ఎన్నికల్లో గెలవడానికి రాజకీయ నాయకులు, పార్టీలు అడ్డగోలు హామీలు ఇచ్చేయడం మామూలే. ఎన్నికలొచ్చినప్పుడే ‘ఓటరు దేవుళ్ళు’. ఎన్నికలయ్యాక, ప్రజల్ని సాటి మనుషులుగా కూడా చూడరు కొందరు రాజకీయనాయకులు, కొన్ని రాజకీయ పార్టీలు (Indian Democracy Elections Manifestos).
అది ఫ్రీ, ఇది ఫ్రీ.. అంటారు.. చేతులెత్తేశారు. ఒకవేళ అన్నీ ‘ఫ్రీ’గా ఇచ్చేసినా, చేతిలో పావలా పెట్టేసి, పాతిక రూపాయలు జనం నుంచి కొట్టేస్తారు. ఇదీ నేటి రాజకీయం. ఇదీ నేటి ఎన్నికల ప్రసహనం. ఇదీ మన ప్రజాస్వామ్యం. తమిళనాడులో ఓ అభ్యర్థి, పోటీ చేయడానికి 20 వేల రూపాయలు అప్పు చేశాడు.
Also Read: విద్యావ్యవస్థకి డబ్బు జబ్బు.. నేరమెవరిది.? శిక్ష ఎవరికి.?
అలాంటి వ్యక్తి ఏకంగా తాను గెలిస్తే, చంద్రుడి వద్దకు వెళ్ళేందుకు ఉచిత రాకెట్ ప్రయాణం అందుబాటులోకి తెస్తానని ప్రకటించేశాడు. అంతేనా, ఖర్చుల కోసం ఏడాదికి కోటి రూపాయలు ఇచ్చేస్తాడట. ఇంకా చాలా వున్నాయ్ ఆణిముత్యాలు. అందులో మినీ హెలికాప్టర్, మూడంతస్తుల మేడ ఇస్తానని ఎన్నికల హామీల్లో భాగంగా ప్రకటించాడు.
ఇంకా చాలా వున్నాయి ఆణిముత్యాలు. గెలిచాక, చల్లదనం కోసం ఓ మంచు కొండని అందుబాటులోకి తెస్తాడట. అదెలా.? అనడక్కండి. అదంతే. ఓ బోటు కూడా ఇస్తాడట. ఇక చాలు.. అంటూ బుర్ర గోక్కుంటున్నారా.? అయితే, ఇవన్నీసదరు అభ్యర్థి, ఓటర్లు చైతన్యవంతుల్ని చేసేందుకోసం ప్రకటించిన ఎన్నికల హామీలు మాత్రమే.
ఇప్పుడు రాజకీయాల్లో రాజకీయ పార్టీలు, నాయకులు ఏం చెప్పి జనాల నుంచి ఓట్లను రాబడుతున్నారనే విషయమై ప్రజల్లో అవగాహన పెంచడం కోసం తమిళనాడుకి చెందిన 33 ఏళ్ళ తులం శరవణన్ అనే వ్యక్తి ఈ సాహసానికి పూనుకున్నాడు. ఓ జర్నలిస్టుగా ఆయన పనిచేశాడు. అదీ అసలు సంగతి.
Also Read: ‘అమరజీవి’.. ఈయనెవరో మీకు తెలుసా.?
ఇలాంటోళ్ళు చాలామందే వున్నారు.. సమాజం మీద బాధ్యత, అవగాహన కలిగి.. సమాజానికి ఎంతో కొంత మేలు చేద్దామనే ఆలోచనతో.
ఓట్ల కోసం రాజకీయ నాయకులు మీ దగ్గరకి వచ్చేటప్పుడు.. వాళ్ళిచ్చే ఎన్నికల హామీల్ని ఎవరి డబ్బుతో నెరవేర్చుతారనే ప్రశ్న వెయ్యండి (Indian Democracy Elections Manifestos) చాలు. ఇంకోసారి ఏ రాజకీయ నాయకుడూ దిక్కుమాలిన హామీలతో ప్రజల్ని మోసం చేయాలనుకోడు.