కరోనా వైరస్‌కి కూడా వ్యాక్సిన్ కనుగొన్నాం.. కానీ, బాధ్యతారాహిత్యానికి వ్యాక్సిన్ లేదు.. బాధ్యతగా వుండటమొక్కటే శరణ్యం.. అంటూ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR About Traffic Awareness) చెమర్చిన కళ్ళతో వ్యాఖ్యానించాడు. పోలీస్ విభాగానికి సంబంధించి ఓ కార్య్రకమానికి ముఖ్య అతిథిగా హాజరైన యంగ్ టైగర్ ఎన్టీఆర్, తాను సినీ నటుడిగా కాకుండా ఓ బాధితుడిగా ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్లు చెప్పాడు.
జూనియర్ ఎన్టీయార్ సోదరుడు నందమూరి జానకిరామ్ ఓ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. అప్పటినుంచి, తన సినిమాకి సంబంధించి ఏ కార్యక్రమం జరిగినా, అభిమానుల్ని ఉద్దేశించి, సినీ ప్రేక్షకుల్ని ఉద్దేశించి, ‘జాగ్రత్తగా వాహనాలు నడపండి..’ అని చెబుతూ వస్తుంటాడు. యంగ్ టైగర్ ఎన్టీయార్ (Young Tiger NTR) తండ్రి హరికృష్ణ కూడా రోడ్డు ప్రమాదంలోనే ప్రాణాలు కోల్పోయారు.
తన సోదరుడు జానకిరామ్ (Nandamuri Janaki Ram), తన తండ్రి హరికృష్ణ (Nandamuri Harikrishna).. ఇద్దరూ రోడ్డు ప్రమాదంలోనే ప్రాణాలు కోల్పోయారనీ, ఇద్దరూ వాహనాలు నడిపే విషయంలో చాలా జాగ్రత్తగా వుంటారనీ, రోడ్డుపై వెళ్ళే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వుంటేనే తప్ప ప్రమాదాలు నివారించలేమనీ, ఒకరు జాగ్రత్తగా వున్నప్పుడు ఇంకొకరు జాగ్రత్తగా లేకపోయినా ఉపయోగం వుండదనీ ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు.

వాహనం తీసుకుని బయటకు వెళ్ళేటప్పుడు, ఇంట్లో కుటుంబ సభ్యుల్ని గుర్తు చేసుకోవాలనీ, ట్రాఫిక్ రూల్స్ ప్రతి ఒక్కరూ తప్పక పాటించాలనీ, కేవలం జరీమానాలతోనూ శిక్షలతోనూ ప్రమాదాలు తగ్గవనీ, ‘రూల్స్ పాటించడం మన బాధ్యత’ అని ప్రతి ఒక్కరూ అనుకున్నప్పుడే ప్రమాదాలు తగ్గుతాయని ఎన్టీఆర్ (Jr NTR) అభిప్రాయపడ్డాడు.
తల్లి, తండ్రి, గురువు.. సైనికులు.. పోలీస్.. వీరందర్నీ గౌరవించుకోవాలని యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR About Traffic Awareness) సూచించారు. ఆద్యంతం ఎమోషనల్‌గా సాగిన జూనియర్ నందమూరి తారకరామారావు (Junior Nandamuri Taraka Rama Rao) ప్రసంగానికి పోలీసు విభాగం నుంచి అత్యద్భుతమైన స్పందన లభించింది.