హరీష్ శంకర్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి వీరాభిమాని (Harish Shankar About Pawan Kalyan). ‘ఒకానొక సమయంలో పవన్ కళ్యాణ్ అభిమానులం కాదని ఎవరైనా అంటే, వాళ్ళని వింతగా చూసేవాళ్ళం..’ అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెబుతూ, పవన్ మీద తనకున్న అభిమానాన్ని చాటి చెప్పారు.
ఆల్రెడీ పవన్ కళ్యాణ్‌తో ‘గబ్బర్ సింగ్’ సినిమా చేసి, సెన్సేషనల్ హిట్ కొట్టిన ఈ దర్శకుడు, మరోమారు పవన్ కళ్యాణ్‌ని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు.
పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోనూ వుండాలి.. సినిమాల్లోనూ వుండాలని ఆకాంక్షిస్తోన్న హరీష్ శంకర్, ఎన్నికల్లో పవన్ ఓడిపోయారంటే తాను ఒప్పుకోననీ.. ఆయన చాలామందిని ప్రభావితం చేశారనీ.. ఎంతలా ప్రభావితం చేశారంటే, ఆయన పేరు ఇప్పటికీ రాజకీయాల్లో చాలామందిని ఇబ్బంది పెడుతుండడమే అందుకు నిదర్శనమనీ చెప్పుకొచ్చారు హరీష్ శంకర్.
డబ్బు, పేరు ప్రఖ్యాతులు ఆయనకి తెలియనివి కావు. సినీ రంగంలో సాధించిన విజయాలకంటే ఇంకా గొప్పగా ఏముంటుంది.? ‘పవన్ అభిమానులు ఆయన్ని కేవలం సినిమా హీరోగానే కాదు, ఓ నాయకుడిగా చూస్తారు. ఆయన వ్యక్తిత్వాన్ని ఇష్టపడతారు. అదే ఆయన గొప్పతనం. మిగతా హీరోలెవరికీ లేని ఆ ప్రత్యేక లక్షణం పవన్ సొంతం..’ అని హరీష్ చెప్పాడు.
‘పవన్ కళ్యాణ్‌తో నేను చేయబోయే సినిమా ఎలా వుంటుందో ఇప్పుడే చెప్పను. పవన్ అభిమానిగా ఆయన్ని ఎలా చూడాలనుకుంటున్నానో అలా ఈ సినిమాలో చూపిస్తాను. ఖచ్చితంగా పవన్ అభిమానుల్ని ఆ సినిమా అలరిస్తుంది..’ అని చెప్పిన హరీష్ శంకర్, ‘గబ్బర్‌సింగ్’ సినిమా సక్సెస్ తర్వాత ఆయన దాన్ని చాలా లైట్ తీసుకున్నారనీ.. అపజయాన్నీ, విజయాన్నీ ఒకేలా స్వీకరించగలడం పవన్‌లోని మరో ప్రత్యేక లక్షణమనీ చెప్పారు.
‘అభిమానులూ జాగ్రత్తగా వుండండి. సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు జరుపుకోండి. మన సరదా మనకే ఇబ్బంది కాకూడదు.. ఇతరుల్ని అస్సలు ఇబ్బంది పెట్టకూడదు..’ అంటూ ఓ అభిమానిగా హరీష్, పవన్ అభిమానులకు విజ్ఞప్తి చేశాడు.
‘పవన్ కళ్యాణ్.. ఆ స్థాయి వేరు.. ఆయన స్థానం వేరు..’ అని గతంలో ట్వీట్ చేసిన హరీష్, ఈసారి పవన్ పుట్టినరోజుకి (Harish Shankar About Pawan Kalyan) ఎలాంటి ఇంట్రెస్టింగ్ ట్వీటేస్తాడో.!