Table of Contents
భారత్ – పాకిస్తాన్ మధ్య ఎప్పుడు ఎక్కడ క్రికెట్ జరిగినా ఆ కిక్కే వేరప్పా. ఇరు దేశాల మధ్యా ద్వైపాక్షిక సిరీస్‌లకు అవకాశమే లేకుండా పోయింది. సరిహద్దుల్లో తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న నేపథ్యంలో భారత్, పాకిస్తాన్‌తో క్రీడా సంబంధాల్ని తెగతెంపులు చేసుకుంది. దాంతో కొన్ని ప్రత్యేకమైన సిరీస్‌లలో మాత్రమే భారత్ – పాకిస్తాన్ తలపడాల్సిన పరిస్థితి. మొన్నామధ్య జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా, పాకిస్తాన్ చేతిలో ఓటమి పాలయ్యింది. ఆ ఓటమికి గల కారణాల్లో కెప్టెన్ కోహ్లీ – అప్పటి కోచ్ కుంబ్లే మధ్య విభేదాలు కీలక భూమిక పోషించాయనేది అందరికీ తెలిసిన సంగతే. ఆ ఓటమికి తాజాగా టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది.
పాకిస్తాన్‌పై విక్టరీ.. ఆ కిక్కే వేరప్పా
దుబాయ్‌లో జరుగుతోన్న ఆసియా కప్ టోర్నీలో టీమిండియా ఇప్పటికే ఓ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. తాజాగా ‘దాయాది’ పాకిస్తాన్‌పై విజయంతో టీమిండియా, ఆసియా కప్‌లో దూకుడు ప్రదర్శించింది. పసికూన హాంగ్ కాంగ్‌పై గెలిచేందుకు టీమిండియా చెమటోడ్చాల్సి వచ్చింది. ఓ దశలో హాంగ్ కాంగ్ గెలిచేస్తుందా? అన్న అనుమానాలు కలిగాయి భారత క్రికెట్ అభిమానుల్లో. ఎలాగైతేనేం, గట్టెక్కేశామన్న భావన టీమిండియా గెలిచాక అభిమానుల్లో కలిగిందనడం అతిశయోక్తి కాదు. మరి, పాకిస్తాన్‌తో టీమిండియా ఎలా పెర్ఫామ్ చేస్తుందట.? అన్న ఆందోళన భారత క్రికెట్ అభిమానులకు కలగడం సహజమే కదా.!
భారత బౌలర్ల దెబ్బకు పాక్ బెంబేలు
అందుకే, టీమిండియా ఎక్కడా ఛాన్స్ ఇవ్వలేదు. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్‌ని కేవలం 162 పరుగులకే కట్టడి చేశారు భారత బౌలర్లు. 43.1 ఓవర్లలో 162 పరుగులు చేసి పాకిస్తాన్ ఆలౌట్ అయ్యిందంటే, భారత బౌలర్లు ఎంత పకడ్బందీగా బౌలింగ్ చేశారో అర్థం చేసుకోవచ్చు. చివర్లో కొన్ని క్యాచ్‌లు మిస్ చేయడం సంగతి పక్కన పెడితే, పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్ పరుగులు రాబట్టడానికి చాలా కష్టపడేలా టీమిండియా బౌలింగ్, ఫీల్డింగ్ సాగింది. సానియా మీర్జాని పెళ్ళాడి, భారత్‌కి అల్లుడిగా మారిన షోయబ్ మాలిక్ మాత్రం, కాస్సేపు పోరాడాడు. భారత బౌలర్లను ప్రతిఘటించాడు. దురదృష్టవశాత్తూ 43 పరుగుల వద్ద రనౌటయ్యాడు.
కేదార్ జాదవ్ మాయాజాలం
ఈ మ్యాచ్‌లో భారత్ బౌలింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఫుల్ టైమ్ బౌలర్ కాని కేదార్ జాదవ్ మ్యాజిక్ చేశాడు. మూడు వికెట్లు అతని ఖాతాలో పడ్డాయి. భువనేశ్వర్‌కుమార్‌కి కూడా మూడు వికెట్లు దక్కగా, బుమ్రా రెండు వికెట్లను పడగొట్టాడు. కుల్‌దీప్ యాదవ్‌కి ఒక వికెట్ లభించింది. పరుగుల పరంగా 5 రన్ రేట్ భారత బౌలర్లు ఎవరూ ఇవ్వకపోవడం ఈ మ్యాచ్‌లో మరో హైలైట్ అంశం. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, మైదానంలో తీవ్రంగా ఇబ్బంది పడటం, దాంతో అతన్ని స్ట్రెచర్ మీద తరలించడం జరిగాయి. వెన్ను నొప్పి కారణంగా ఐదో ఓవర్ పూర్తి చేయలేకపోయాడు హార్దిక్. ఆ ఓవర్‌లో మిగిలిన ఒక్క బంతిని అంబటి రాయుడు వేశాడు.
భారత బ్యాటింగ్ కెవ్వు కేక
భారత బ్యాటింగ్ గురించి మాట్లాడుకుందాం. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, మెరుపు ఇన్నింగ్స్‌తో అదరగొట్టేశాడు. రోహిత్ ధాటికి పాకిస్తాన్ బౌలర్లకు చుక్కలు కన్పించాయి. బౌండరీలు, సిక్సర్ల మోత మోగించేశాడు. 39 బంతుల్లో 52 పరుగులు సాధించి ఔటయ్యాడు రోహిత్ శర్మ. మరోపక్క శిఖర్ ధావన్ ఆచి తూచి ఆడాడు. 4 పరుగుల దూరంలో అర్థ సెంచరీని మిస్ చేసుకున్నా, టీమిండియాకి విలువైన పరుగుల్ని అందించాడు. ఆ తర్వాత మిగిలిన పనిని అంబటి రాయుడు, దినేష్ కార్తీక్ అలవోకగా పూర్తి చేసేశారు. చివర్లో ఈ ఇద్దరూ సరదాగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసినట్లే టైమ్ పాస్ చేయడం గమనార్హం. ఇంకో 21 ఓవర్లు వుండగానే టీమిండియా, పాకిస్తాన్ పై ఘనవిజయం సాధించింది. ఈ టోర్నీలో ఇది టీమిండియాకి రెండో విజయం.