Konaseema Politics.. కోనసీమ.. ఇక్కడ ప్రకృతి అందాలకు ఎవరైనా మైమర్చిపోవల్సిందే. కోనసీమ ఎటకారానికి ఎవరైనా చిత్తయిపోవల్సిందే. కోనసీమ చూపించే ప్రేమాభిమానాలకు ఎవరైనా ముగ్ధులవ్వాల్సిందే. కోనసీమలో అన్నీ ఎక్కువే.
కోనసీమ అంటేనే సమ్‌థింగ్ స్పెషల్. కోనసీమ కొబ్బరి నీళ్లలో ఎంత స్వచ్ఛత వుంటుందో అక్కడి ప్రజల మనసుల్లోనూ అంత స్వచ్ఛత వుంటుందనీ, తమ ప్రాంతం గురించి కోనసీమ వాసులు చాలా చాలా గొప్పగా చెప్పుకుంటుంటారు.
కోనసీమ ప్రాంతానికి రాజకీయ చైతన్యం ఎక్కువే. కోనసీమ నుంచి రాజకీయంగా, ఆర్ధికంగా ఎదిగిన ఎందరో ప్రముఖులు మన కళ్ల ముందు కనిపిస్తారు.
విద్య, వైద్యం, వ్యాపారం.. ఇలా ఏ రంగంలో చూసుకున్నా కోనసీమ ‘ముద్ర’ ఖచ్చితంగా కనిపిస్తుంది.
జీవితంలో ఒక్కసారైనా కోనసీమ అందాలు చూడాలని అనుకోవడం కాదు, ఏడాదికోసారైనా, కుదిరితే ఆర్నెళ్లకోసారైనా కోనసీమలో కొద్ది రోజులు ఎంజాయ్ చేయాలని అనుకోని తెలుగు వారుండరంటే అతిశయోక్తి కాకపోవచ్చు.
కోనసీమలో అరాచకం.! ఎవరిది ఈ పాపం.?
అయితే, అన్ని చోట్లా వున్నట్లే కోనసీమలోనూ అల్లర్లూ, అరాచకాలకు తెగబడేవాళ్లుండొచ్చు. నిజానికి అలాంటి వారిని పెంచి పోషించేది, అల్లర్ల దిశగా ప్రేరేపించేది కూడా రాజకీయమే. కులాల మధ్య ఘర్షణ పుట్టించేది ఈ రాజకీయమే.
ఓటు బ్యాంకు రాజకీయాలనండీ.. ఇంకేమైనా అనండీ.. పచ్చని కోనసీమలో ఎప్పటికప్పుడు చిచ్చు రాజుకుంటూనే వుంటుంది.
కొత్త జిల్లాగా కోనసీమ ఏర్పడ్డాకా, కొద్ది రోజుల్లోనే ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోవడానికి కారణం జిల్లాకి పెట్టిన పేరు.
ఆ పేరును మార్చాలని కొందరు, మార్చొద్దని కొందరు.. ఆందోళన చేయడం మొదలుపెట్టారు.
సున్నితమైన ఈ అంశంపై లోతైన అధ్యయనం చేయాల్సింది పోయి పేరు మార్చేస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో పచ్చని కోనసీమ కకావికలమైంది.
తమ ఉనికిని కోల్పోతున్నామన్న ఆవేదన కోనసీమ వాసుల్లో పెరిగింది. అయితే, ప్రజాస్వామ్యంలో విధ్వంసాలకు చోటుండకూడదు. కోనసీమలో చోటు చేసుకున్న విధ్వంసాలకు, రాజకీయమే నైతిక బాధ్యత వహించాలి.
Konaseema Politics.. అధికారం సరే, బాధ్యత ఏదీ.?
అధికారంలో వున్న వారికి ఈ బాధ్యత మరింత ఎక్కువగా వుంటుంది. రాష్ర్టంలో ఎక్కడా లేని ‘జిల్లా పేరు’ వివాదం కోనసీమకే ఎందుకు.? రాష్ర్ట ప్రజలంతా ఈ విషయంపై ఒకింత ఆత్మ విమర్శ చేసుకోవల్సి వుంది.
రాజకీయం ఎలా ప్రజల్ని కుల, మత, వర్గ, ప్రాంతాలుగా విడదీస్తున్నదీ ప్రజలే అర్ధం చేసుకోవాలి. ప్రతి విధ్వంసమూ ప్రజల్నే నాశనం చేస్తుంది. ప్రభుత్వ ఆస్థుల విధ్వంసం అంటే, ప్రజలు తమ ఆస్థుల్ని తాము ధ్వంసం చేసుకున్నట్లే.
రెచ్చగొట్టి చోద్యం చూసే రాజకీయ నాయకులకు నష్టమేమీ వుండదు. ప్రభుత్వంలో వున్నవాళ్లైనా, ఇంకెవరైనా సరే, వాళ్లకేమీ నష్టముండదు. అంతిమంగా నష్టపోయేది ప్రజలే. కోనసీమ ప్రజలు విజ్ఞులు, రాజకీయ చైతన్యం వున్నవారు.
Also Read: ప్రజా క్షేత్రంలో గెలిస్తే, ‘తప్పు’ ఒప్పయిపోతుందా.?
తమ ప్రాంతంలో ఎవరు చిచ్చు పెడుతున్నారో వాళ్లకే బాగా తెలుసు. ఆ రాజకీయ ఉచ్చులో పడకుండా తమ ప్రాంతాన్ని తామే కాపాడుకోవాలని కోనసీమ వాసులు గుర్తెరగాలి.
చివరగా.. సంక్షేమ పథకాలకి సొంత పేర్లు పెట్టుకునే పాలకులు, జిల్లాల పేర్ల విషయంలో దళిత ప్రముఖుడనీ, రాజ్యాంగ రూపకర్త అనీ.. అంబేద్కర్ మీద చూపిస్తున్నది కపట ప్రేమ కాదని అనగలమా.?
– yeSBee