గంగవ్వ.. (Gangavva Bigg Boss Telugu 4) ఈ పేరుకి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇంతవరకూ ఈ పేరు నెట్టింట ఓ పెను సంచలనం. ఇప్పుడు బిగ్ బాస్ రియాల్టీ షో పుణ్యమా అని తెలుగు బుల్లితెర వీక్షకుల నట్టింట్లోనూ సంచలనంగా మారింది. బిగ్‌బాస్ తెలుగు నాలుగో సీజన్‌లో గంగవ్వను స్పెషల్ కంటెస్టెంట్‌గా తీసుకొచ్చారు.
గంగవ్వకు హౌస్‌లో స్పెషల్ ట్రీట్‌మెంట్ కూడా అందుతోంది. స్పెషల్ కేరింగ్ ఆమెకు లభిస్తోంది. మిగతా కంటెస్టెంట్స్ అంతా ఆమెను చాలా ప్రత్యేకంగా చూస్తున్నారు. బిగ్‌బాస్ సంగతి పక్కన పెడితే, అంతకన్నా ముందే గంగవ్వ అంతర్జాతీయ మీడియాకి కూడా సుపరిచితురాలు.
యూ ట్యూబ్‌లో గంగవ్వ సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. బిగ్ బాస్ విషయానికొస్తే, హౌస్‌లోకి ఆమె ఎంటరయ్యింది మొదలు, ఆమె పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయిపోతోంది. ఆమె మద్దతుదారులు ఎడా పెడా, గంగవ్వ హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్లు, కామెంట్లు పెద్దయెత్తున పోస్ట్ చేస్తున్నారు.
‘గంగవ్వ మాస్.. ఈ సీజన్ విన్నర్ గంగవ్వే..’ అంటూ అప్పుడే హడావిడి ఓ రేంజ్‌లో చేసేస్తున్నారు. ఈ సీజన్ విన్నర్ అయితే ఏం చేస్తావ్? అని హోస్ట్ నాగార్జున అడిగితే, ‘నేను గెలుస్తానా.?’ అంటూ అమాయకత్వం ప్రదర్శించింది. కానీ, హౌస్‌లో గంగవ్వ జోరు అంతా ఇంతా కాదు. తోటి కంటెస్టెంట్ల మీద సెటైర్లు ఓ రేంజ్‌లో వేసేస్తోంది.
యంగ్ కంటెస్టెంట్స్, గంగవ్వ జోరు చూసి షాకవుతున్నారంటే అతిశయోక్తి కాదేమో. ‘ఏ వారం ఎవరు ఇంటికి వెళ్ళిపోతారో తెలియదు, ఈ మాత్రందానికి గొడవలెందుకు.?’ అంటూ గంగవ్వ హౌస్ మేట్స్‌తో చెప్పిన విషయం అందర్నీ ఆలోచింపజేస్తోంది.
కానీ, గేమ్ ఫార్మాట్ అలానే వుంది. గొడవలు తప్పవు. ఆ గొడవల్లో గంగమ్మ కూడా ఇరుక్కోక తప్పదేమో. అయితే, ఎక్కువ రోజులు గంగవ్వ హౌస్‌లో వుంటే మాత్రం, ఫిజికల్ టాస్క్‌లనూ చేయాల్సి రావొచ్చు. అప్పుడు ఆమెకి ప్రత్యేకంగా అవకాశం కల్పిస్తారా.? లేదంటే, ‘బస్తీ మే సవాల్..’ అని గంగవ్వే సత్తా చాటేస్తుందో చూడాలిక.
అన్నట్టు, బిగ్ బాస్ టైటిల్ గెలిస్తే ఏం చేస్తావ్? అన్న ప్రశ్నకి ‘మంచి ఇల్లు కొనుక్కుంటాను’ అని చెప్పింది గంగవ్వ (Gangavva Bigg Boss Telugu 4).