గేమ్ అన్నాక.. (Bigg Boss Telugu 4 Divi Vadthya) అందులో ఎత్తుకు పై యెత్తులు వుంటాయ్. కొన్ని సార్లు ఆ యెత్తులు, పైయెత్తులనేవి ‘మోసాలు’గా కనిపించొచ్చుగాక.! కానీ, అంతిమంగా గేమ్ గెలవడం అన్నది ముఖ్యమన్న కోణంలో ఆలోచిస్తే.. మిగతా విషయాలు లైట్ అనుకోవాల్సిందే.
బిగ్‌బాస్ తెలుగు సీజన్ ఫోర్ తాజా ఎపిసోడ్‌లో, బిగ్ టాస్క్ సందర్భంగా హ్యామన్స్, రోబోట్స్ మధ్య ‘టఫ్ ఫైట్’ నడుస్తోన్న విషయం విదితమే. రోబోట్స్ టీమ్ సభ్యుడైన అబిజీత్, పరిస్థితిని అంచనా వేసి.. తమ టీమ్ సభ్యులకు ఫిజికల్‌గా ‘పవర్’ లేకపోవడంతో, దాదాపుగా చేతులెత్తేశాడు.. కానీ, అరియానా గ్లోరీ ఒత్తిడి కావొచ్చు.. ఇతరత్రా కారణాలు కావొచ్చు.. అనూహ్యంగా కొత్త గేమ్ ప్లాన్‌ని తెరపైకి తెచ్చాడు.
హ్యామన్స్ టీమ్ సభ్యుల్ని ‘మోసం’ చేయడానికి పన్నాగం రచించాడు. నమ్మించాడు, దివిని హౌస్ లోపలకి రప్పించాడు. ఈ ప్లాన్ హ్యామన్స్ టీవ్‌ు సభ్యులెవరికీ తెలియదు. హౌస్‌లోకి వెళ్ళిన దివిని, అక్కడే బంధించి, చార్జింగ్ పెట్టేసుకున్నారు. అయితే, ఈ క్రమంలో దివి లోపల నుంచి అరుపులు, కేకలతో కాస్సేపు హోరెత్తించేసింది.
అంతే, హ్యామన్స్ టీమ్ అంతా కంగారుపడింది. అఖిల్, మెహబూబ్, సోహెల్ అయితే పూర్తిగా కంట్రోల్ తప్పారు. సుజాత, మోనాల్ గజ్జర్ కూడా ఆందోళన చెందారు. నోయెల్ సంగతి సరే సరి. చివరికి రోబోట్స్ తమ పని అయ్యాక, దివిని బయటకు పంపించారు. ఆమెతోపాటే లోపలికి వచ్చిన నోయెల్, అఖిల్, మెహబూబ్ తదితరులంతా అబిజిత్, హారిక, అరియానా, దేవిలతో ‘పంచాయితీ’ పెట్టుకున్నారు.
కాస్సేపు మాటల యుద్ధం జరిగింది. ‘నా వల్ల టీమ్ గెలిస్తే అది చాలు. నాకు ఏమైనా ఫర్వాలేదు..’ అంటూ అరియానా చెప్పినప్పుడు ఒప్పుకోని అబిజీత్, ఇలా ఎందుకు ‘వెన్నుపోటు’ పొడిచాడు.? అన్నది చర్చనీయింశమయ్యింది. ‘నేను చేసింది తప్పు అని మీకనిపిస్తే, నన్ను నామినేట్ చేసేసుకోండి..’ అనేశాడు చివరికి అబిజీత్.
చిత్రమేంటంటే, ఈ ‘వెన్నుపోటు’ ఎపిసోడ్‌కి గంగవ్వ కూడా సపోర్ట్ చేయడం. ఇంత హంగామా చేసి, ఆ తర్వాత అంతా ‘కూల్’ అయిపోయినట్లుగా షో చివర్లో ప్రోమో వదలడం గమనార్హం. అంటే, జరిగిందంతా పెద్ద డ్రామా అని అనుకోవాల్సిందేనా.? బిగ్ బాస్ ఈ టాస్క్ విషయంలో షాక్ ఇస్తాడా.? బిగ్ హోస్ట్ నాగ్, వీకెండ్‌లో కంటెస్టెంట్లకు క్లాస్ పీకేందుకు ఈ టాస్క్ ఉపయోగపడనుందా? వేచి చూడాల్సిందే.