Good Bad Ugly Review.. అల్లరి నరేష్, మోనాల్ గజ్జర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘సుడిగాడు’ సినిమా గుర్తుందా.? అప్పట్లో అదో పెద్ద హిట్టు.! ఔట్ అండ్ ఔట్ కామెడీ సినిమా అది.!
హెడ్డింగ్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ రివ్యూ’ అని పెట్టి, అల్లరి నరేష్ ‘సుడిగాడు’ సినిమా ప్రస్తావన తీసుకు రావడమేంటని అనుకుంటున్నారా.? అక్కడికే వచ్చేద్దాం.!
సినిమా మొదలైన దగ్గర్నుంచి, సినిమా పూర్తయ్యేవరకు.. తెరపై ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాకపోవడమే ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమా ప్రత్యేకత.
ఆన్ స్క్రీన్ ఎనర్జీ విషయంలో హై ఓల్టేజ్.. అనిపించేలా పెర్ఫామ్ చేయగల అజిత్ కుమార్‌తో ఇలాంటి సినిమా తీయాలని ఎలా అనిపించింది.? అని దర్శకుడ్ని ప్రతి ఒక్కరూ తిట్టుకోవాల్సిందే.
అజిత్, త్రిష.. జంటగా నటించిన సినిమా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. ఈ సినిమాలో అర్జున్ దాస్ విలన్. పైగా, అర్జున్ దాస్ డబుల్ రోల్.! ఆపై జాకీ ష్రాఫ్ కూడా వున్నాడు.
మన తెలుగు నటుడు సునీల్ కూడా వున్నాడండోయ్.! అబ్బో, చెప్పుకుంటూ పోతే లిస్టు పెద్దదే. టెక్నికల్‌గా ఫుల్ సౌండ్.. అనేంతలా, ఆయా విభాగాల్లో పవర్‌ఫుల్ వ్యక్తులే పని చేశారు.
Good Bad Ugly Review.. అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని..
అన్నీ వున్నా, అల్లుడి నోట్లో శని అన్నట్లు తయారైంది వ్యవహారం. హీరో ఎందుకు జైలుకు వెళ్ళాడో, ఎందుకు ముందే విడుదలయ్యాడో.. హీరో కొడుకెందుకు జైలుకెళ్ళాడో.. అంతా పెద్ద నస.
రెడ్ డ్రాగన్ అంటే, ప్రపంచాన్ని వణికించే డాన్.! అలాంటి డాన్, కొడుకు అరెస్టయితే విలవిల్లాడిపోతాడు. డాన్ భార్యేమో, వేరే దేశంలో హై పొజిషన్‌లో వుంటుందాయె.

పిచ్చి పీక్స్‌కి వెళ్ళిపోవడమంటారు కదా.? అంత ‘పీక్స్‌లో పిచ్చి’ వున్నప్పుడే రాసుకున్న కథ అయి వుంటుంది. సినిమా తీయడంలో కూడా అదే ‘పిచ్చి’ని మెయిన్‌టెయిన్ చేస్తూ వచ్చారు.
అల్లరి నరేష్ ‘సుడిగాడు’ గురించి ప్రస్తావించుకున్నాం కదా.. అందులో, హీరోని పెంచిన నానమ్మే డాన్.! ఆ డాన్‌కి ఏమాత్రం తీసిపోడు, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాలోని డాన్.. అదే, మన హీరో.!
అజిత్ కుమార్‌ని ఇంత ‘డల్ ఎనర్జీ’తో తెరపై ఇప్పటిదాకా చూసింది లేదు.. ఇదే మొదటి సారి.!
తన కళ్ళతో.. రకరకాల హావభావాలు ప్రకటించేసి, ఎంత డల్ సీన్‌ని అయినా, వేరే లెవల్‌కి తీసుకెళ్ళగలడు అజిత్. కానీ, అజిత్ కూడా చేయగలిగిందేమీ లేదు ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాలో.
Also Read: అంబటి రాయుడి ‘గుడ్డి’ సిద్ధాంతం.!
త్రిష పాత్ర వల్ల సినిమాకి ఒరిగిందేమీ లేదు. హీరో కొడుక్కి లవర్‌గా చేసిన ప్రియా ప్రకాష్ వారియర్ దండగ. చెప్పుకుంటూ పోతే, ఒక్క పాత్ర అంటే ఒక్క పాత్ర కూడా సరిగా డిజైన్ చేయబడలేదు.
జాకీష్రాఫ్ లాంటి సీనియర్ నటుడే తెరపై పిచ్చి పిచ్చిగా ప్రవర్తించాల్సి వచ్చిందంటే, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ఎంత వరస్ట్‌గా డిజైన్ చేయబడిందో అర్థం చేసుకోవచ్చు.
చివర్లో సిమ్రాన్ కనిపిస్తుంది.. ‘వాలి’ సినిమాని గుర్తు చేసుకుంటాడు హీరో.! అది మాస్టర్ క్లాస్ మూవీ. దాన్ని ప్రస్తావించి, అవమానించారా.? అన్న అనుమానం కలుగుతుంది.
ఓటీటీలో భరించడమే కష్టం ఈ సినిమాకి. వెండితెరపై, అజిత్ అభిమానులెలా ఈ సినిమాని భరించగలిగారో ఏమో.!
చివరగా: సుడిగాడు.. స్పూఫ్ సినిమా.! పైగా, హిట్టు కూడా.! ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాతో ‘సుడిగాడు’ సినిమాని పోల్చి చూడటం సబబు కాదేమో.!