ఇంతలోనే ఎంత మార్పు.? అది 2009 ఎన్నికల సమయం.. అప్పట్లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి వచ్చిన చిరంజీవి (Mega Star Chiranjeevi The Legend), అనూహ్యంగా కొందరివాడైపోయాడు. ఓ సామాజిక వర్గానికే ఆయన ప్రతినిథి.. అన్నట్టుగా మాట్లాడారు. బ్లడ్ బ్యాంక్ ద్వారా ఏకంగా రక్తాన్ని అమ్మేసుకుంటున్నాడంటూ దుష్ప్రచారం చేశారు.
రోజులు మారాయ్.. ఇప్పుడు చిరంజీవి అందరివాడు. ఎందుకంటే, ఆయనిప్పుడు రాజకీయాల్లో లేడు మరి. రాజకీయం అంటే, అది ప్రజా సేవ కోసం. రాజకీయాల్లోకి ఎవరైనా రావొచ్చు. కానీ, చిరంజీవి లాంటోళ్ళు రాకూడదు. అలాగని కొందరు సరికొత్త రాజ్యాంగాన్ని రాసి పారేశారు.
రాజకీయాలంటే అంతేనా.?
రాజకీయాలన్నాక విమర్శలు సహజం. ఆ రాజకీయ విమర్శలు హద్దులు దాటి, వ్యక్తిగత జీవితాల్లోకి తొంగిచూస్తే.. అంతకన్నా హేయం వుండదు. అలా ఎందుకు విమర్శలు చేస్తారు.? ఆ చేసే విమర్శల్ని తమ ఇంట్లోవాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారన్న సోయ ఎవరికన్నా వుంటే.. అసలు హద్దు మీరిన విమర్శలు రాజకీయాల్లోనే వుండవు.
‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి చుట్టూనే కథ నడుస్తోంది. చిరంజీవి మద్దతు ఎవరికి వుంది.? అన్న దిశగా ఇటు మీడియా, అటు సినీ వర్గాల్లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి, ‘మా’ వ్యవస్థాపక అధ్యక్షుడు. కానీ, ఇన్నేళ్ళలో చిరంజీవి పెద్దరికాన్ని ఎవరూ గుర్తించింది లేదు. గుర్తించక కాదు, గుర్తించడం చాలామందికి ఇష్టం లేదు మరి.
చిరంజీవిపై ఈ కొత్త ప్రేమ.. అందుకేనా.?
దర్శక రత్న దాసరి నారాయణరావు మరణం తర్వాత తెలుగు సినీ పరిశ్రమకు పెద్ద దిక్కు అవసరమైంది. ఆ పెద్ద దిక్కు చిరంజీవి మాత్రమే అయ్యారు. నిజానికి చిరంజీవి కోరుకున్న పదవి కాదిది. ఆయన మీద బలవంతంగా రుద్దబడిన బాధ్యత.. అనే భావన చాలామందిలో వుంది.
చిరంజీవి, గతంలో ఎలా వున్నారో.. ఇప్పుడూ అలానే వున్నారు. కానీ, కొందరు మారారు.. ఆ మార్పు కారణంగానే చిరంజీవి పెద్దరికం ఇప్పుడు అందరికీ కనిపిస్తోంది. అప్పుడు చిరంజీవిని దూషించినోళ్ళు, చిరంజీవిని తూలనాడినోళ్ళు.. ఇప్పుడు చిరంజీవిని ‘పెద్ద’గా అభివర్ణిస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి ‘అందరివాడు’ అయితే, రాజకీయాల్లో ఆయన్ని తొక్కేయాలని ఎందుకు అనుకున్నట్టు.? చిరంజీవి (Mega Star Chiranjeevi The Legend) పద్మభూషణ్ పురస్కారం వరించిన సమయంలోనూ పెదవి విరిచిన కుసంస్కారులిప్పుడు.. అహో చిరంజీవి, ఒహో చిరంజీవి.. అంటూ కీర్తనలు పాడేస్తున్నారు. అంతా కాలమహిమ.