Malli Modalaindi.. చెల్లి పెళ్ళి.. మళ్ళీ మళ్ళీ జరగాలంటాడు ఓ సినిమాలో కామెడీ విలన్. అప్పట్లో అదో సంచలనం. మరి, విడాకులు మళ్ళీ మళ్ళీ జరిగితే.? ఆ కథేంటో తెలుసుకోవాలంటే, ‘మళ్ళీ మొదలైంది’ సినిమా చూడాల్సిందే.
సుమంత్ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న అన్ యూజువల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్.. అదేనండీ అసాధారణమైన కుటుంబ కథా చిత్రం.. ఈ ‘మళ్ళీ మొదలైంది’ అన్నమాట.
ట్రైలర్.. సమ్‌థింగ్ కొత్తగా.!
‘మళ్ళీ మొదలైంది’ సినిమా ట్రైలర్‌ని చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. సుమంత్, యాంకర్ వర్షిణి, నైనా గంగూలీ, సీనియర్ నటి అన్నపూర్ణ, సుహాసిని, వెన్నెల కిషోర్ తదితరులు ఈ సినిమాలో ప్రధాన తారాగణం.
ట్రైలర్ ఓపెన్ అవడమే కోర్టులో విడాకుల సీన్.. ఆ తర్వాత విడాకులు తీసుకున్న హీరోపై సానుభూతి ప్రదర్శించే అమ్మలక్కలు.. ఆ తర్వాత హీరో, తన మాజీ భార్యతో విడాకులు ఇప్పించిన లేడీ న్యాయవాదితో ప్రేమలో పడతాడు.

ఈ విడాకుల సీక్వెల్ ఏంటి చెప్మా..
చిత్రమేంటంటే, మళ్ళీ ఆ లేడీ న్యాయవాదిని పెళ్ళాడి, ఆమెతో విడాకుల కోసం మళ్ళీ కోర్టుకు వెళతాడు. ఈ మధ్యలో ఏం జరిగింది.? అసలు హీరోగారికి ఈ విడాకుల మీద అంత ప్రేమేంటి.? పెళ్ళి ఎందుకు మనోడికి కలిసి రావడంలేదు.? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
డైలాగ్స్.. సినిమా కోసం రాసినట్టు లేవు.. సరదాగా మనం మాట్లాడుకునేలానే వున్నాయ్. ఆయా పాత్రల బిహేవియర్ కూడా సహజంగానే కనిపిస్తుండడం మరో ఆకట్టుకునే అంశం. ‘మళ్ళీ రావా’ సినిమా మొన్నామధ్య చేసిన సుమంత్, అదే ‘మళ్ళీ’ సెంటిమెంటుతో ఈ టైటిల్‌ని ఎంచుకున్నాడేమో అనిపిస్తుంది.
Also Read: పొట్టి డ్రస్సు.. అనసూయ కస్సు బుస్సు
ఓవరాల్‌గా ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తోంది. నిజంగానే, ‘మళ్ళీ మొదలైంది’ (Malli Modalaindi) అన్ యూజువల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనిపిస్తోంది.