Table of Contents
Hbd YS Jagan YSRCP.. తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి రాజకీయ వారసత్వాన్ని అందుకున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, 2019-2024 మధ్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేశారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ జీవితం ప్రారంభించిన వైఎస్ జగన్, కడప ఎంపీగా రికార్డు స్థాయి మెజార్టీతో విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.
వైఎస్ మరణానంతరం, కాంగ్రెస్ పార్టీతో విభేదించి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో కొత్త రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించిన వైఎస్ జగన్, తెలుగునాట రాజకీయాల్లో తనదైన ప్రత్యేక ముద్ర వేశారు.
కానీ, ఏ కుటుంబం సాయంతో, రాజకీయంగా ఎదిగారో.. అదే కుటుంబ సభ్యులను దూరం చేసుకున్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
Hbd YS Jagan YSRCP.. తల్లినీ చెల్లినీ దూరం చేసుకుని..
తల్లితో కలిసి, కొత్త రాజకీయ పార్టీని స్థాపించిన జగన్, ఆ తల్లిని రాజకీయంగా దూరం చేసుకోవడం గమనార్హం.
జగన్ జైలుకు వెళితే, జగన్ తరఫున సుదీర్ఘ పాదయాత్ర చేసిన వైఎస్ షర్మిల కూడా, వైసీపీకి దూరమయ్యారు.
ప్రస్తుతం విజయమ్మ, షర్మిలతో.. ‘ఆస్తుల పంపకాల గొడవల్ని కోర్టులో ఎదుర్కొంటున్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. సరే, అది వ్యక్తిగత, కుటుంబ వ్యవహారం.. అనుకుందాం. అది వేరే ముచ్చట.
2024 ఎన్నికల్లో ఓడిపోయాక, పూర్తిగా వైఎస్ జగన్ బెంగళూరుకే పరిమితమైపోయారు. అడపా దడపా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిపోతున్నారంతే.
పులివెందులకీ దూరంగా..
తనను గెలిపించిన పులివెందుల నియోజకవర్గ ప్రజలకూ వైఎస్ జగన్ అందుబాటులో వుండటం లేదు. శాసన సభ్యుడైనప్పటికీ, శాసన సభకు మొహం చూపించలేకపోతున్నారు వైఎస్ జగన్.
సరే, ప్రజలకు చాలా మేలు చేసేశాం.. కానీ, ప్రజలు మోసం చేశారు.. అనే ఆలోచన వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వుండొచ్చు. అలాగని, ప్రజలకు దూరంగా వుంటే ఎలా.?
ఒకప్పటిలా కాదు, రాజకీయాల్ని ప్రజలు మరింత క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
151 సీట్లతో రికార్డు విజయాన్ని అందుకున్న వైసీపీ, 11 సీట్లతో ఘోర పరాజాయాన్ని చవిచూడ్డానికి కారణాలేంటో విశ్లేషించుకోవాలి వైసీపీ అధినేత వైఎస్ జగన్.
ఆత్మవిమర్శ చేసుకోకపోతే ఎలా.?
కానీ, ఆత్మ విమర్శ అనేది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నుంచి అస్సలు ఆశించలేం. తప్పిదాల్ని సరిదిద్దుకునే పనీ చేయడంలేదు.!
అయితే, మళ్ళీ అధికార పీఠమెక్కాలనుకుంటున్న వైఎస్ జగన్, ఇప్పటికైనా ఆత్మ విమర్శ చేసుకోవాల్సిందే.
Also Read: ‘మ్యాచ్ ఫిక్సింగ్’ నుంచి.. మంత్రి దాకా.! అజారుద్దీన్ ‘ఇన్నింగ్స్’ ఇదీ.!
పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ వైసీపీ శ్రేణులు, తమ అధినేతకి ఎలివేషన్స్ ఇవ్వడం వింతేమీ కాదు.
కానీ, ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన బాధ్యత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిదే.
భజన బృందానికి దూరంగా, వాస్తవానికి దగ్గరగా వుండగలిగితే, రాజకీయంగా తిరిగి పుంజుకునే అవకాశం లేకపోలేదు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.
కొత్త రాజకీయ పార్టీ పెట్టి, ముఖ్యమంత్రిగా ఎదిగిన వైఎస్ జగన్, 11 సీట్ల నుంచి మళ్ళీ అధికారం దిశగా అడుగులేయగలరు. కానీ, అలా జరగాలంటే.. ఓటమిపై ‘పోస్ట్‌మార్టమ్’ తప్పనిసరి.!
హ్యాపీ బర్త్ డే జగన్.!
