అదేమి చిత్రమో.. రాజకీయాల్లో ‘జంతువుల’ గోల (Dirty Political Animals) ఎక్కువైపోయింది. పెంపుడు కుక్కల ప్రస్తావన మరీ హీనంగా కనిపిస్తోంది. అనవసరంగా ఆ జంతువుల పరువు తీసేస్తున్నారు రాజకీయ నాయకులు ఎందుకనో. దున్నపోతు, ఊర కుక్క, పెంపుడు కుక్క, పంది.. బాబోయ్, వినడానికే కర్ణ కఠోరంగా అనిపించే మాటల్ని నిత్యం వినాల్సి వస్తోంది.
రాజకీయాల్లో గాంధీ గిరీ ఏనాడో మాయమైపోయింది. ఇప్పుడంతా గూండా గిరీ నడుస్తోంది. గూండా గిరీ, చెంచా గిరీ.. ఇదీ నేటి రాజకీయాల ట్రెండ్. అధినేత మెప్పు కోసం ఏ గడ్డి తినడానికైనా రాజకీయ నాయకులు వెనుకాడ్డంలేదు.
నిజానికి, అధినాయకుడి సైద్ధాంతిక ఆలోచనలు నచ్చి, ఆయన వెంట నడుస్తుంటారు మిగతా నాయకులు. అది పాత రోజుల వ్యవహారం. ఇప్పుడు సీన్ మారింది.
Dirty Political Animals కుక్కలమే.. పందులమే.. ఎనీ డౌట్స్.?
‘ఔను, మేం పెంపుడు కుక్కలమే..’ అని నిస్సిగ్గుగా చెప్పుకునే స్థాయికి నాయకులు దిగజారిపోయారంటే. పదవుల పట్ల వారి వ్యామోహం ఏ స్థాయిలో వుందో అర్థం చేసుకోవచ్చు.
Also Read: పవ‘నిజం’ శుద్ధ అబద్ధం.. ‘మార్పు’ అసాధ్యం.?
‘ఔను, నేను చవటనే.. ఔను, నేను దద్దమ్మనే.. ఔను, నేను పాలేరునే..’ ఇలా చెప్పుకుంటున్న నాయకులు, తమ ఆత్మగౌరవాన్ని నాశనం చేసుకుంటున్న వైనాన్ని గుర్తెరగడంలేదు.
బూతులు.. బండ బూతులు.. వినడానికి వీల్లేని బూతులతో విరుచుకుపడిపోవడమే కాక, దాడులకూ తెగబడుతున్నారు. ఏసీ రూముల్లో నాయకులు ఎంచక్కా ఈ రాక్షస క్రీడను ఎంజాయ్ చేస్తున్నారు. చిత్రమేంటంటే, కింది స్థాయి నేతలు, కార్యకర్తల తలలే పగులుతున్నాయ్.

ఈ ఊడిగం ఎందుకోసం.?
ఎవరికో ఊడిగం చేసే క్రమంలో తమ జీవితాల్ని పణంగా పెడుతున్న రాజకీయ పార్టీల అభిమానులు, కార్యకర్తలు.. రాజకీయ క్రీడలో సమిధలైపోతుండడం గమనార్హం. ఇంతలా నాయకులు కావొచ్చు, కింది స్థాయి కార్యకర్తలు కావొచ్చు.. చెంచా గిరీ చేయడం అవసరమా.?
Also Read: చట్ట సభల్లో నేర చరితులు.. పిల్లి మెడలో గంట కట్టేదెవరు.?
రాజకీయమంటే సేవ అనేది ఒకప్పటి మాట. ఇప్పుడు రాజకీయమంటే అదొక సంపాదనా మార్గం.. అందుకే, అదిప్పుడు అనేక కుట్రలకు కేంద్ర బిందువవుతోంది.
ఆ పార్టీ, ఈ పార్టీ అన్న తేడాల్లేవ్.. అన్ని రాజకీయ పార్టీల్లోనూ ఇదే తంతు. అంతా రొచ్చు కుంపటే.. అందులో పడి దొర్లుతున్న రాజకీయ నాయకులు, కార్యకర్తలు.. అవనసరంగా జంతువుల్ని తమతో పోల్చుకుని.. ‘జంతువుల్ని’ (Dirty Political Animals) ఎందుకు అవమానించడం.?