Table of Contents
Godavari Pulasa Fish.. పుస్తెలమ్మి అయినాగానీ, పులస తినాలి.. అన్నది వెనకటికి ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రముఖంగా వినిపించే మాట.
మాంసాహార ప్రియులు.. అందునా, ‘చేపలంటే’ బాగా ఇష్టం వున్నవారు.. ‘పులస’ని మత్స్యరాజంగా భావిస్తారక్కడ.
అసలు, గోదావరి నదీ జలాల్లోకి పులస ఎలా వస్తుంది.? అన్నదానిపై బోల్డంత సమాచారం అంతర్జాలంలో అందుబాటులోనే వుంది. దాని గురించిన చర్చ మళ్ళీ అనవసరం.
కొత్త నీరు వచ్చే సమయంలో, సముద్రం నుంచి గోదావరి నదిలోకి పులస చేప వస్తుంది.. అదీ సంతానోత్పత్తి కోసం. తిరిగి వెళ్ళే క్రమంలో, జాలార్లకు చిక్కుతుందని అంటుంటారు.
Godavari Pulasa Fish.. బంగాళాఖాతం నుంచి గోదావరిలోకే ఎందుకు.?
బంగాళాఖాతం నుంచి అసలు పులస చేపలు, గోదావరి నదిలోకే ఎందుకు వస్తాయి.? అంటే, దాదాపుగా బంగాళాఖాతంలో కలిసే, నదులన్నిటిలోకీ, పులస ఎదురీదుతుందనే వాదనా లేకపోలేదు.
అయితే, ‘పులస’ అన్న పేరు, గోదావరి జిల్లాల్లోనే పాపులర్. గోదావరి నదిలోకి వచ్చాకనే, అది ‘పులస’గా మారుతుందిట. అంతకు ముందు దాని పేరు, ‘హిలస’. ‘ఇల్సా’ అని కూడా అంటారు.
బంగ్లాదేశ్ నుంచి బంగాళాఖాతం మీదుగా, ఈ చేప గోదావరిలోకి చేరుతుంది. ‘ఇల్సా’ చేపకి మళ్ళీ ఘనమైన చరిత్ర వుంది బంగ్లాదేశ్‌లోనూ, వెస్ట్ బెంగాల్‌లోనూ.
అబ్బే, అదీ ఇదీ వేర్వేరు.. అనే వాదనలూ లేకపోలేదు.. అది మళ్ళీ వేరే చర్చ.
ఎందుకు తగ్గుతోంది.?
గత కొన్నేళ్ళుగా, గోదావరి నదీ జలాల్లో ‘పులస’ లభ్యత తగ్గుతూ వస్తోంది. గతంలో అయితే, పులస ఒకింత విరివిగానే దొరికదే. ధర ఎక్కువే అయినా, చేపల లభ్యత వుండేది.
ఇప్పుడేమో, ధర ఆకాశాన్నంటేసిందిగానీ, ‘పులస’ లభ్యత అనేదే వుండటం లేదు.
పులస సీజన్ వస్తోందంటే, నెల రోజుల ముందుగానే, మత్స్యకారులకు అడ్వాన్స్ ఇచ్చేస్తున్నారు కొందరు పెద్ద మనుషులు ఉభయ గోదావరి జిల్లాల్లో.

పులస చేపకి వున్న ప్రాముఖ్యత అలాంటిది. పులస అంటే, అదో దర్పం అక్కడ. ఈ ఏడాది పులస చేప 18 వేల నుంచి ధర ప్రారంభమైంది.
కొన్ని చోట్ల, అంతకు మించి.. రికార్డు ధర పలకుతోంది. రెండ్రోజులకో మూడు రోజులకో.. వారం రోజులకో.. పది రోజులకో.. పులస గురించిన వార్త ఒకటి బయటకు వస్తోందంతే.
అంత గణనీయంగా పులస లభ్యంత పడిపోవడానికి కారణాలు చాలానే వున్నాయంటారు మత్స్యకారులు. కాలుష్యాన్ని ప్రధాన కారకంగా చూపిస్తున్నారు పర్యావరణ ప్రేమికులు.
Godavari Pulasa Fish… ఇకపై పుస్తెలమ్మినా ప్రయోజనం లేదు..
పులస ధర పాతిక వేల రూపాయల వరకూ టచ్ అయ్యిందన్న ప్రచారం జరుగుతోంది. ఇది కేజీ ధర మాత్రమే సుమీ.!
సాధారణంగా, కిలోల లెక్కన కాకుండా, ‘ఒక్కో చేప’ లేదా ‘రెండు చేపల జోడీ’.. ఇలా కొనుగోలు చేసేవారు ఒకప్పుడు. ఇప్పుడైతే, అలా కొనడం.. అత్యంత ఖరీదైన వ్యవహారం.
బంగారం ధర, మార్కెట్లో లక్ష మార్కుని దాటేసింది (పది గ్రాములు).. ఆ లెక్కన, బంగారం ధరతో పులస ధర పోటీ పడుతోందనే అనుకోవాలేమో.. అంటారు పులస ప్రియులు.
Also Read: ‘కుబేర’ రివ్యూ.! లక్ష కోట్లు వర్సెస్ ఓ బిచ్చగాడు.!
పోలవరం ప్రాజెక్టు పూర్తయితే, పులస చేపల సంరక్షణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయొచ్చన్న వాదన గతంలో వినిపించింది. ఇప్పుడా ముచ్చటే ఎక్కడా వినిపించడంలేదు.
‘పులస’ ప్రేమికుల కోసమే అయినా, వాటి సంరక్షణ దిశగా ప్రభుత్వం అడుగులేయాలేమో.! ఎక్కడా లేని రుచి, ‘హిల్సా’ చేపకి, ‘పులస’గా గోదావరి నీరు తగిలాకే వస్తుంది మరి.!
కొత్తల్లుడికి పులస కూర తినిపించలేకపోయావ్.. ఏం బతుకు నీది.? అని మామగారిని ఏకిపారేసే పరిస్థితులుంటాయ్ గోదావరి జిల్లాల్లో. దానికున్న క్రేజ్ అలాంటిది.!
