర్స్ ఎక్కువగా రావాల్సి వుంది. ఆ దిశగా మిగతా హీరోలందరితో పోల్చితే, నాగార్జున ఎప్పుడూ ముందుంటాడు. మోహన్‌బాబుతోనూ, శ్రీకాంత్‌తోనూ.. ఇలా చెప్పుకుంటూ పోతే, నాగార్జున చేసిన మల్టీస్టారర్లు అన్నీ ఇన్నీ కావు. ఆ కోవలోనే తాజాగా మరో మల్టీస్టారర్ సినిమాలో నాగార్జున నటించాడు. ఈసారి నాగార్జున, నేచురల్ స్టార్ నానితో కలిసి ‘దేవదాస్’ సినిమా చేయడం, ఆ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవడం జరిగిపోయాయి. రేపే సినిమా విడుదల. ఇంతకీ, ఈ సరికొత్త ‘దేవదాస్’ కథేంటి.!
డాక్టరు.. డాన్..
ఈ సినిమాలో నాని (Natural Star Nani), డాక్టర్‌గా కన్పించబోతున్నాడు. ఆ డాక్టర్ దాసు దగ్గరకి ఓ పేషెంట్ వస్తాడు. అతనే, దేవా.. అదేనండీ కింగ్ నాగార్జున (King Akkineni Nagarjuna). దేవా ఓ రౌడీ లాంటోడన్నమాట. పేరుకే రౌడీ.. సినిమాలో దేవా పండించేదంతా ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అట. యంగ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రానికి దర్శకుడు. ఓ కొత్త దర్శకుడ్ని నమ్మి, నాగార్జున మల్టీస్టారర్ చేయడమంటే చిన్న విషయం కాదు. పైగా, ఇది తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నిర్మాణ సంస్థల్లో ఒకటైన ‘వైజయంతీ మూవీస్’ పతాకంపై చేస్తున్న సినిమా. సో, నాగార్జునకి ఎంత బాగా కథ నచ్చి వుంటే, ఈ సినిమా ఒప్పుకునేందుకు సిద్ధమయి వుంటాడు?
గ్లామరో గ్లామర్.!
‘దేవదాస్’ సినిమాకి నాగార్జున, నాని కాంబో కంటే ఇంకేం ‘హైలైట్’ పాయింట్ వుండాలి? అదొక్కటే కాదు, సినిమాకి గ్లామర్ అదనపు అడ్వాంటేజ్. ఆకాంక్ష సింగ్, నాగార్జున సరసన హీరోయిన్‌గా నటిస్తోంటే.. గోల్డెన్ బ్యూటీ రష్మిక మండన్న తొలిసారి నానితో జతకడ్తోంది. రష్మిక (Rashmika Mandanna) ఇప్పటిదాకా తెలుగులో చేసిన రెండు సినిమాలూ హిట్లే. ఒకటి ‘ఛలో’ కాగా, రెండోది ‘గీత గోవిందం’. ఛలో ఓ మోస్తరు హిట్ అయితే, ‘గీత గోవిందం’ సంచలన విజయాన్ని సాధించేసింది. ఏమాటకామాటే చెప్పుకోవాలంటే ఈ సినిమాలో ఆకాంక్ష (Akanksha Singh), రష్మిక గ్లామర్ విషయంలో ఒకరితో ఒకరు గట్టిగానే పోటీ పడ్డారట. ఆ పోటీలో రష్మికపై పైచేయి సాధించేసిందట ఆకాంక్ష. అలాగని రష్మిక తక్కువేమీ తిన్లేదటండీ!
ముదురు ప్రేమ కాదంటున్న నాగార్జున
ఆరు పదుల వయసొచ్చినా.. నవ మన్మథుడు నాగార్జున. తనను తాను ‘ముసలోడ్ని’ అని నాగార్జున చెప్పుకుంటే మాత్రం, జనం ఒప్పుకుంటారా? ఇంకా అతని మనస్సు, శరీరం పాటికేళ్ళ కుర్రాడిలానే వుంటాయి. అరవయ్యేళ్ళ వయసులో ఎవరైనా నాగార్జునలా కండలు తిరిగిన దేహంతో కన్పించగలరా? పైగా, ఫేస్‌లో ఆ హ్యాండ్సమ్ లుక్.. ఇప్పటికీ అమ్మాయిలు ఆయనంటే పడిచచ్చిపోయేలా వుంటుంది. నిజం చెప్పాలంటే, నాగార్జున ముందు నాని తేలిపోయాడనడం అతిశయోక్తి కాకపోవచ్చు. ఈ వయసులో ప్రేమేంటి? అని నాగ్ – ఆకాంక్ష గురించి ఎవరైనా అనుకోవచ్చుగాక. కానీ, ప్రోమోస్ చూస్తే.. కాంబినేషన్ కిర్రాకు పుట్టించేసిందని ఒప్పుకోవాలి.
ఓవర్సీస్‌లో వసూళ్ళ పంట పండాల్సిందే
‘దేవదాస్’ సినిమాని క్లీన్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దినట్లు కన్పిస్తోంది. ప్రోమోస్‌కి ఆల్రెడీ సూపర్బ్ రెస్పాన్స్ వచ్చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాని తెలుగు రాష్ట్రాలతోపాటు, విదేశాల్లోనూ (ఓవర్సీస్ మార్కెట్) భారీ స్థాయిలో విడుదలకు ప్లాన్ చేశారు. అమెరికాలో 180కి పైగా స్క్రీన్స్‌లో సినిమాని విడుదల చేస్తున్నారు. ప్రీమియర్స్‌తోనే భారీ వసూళ్ళను కొల్లగొట్టాలనే టార్గెట్‌తో వుంది ‘దేవదాస్’ టీమ్. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమాకి రికార్డ్ ఓపెనింగ్స్ రావొచ్చని అంచనా వేస్తున్నారు. అదే గనుక జరిగితే తెలుగులో మల్టీస్టారర్స్ ట్రెండ్ మరింతగా జోరందుకుంటుందని నిస్సందేహంగా చెప్పొచ్చు.
‘దేవదాస్’పై బిగ్‌బాస్ ఎఫెక్ట్ ఎంత?
‘దేవదాస్’ సినిమా మీద కౌశల్ ఆర్మీ కత్తి కట్టేసింది. అయితే నాగార్జున మీదున్న అభిమానంతో కౌశల్ ఆర్మీ ఎటూ తేల్చుకోలేకపోతోంది ఇంకా. కౌశల్‌ని బిగ్ హౌస్‌లో (BiggBoss2Telugu) నాని టార్గెట్ చేశాడనేది వారి ఆవేదన. అయితే, ఇటీవలి వీకెండ్‌లో కౌశల్‌ని నాని సమర్థించిన తీరుతో కౌశల్ ఆర్మీ కొంత మెత్తబడినట్లే కన్పిస్తోంది. ఈ వారం బిగ్‌బాస్ (BiggBossTelugu2) రియాల్టీ షో ముగింపుకి వచ్చేస్తోంది గనుక, ఫైనల్ ఎపిసోడ్‌లో నాని కౌశల్ ఆర్మీని మెప్సిస్తే, ‘దేవదాస్’కి అది అదనపు అడ్వాంటేజ్ అవొచ్చు. లేకపోయినా, అప్పటికే సినిమా రిజల్ట్‌పై క్లారిటీ వచ్చేస్తుంది గనుక.. పెద్దగా ఇంపాక్ట్ వుండదనేవారూ లేకపోలేదు.