Mahaan Review.. విలక్షణ నటుడిగా విక్రమ్ గురించి చెప్పుకోవాలి. ఔను, విక్రమ్ అంటే కేవలం నటుడు మాత్రమే కాదు, అంతకు మించి.! చేసే ప్రతి సినిమాలోనూ కొత్తదనం వుండాలని కోరుకుంటాడాయన. ఈ క్రమంలో తన శరీరాన్ని ఎంత మేర అయినా కష్టపెట్టేందుకు వెనుకంజ వేయడు ఈ విలక్షణ నటుడు.
‘అపరిచితుడు’ అయినా, ‘ఐ’ అయినా, అంతకు ముందు చేసిన ‘శివపుత్రుడు’ అయినా, మరో సినిమా అయినా, విక్రమ్ (Chiyaan Vikram) నుంచి ఏ సినిమా వస్తోందన్నా, అందులో ఖచ్చితంగా కొత్తదనం వుంటుందనే ఫిక్సయిపోతాడు ప్రేక్షకుడు కూడా.
విక్రమ్ నటించిన సినిమాలు కొన్ని బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయి వుండొచ్చుకానీ, నటుడిగా ఆయన ఏ సినిమాతోనూ ఫెయిల్ కాలేదు. దటీజ్ విక్రమ్. మరి, అలాంటి విక్రమ్.. తన కుమారుడు ధృవ్‌తో (Dhruv Vikram) కలిసి చేసిన ‘మహాన్’ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటకుండా వుంటాయా.?
‘మహాన్’.. ఓ సాదా సీదా కథ. ఓ తండ్రి, ఓ కొడుకు. కుటుంబాన్ని ఓ చిన్న కారణం వల్ల దూరం చేసుకుంటాడు మహాన్. తండ్రికి దూరమైన కొడుకు దాదా, ఆ తండ్రి తమకు దూరమవడానికి గల కారణంపై పగపట్టేస్తాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్యా ఆధిపత్య పోరు నడుస్తుంది. చివరికి ఏమయ్యిందన్నది తెరపై చూడాల్సిందే.
Mahaan Review.. చెప్పగా మొదలెట్టి.. ఉత్కంఠగా ముగించి.!
సినిమా నిజానికి చాలా చప్పగా మొదలవుతుంది. ఎంతసేపటికీ సినిమా ముందుకు నడవదు. ఎప్పుడైతే హీరోకి స్వేచ్ఛ లభిస్తుందో, అప్పటినుంచే కథలో వేగం పెరుగుతుంది. తండ్రీ కొడుకుల పరిచయం తర్వాత కథలో మరింత జోరు కనిపిస్తుంది.

చివరి వరకూ ఉత్కంఠ నెలకొంటుంది. తండ్రీ కొడుకులిద్దరూ చనిపోతారా.? ఎవరో ఒకరు చనిపోక తప్పదా.? అన్న ఉత్కంఠ రేగుతుంది. కానీ, చివరకు షరామామూలుగానే కథ సుఖాంతమవుతుందిగానీ.. ఇందులోనూ బోల్డన్ని ట్విస్టులుంటాయ్.
విక్రమ్ – ధృవ్.. నువ్వా.? నేనా.?
తండ్రీ కొడుకుల్లా కాదు.. తెరపై రెండు పొట్టేళ్ళు తలపడుతున్నట్టుంటుంది. అయితే, దర్శకుడు ఈ ఇద్దరి మధ్యా మైండ్ గేమ్ మరింత పవర్ ప్యాక్డ్‌గా వుండేలా తీర్చిదిద్దడంలో విఫలమయ్యాడనిపిస్తుంది. చాలా అరుదుగా ఇలాంటి కాంబినేషన్లు తెరకెక్కించే అవకాశం దర్శకులకు దక్కుతుంది మరి.
నటి సిమ్రాన్.. కాస్సేపు ఓవరాక్షన్ చేస్తుంది. ఆ తర్వాత ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత వుండదు. చివర్లో ‘మమ’ అన్పించేస్తుందంతే. బాబీ సింహా ఈ సినిమాకి అదనపు ఆకర్షణ. చాలా సహజంగా వుంటుంది అతని నటన.
స్నేహం, రాజకీయం, వైవాహిక బంధం.. ఇలా సినిమాలో చాలానే వున్నాయ్. ‘లిక్కర్ మాఫియా’ని ఇంకాస్త ఎఫెక్టివ్‌గా చూపించి వుంటే బావుండేదేమో.. అనిపిస్తుంది. అన్నట్టు, విక్రమ్ – ధృవ్ మధ్య నడిచే యాక్షన్ సన్నివేశం చూస్తే ఒకింత గగుర్పాటుకు గురవుతాం. తండ్రి, కొడుకు.. తెరపై కొట్టుకుంటోంటే, అది నటనే అయినా చూసేవారికి చివుక్కుమనిపిస్తుంది.
Also Read: గోతికాడి నక్కలకి గూబ గుయ్యమంది ‘బాస్’.!
చివరగా: సినిమాలో గ్లామర్ లేదు, ఆ అవసరమే రాలేదు. బలవంతంగా దాన్ని ఇరికించనందుకు దర్శకుడ్ని అభినందించి తీరాలి. తొలి అర్థభాగంలో సాగతీత సన్నివేశాల్ని మినహాయిస్తే, ‘మహాన్’ (Mahaan Review) ఆకట్టుకునే చిత్రమే.!
విక్రమ్ అభిమానులకి ఒకింత ఇష్టం, ఒకింత కష్టం. ఎందుకంటే, తండ్రీ కొడుకుల మధ్య కొట్లాట జీర్ణించుకోవడం కష్టమే మరి.! అది ఇష్టమైన కష్టం. ఇద్దరు మంచి నటులు చెలరేగిపోతోంటే అది అభిమానులకి పండగే కదా.!
– yeSBee