బిగ్ జర్నీ.. గెలిపించిన కౌశల్ ఆర్మీ

 బిగ్ జర్నీ.. గెలిపించిన కౌశల్ ఆర్మీ

50 లక్షల రూపాయల ప్రైజ్‌ మనీ.. లక్షలాది మంది అభిమానుల అభిమానం ముందు బలాదూర్‌. నిజమే, బిగ్‌ బాస్‌ రియాల్టీ షో రెండో సీజన్‌ విన్నర్‌గా కౌశల్‌ అందుకున్న ప్రైజ్‌ మనీ కంటే, ఆయన చుట్టూ కమ్ముకున్న అభిమానమే చాలా గొప్పది. ఎంత గొప్పది.? అని చెప్పడానికి కొలమానం అనేది వుండదు. అభిమానం అంటేనే అంత. ఇండియా – పాకిస్తాన్‌ జట్ల మధ్య ఎక్కడో దుబాయ్‌లో క్రికెట్‌ మ్యాచ్‌ జరుగుతోంటే, ఆ మ్యాచ్‌లో అభిమానులు, ‘కౌశల్‌ నువ్వే బిగ్‌ బాస్‌ విజేతవి..’ అంటూ కౌశల్‌ గెలవాలన్న తమ ఆకాంక్షని చాటుకున్నారు. తెలుగు రాష్ట్రాలే కాదు, దేశమంతా ఆశ్చర్యపోయింది ఈ అభిమానాన్ని చూసి. ఇది అతిశయోక్తి కాదు, నిజం. ‘జీరోగా హైద్రాబాద్‌కి వచ్చాను.. ఇప్పుడిలా బిగ్‌బాస్‌ విజేతనై, ఈ వేదిక మీద నిల్చున్నాను..’ అని కౌశల్‌ గర్వంగా చెప్పాడంటే, ఆ విజయం అతనిది మాత్రమే కాదు, అతన్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన ‘కౌశల్‌ ఆర్మీ’ది కూడా.

అసలేంటీ కౌశల్‌ ఆర్మీ.?

బిగ్‌ బాస్‌ సీజన్‌ వన్‌ చూశాం. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హోస్ట్‌గా వ్యవహరించాడు ఆ సీజన్‌కి. రెండో సీజన్‌, నాని హోస్ట్‌గా నడిచింది. ఓ దశలో, ‘నాని ఎంత కౌశల్‌ ముందు.?’ అనే స్థాయికి ‘కౌశల్‌ ఆర్మీ’ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసింది. ఇంతకీ, ఈ కౌశల్‌ ఆర్మీ వెనుక వున్నదెవరు.? ఏమో, ఎవరికీ తెలియదు. కౌశల్‌ ఆర్మీ వెనుక వున్నది ఫలానా వ్యక్తి.. అంటూ చాలా పెద్ద ప్రచారమే జరిగింది. కాదు కాదు, ఇదంతా ప్లాన్డ్‌ వ్యవహారం.. కౌశల్‌, ముందుగానే అంతా సెట్‌ చేసుకుని వెళ్ళాడు.. అనే వాదనలూ లేకపోలేదు. కౌశల్‌, బిగ్‌ హౌస్‌లోకి వెళ్ళాక, ఆయన సతీమణి మొత్తం కథ నడిపించిందని ఇంకొందరన్నారు. కానీ, అదేదీ నిజం కాదు. ఎవరో మొదలు పెట్టారు.. అది ఓ ప్రభంజనమైపోయింది.

ఓ సాధారణ వ్యక్తికి ఆర్మీ ఎలా తయారయ్యింది.?

