పెళ్ళీడుకొచ్చిన కూతురున్న ఓ తల్లి (శాడిస్టు భర్తకు దూరమై కూతురే జీవితంగా బతుకుతుంది), ప్రేమలో పడుతుంది. మహా కోపిష్టి, అంతకంటే ఎక్కువ మొహమాటం (ఆడవాళ్ళంటే) కలిగిన ఓ రిటైర్డ్ మేజర్.. పెళ్ళి ప్రయత్నాల్లో బిజీగా వుండే ఓ అమ్మాయ్.. తల్లిదండ్రుల్ని కోల్పోయిన ఓ అబ్బాయ్, అతని తమ్ముడు.. వీళ్ళందరి మధ్యా నడిచే ఓ కథ. ఇదీ ‘పరిణయం’ (Parinayam Review Telugu) సినిమా.
సీనియర్ నటులు సురేష్ గోపి, శోభన.. యంగ్ జనరేషన్ యాక్టర్స్ దుల్కర్ సల్మాన్, కళ్యాణి ప్రియదర్శన్.. వీళ్ళందరూ కలిసి ‘పరిణయం’ సినిమాలో నటించారు. తల్లి (శోభన) అంటే కూతురుకి (కళ్యాణి ప్రియదర్శన్) బోల్డంత ప్రేమ, గౌరవం.
కానీ, ఓ అబ్బాయిని పెళ్ళాడాలనుకున్న తరుణంలో.. అంతా ఓకే అనుకుంటున్న సమయంలో, తన తల్లి ఇంకో వ్యక్తితో ప్రేమలో పడిందని తెలిసి నలిగిపోతుందా అమ్మాయ్. తల్లి, ఆ కుమార్తె దగ్గర ఆ విషయాన్ని దాచకపోవడం మరో ఆసక్తికరమైన అంశం. సమాజం ఏమనుకుంటుంది.? అన్న ఆలోచన పక్కన పెట్టి, రిటైర్డ్ ఆర్మీ మేజర్‌తో ప్రేమలో పడుతుంది ఆ మధ్య వయసు మహిళ. చివరికి ఏమవుతుందో తెరపై చూడాల్సిందే.
కథ పాతదే.. కథనం కొత్తది..
ఈ తరహా కథతో చాలా సినిమాలు వచ్చి వుండొచ్చు. కానీ, ఇదొక ప్రత్యేకమైన సినిమా. అందుకేనేమో, మలయాళంలో మంచి విజయాన్ని అందుకుంది. ఇతర భాషల్లోనూ ఆకట్టుకుంటోంది. సినిమాలో పాత్రలే కనిపిస్తాయి తప్ప, నటీనటులు కనిపించరు. సురేష్ గోపి నిజంగానే సర్‌ప్రైజ్ ప్యాకేజీ. శోభన కూడా అంతే.
సీనియర్ నటులతో పోటీ పడ్డారు కళ్యాణి ప్రియదర్శన్, దుల్కర్ సల్మాన్. సపోర్టింగ్ రోల్స్ చేసినవారు కూడా, సినిమాకి అవసరమైనంత మేర.. తమ నటనా ప్రతిభను అందించారు. సినిమాటోగ్రఫీ బావుంది. మాటలు బావున్నాయ్.. ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్పీగా వుంటే బావుండేది. అలాగని మరీ సాగతీతగా ఏమీ అనిపించదు. నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది.
సమ్‌థింగ్ సమ్‌థింగ్..
తన కోపమే తన శతృవు అని తెలుసుకున్న మేజర్, ఆ కోపం నుంచి బయటపడేందుకు పడే పాట్లు కడుపుబ్బా నవ్వించడమే కాదు, ప్రేక్షకుల్ని ఆలోచనల్లో పడేస్తాయ్. అలాగే, కుమార్తె విషయంలో తల్లి పడే తపన, నచ్చిన అమ్మాయి కోడలవుతుందని సంతోషపడినా, కోడలు కావాల్సిన అమ్మాయిని, తన కొడుకు దూరం చేసుకోవడంపై ఆందోళన చెందే ఓ మహిళ.. తన భర్తలాంటోడే, తన కుమారుడన్న విషయాన్ని ఆ అమ్మాయికి చెప్పే సందర్భం.. వాట్ నాట్… అన్నీప్రత్యేకమైనవే.
ఇలాంటి సినిమాలు తెలుగులోనూ స్ట్రెయిట్‌గా ఎందుకు ఎక్కువగా రావు.? అన్నదే ఈ సినిమా ( Parinayam Review Telugu ) చూశాక చాలామందిలో మెదిలే ప్రశ్న. వస్తాయ్, రావాలి కూడా.!
