మెగాస్టార్ చిరంజీవి.. పరిచయం అక్కర్లేని పేరిది. సినీ రంగంలో మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi Politial Re Entry) అంటే ‘అందరివాడు’. కానీ, రాజకీయాల్లో ఈక్వేషన్స్ మారిపోయాయి. చిరంజీవి అత్యంత ప్రతిష్టాత్మకంగా స్థాపించిన ‘బ్లడ్ బ్యాంక్’ని కూడా రాజకీయ సెగ తాకింది.
అప్పటిదాకా చిరంజీవి అంటే ‘అహో.. ఒహో..’ అన్నవాళ్ళే ఆయన్ని విమర్శించారు. రాజకీయం అంటే ఓ విష వలయం.. అని చిరంజీవికి తెలియడానికి పెద్దగా సమయం పట్టలేదు. ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా పలు పదవులు చేపట్టారు చిరంజీవి.. అదీ అతి తక్కువ సమయంలోనే.
రాజకీయాలకు దాదాపుగా గుడ్ బై చెప్పేసి, ప్రస్తుతం సినిమాలపై ఫోకస్ పెట్టారు. రాజకీయ రంగంలో చిరంజీవిని విమర్శించిన వారంతా, మళ్ళీ ఇప్పుడు చిరంజీవి పంచన చేరారు. చిరంజీవి ఆశీస్సుల కోసం వారంతా ‘క్యూ’ కడుతున్నారు.
సినిమా పవర్ అలాంటిదని చిరంజీవి (Mega Star Chiranjeevi) మాత్రమే కాదు, చిరంజీవి అభిమానులూ తెలుసుకున్నారు. అయితే, చిరంజీవిని మళ్ళీ రాజకీయాల్లోకి లాగేందుకు కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. చిత్రంగా జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ ఈ ప్రయత్నం చేయడం అందర్నీ విస్మయానికి గురిచేసింది.
ముందుగా జనసేన (Jana Sena Party) నేత నాదెండ్ల మనోహర్, ఆ తర్వాత బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. చిరంజీవి గురించి రాజకీయ ప్రకటనలు చేసెయ్యడాన్ని ‘వ్యూహాత్మకం’ అని నిస్సందేహంగా అభివర్ణించొచ్చు.
ఏ ఉద్దేశ్యంతో వారు ‘చిరంజీవి మాకు అండగా వుంటామన్నారు.. మాతో కలిసి పనిచేస్తామన్నారు..’ అని ప్రకటించేసుకున్నారోగానీ, అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, చిరంజీవి అలాంటి ఆలోచనలేవీ చేయడంలేదని తెలుస్తోంది.
సోము వీర్రాజు (Somu Veerraju), కొన్నాళ్ళ క్రితం చిరంజీవిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) అడపా దడపా పవన్ కళ్యాణ్‌తో కలిసి చిరంజీవి వద్దకు వెళుతుంటారు. తన వద్దకు వచ్చినవారితో చిరంజీవి వివిధ అంశాలపై చర్చించొచ్చుగాక.. అంత మాత్రాన, చిరంజీవి పేరుని రాజకీయాల్లోకి లాగేస్తే ఎలా.? అన్న ప్రశ్న చిరంజీవి అభిమానుల నుంచి వ్యక్తమవుతోంది.
చిరంజీవి బాహాటంగా ప్రకటించినా, ప్రకటించకపోయినా.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి (Janasenani Pawan Kalyan) చిరంజీవి ఆశీస్సులుంటాయి.. మద్దతూ వుంటుంది. అయితే, రాజకీయాల్లోకి చిరంజీవి పేరుని ఎవరు లాగినా అది చిరంజీవికి కొన్ని చిక్కులు తెచ్చిపెట్టే అవకాశం వుందని నిస్సందేహంగా చెప్పొచ్చు.
ఎందుకంటే, చిరంజీవి రాజకీయాలకు దూరంగా వున్నా, పలువురు రాజకీయ ప్రముఖులతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ సన్నిహితుల లిస్టులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా వున్నారు.