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా, కౌశల్‌ ఓ సాధారణ వ్యక్తి మాత్రమే. సీరియల్స్‌లో నటిస్తున్నాడు, కొన్ని సినిమాల్లో చేశాడు. మరీ అంత పాపులర్‌ సెలబ్రిటీ కాదు. అయితే బిగ్‌ బాస్‌ రియల్టీ షో రెండో సీజన్‌ స్టార్ట్‌ అయ్యాక, డే వన్‌ నుంచే పరిస్థితి మారిపోయింది. ‘ఈ వ్యక్తి కొంచెం డిఫరెంట్‌గా వున్నాడే..’ అన్న కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో కౌశల్‌ గురించి మొదలయ్యాయి. వాటిని కొందరు కొట్టిపారేశారు. కానీ, ఎప్పుడైతే హౌస్‌మేట్స్‌ – కౌశల్‌ని కార్నర్‌ చేయడం మొదలు పెట్టారో.. ‘కౌశల్‌కి మనం అండగా నిలుద్దాం..’ అని ఎవరికి వారు అనుకున్నారు.. సోషల్‌ మీడియాలో యుద్ధం మొదలు పెట్టేశారు. ఆర్మీ అంటే మిలిటరీ మాత్రమే కాదు, ఓ సమూహం.. అని అర్థాల్ని వివరించారు కూడా. ఎవరేమనుకున్నా డోన్ట్‌ కేర్‌.. తమ లక్ష్యం కౌశల్‌ గెలుపు.. అని అనుకున్నారు.. గెలిపించేశారు.

చెమర్చిన కళ్ళు..

కౌశల్‌కి తొలిసారి కౌశల్‌ ఆర్మీ గురించి తెలిశాక ఆయన కళ్ళలోని భావోద్వేగం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చెమర్చిన కళ్ళు అతని అంతరంగాన్ని ఆవిష్కరించాయి. ఆ ఆవేదనని ఆర్మీ ఇంకా గుండెల్లో పెట్టేసుకుంది. ‘మీకు మేమున్నాం..’ అనే భరోసా కౌశల్‌ ఆర్మీ ఇంకా ఎక్కువగా ఇస్తూ వచ్చింది. ‘నేనొక్కడ్నే.. నేనొక్కడ్నే..’ అంటూ అప్పటిదాకా ఆవేదన చెందిన కౌశల్‌, ‘నా వెనుక ఓ ఆర్మీ వుంది..’ అన్న ధైర్యంతో మిగిలిన రోజుల్ని హౌస్‌లో గడిపేశాడు. అయితే, నిజానికి అప్పటినుంచే కౌశల్‌, బిగ్‌ హౌస్‌లో మరింత కార్నర్‌ అయిపోయాడు. ఆ సందర్భమే కౌశల్‌లో ఆత్మస్థయిర్యాన్ని మరింత పెంచితే.. ఆ క్షణమే కౌశల్‌ని హౌస్‌లో మరింత ఒంటరిని చేయడానికి కారణమయ్యింది. అయినా కౌశల్‌ కుంగిపోలేదు, నిలబడ్డాడు.. టైటిల్‌ కొల్లగొట్టాడు.

ముందే ప్రకటించేసిన కౌశల్‌ ఆర్మీ..

నిజానికి ఒక్క రోజు ముందే కౌశల్‌ విజయాన్ని కౌశల్‌ ఆర్మీ డిక్లేర్‌ చేసేసింది. దాదాపు 40 కోట్ల ఓట్లు తేడాతో కౌశల్‌ గెలిచాడంటూ ఓ ప్రచారం జరిగింది. గీతా మాధురి రన్నరప్‌గా నిలిచినట్లూ పేర్కొన్నారు. అదే నిజమైంది. కౌశల్‌ ఆర్మీ తరఫున కొందరు అభిమానులు, కౌశల్‌ని ఘనంగా సన్మానించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు కూడా. ‘కంటికి రెప్పలా’ అన్న మాట ఇప్పుడు కౌశల్‌ అభిమానులకి వర్తిస్తుంది. నిజమే, కౌశల్‌ని కంటికి రెప్పలా కాపాడుకున్నారు.. కౌశల్‌ని విజయ తీరాలకు చేర్చారు. కౌశల్‌, తన అభిమానుల ఆశల్ని వమ్ము చేయలేదు.. చివరి వరకు ఒకే కాన్ఫిడెన్స్‌తో కనిపించాడు. ఎక్కడా తన ‘యాటిట్యూడ్‌’ మార్చుకోలేదు. అభిమానులకి, కౌశల్‌ ఇచ్చే బహుమతి ఇంతకన్నా ఇంకేముంటుంది?

Digiqole Ad

Related post

Leave a Reply