Harish Shankar Tweet Fight దర్శకుడు హరీష్ శంకర్ పేరు చెప్పగానే పవన్ కళ్యాణ్ వీరాభిమాని.. అనే ప్రస్తావన వస్తుంటుంది. ‘ఆయన స్థాయి వేరు.. ఆ స్థానం వేరు..’ అంటూ పవన్ కళ్యాణ్ గురించి చాన్నాళ్ళ క్రితం హరీష్ శంకర్ చేసిన వ్యాఖ్యలు అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ ట్రెండింగ్‌లోనే వుంటాయి.
అసలు విషయానికొస్తే, సినీ నటుడు సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన ఘటనకు సంబంధించి ఓ సెక్షన్ తెలుగు మీడియా అత్యంత దుర్మార్గమైన రీతిలో కథనాల్ని వండి వడ్డించేస్తోంది. ఈ క్రమంలో ఆయా ఛానళ్ళలో పనిచేస్తున్న జర్నలిస్టులు మరింత అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు.
Harish Shankar Tweet Fight ఏకిపారేసిన హరీష్
ప్రమాద సమయంలో సాయి ధరమ్ తేజ్ ప్రయాణించిన వాహన వేగం గంటకి 400 కిలోమీటర్ల నుంచి 300 కిలోమీటర్ల దాకా వుందంటూ చెప్పేశాడో జర్నలిస్టు. ఈ వ్యవహారం పెను దుమారం రేపింది. పవన్ కళ్యాణ్ అభిమాని అని కాదు.. ఓ సగటు సినీ జీవిగా, ఓ మనిషిగా ఈ వ్యవహారంపై కాస్త సీరియస్‌గానే స్పందించి, సోకాల్డ్ మీడియా సంస్థల్ని, జర్నలిస్టుల్ని కడిగి పారేశాడు హరీష్ శంకర్.
ఓ జర్నలిస్టు పనిగట్టుకుని హరీష్ శంకర్ మీద సోషల్ మీడియా వేదికగా సెటైర్లు షురూ చేశాడు.. అదీ హరీష్‌ని ట్యాగ్ చేస్తూ. దానికి కౌంటర్ ఎటాక్ స్టార్ట్ అయ్యింది హరీష్ శంకర్ నుంచి. ‘ప్రసార మాంద్యం’ అనే పదాన్ని ప్రయోగించాడు హరీష్ శంకర్. వినోదానికీ, బూతుకీ తేడా చెప్పేశాడు.
‘మెరుగైన వినోదానికీ.. మెరుగైన సమాజానికీ’ వ్యత్యాసాన్ని కూడా తెలియజేశాడు హరీష్ శంకర్. కరోనా నేపథ్యంలో జర్నలిస్టు మిత్రులకు సహాయం చేసిన వైనం, దాన్ని సేవగా.. బాధ్యతగా తాను భావించిన వైనం గురించి పేర్కొన్నాడు. మీడియాలో ఓ సెక్షన్ ఏ స్థాయికి దిగజారిపోయిందో సవివరంగా పేర్కొన్నాడు.
బురద జర్నలిజంపై రాళ్ళేయడం శుద్ధ దండగ..
నిజానికి, హరీష్ శంకర్ ఇదంతా చెయ్యాల్సిన పనిలేదు. ఎందుకంటే, జర్నలిజం.. అంటే, బ్లాక్ మెయిలింగ్ మాత్రమేననుకునే సోకాల్డ్ జర్నలిస్టులకి ఏం చెప్పినా వేస్ట్. వారి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. భలే భలే.. ఫాలోవర్స్ పెరుగుతున్నారహో.. అని ఇంకా ఇంకా దిగజారిపోవడానికీ అలాంటోళ్ళు సిద్ధపడతారు.
హరీష్ శంకర్ ట్వీట్లను చాలామంది అభినందిస్తున్నారు.. అదే సమయంలో కొందరు, ‘మీరెందుకు ఆయనకు పబ్లిసిటీ ఇవ్వడం.. పట్టించుకోవడం మానెయ్యండి..’ అంటున్నారు. కానీ, హరీష్ శంకర్ (Harish Shankar Tweet Fight ) మాత్రం, ‘ఓపిక వున్నంతవరకు.. వీలున్నప్పుడల్లా..’ అంటూ తన ఉద్దేశ్యాన్ని చెప్పకనే చెప్పేశాడు.
కొసమెరుపేంటంటే, తానూ పవన్ కళ్యాణ్ అభిమానినేనంటూ సదరు ‘పైత్యపు’ జర్నలిస్టు, పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తుండడం. పవన్ కళ్యాణ్ అభిమాని అయి వుంటే, ఆ దిక్కుమాలిన బురద ఛానెల్లో ఎందుకు జర్నలిస్టుగా పనిచేస్తాడు.?