Table of Contents
Pragya Nagra Deepfake.. నిజం గడప దాటేలోపు, అబద్ధం ఊరంతా తిరిగేస్తుందనేది ఓ నానుడి.! ఔను, ఇది నిజమే.! చాలా సందర్భాల్లో నిరూపితమయ్యింది కూడా.!
కొన్నాళ్ళ క్రితం సినీ నటి రష్మిక మండన్న పేరుతో ఓ వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యింది. ఆ వీడియో అప్పట్లో వైరల్ అయ్యింది కూడా.!
చివరికి అది ‘డీప్ ఫేక్’ అని తేల్చారు. చాలాకాలం క్రితం సినీ నటి త్రిషకి చెందిన ఓ వీడియో వెలుగులోకి వచ్చింది.
అప్పట్లో సోషల్ మీడియా లేదు.. ఇంటర్నెట్ అప్పుడప్పుడే అందరికీ అందుబాటులోకి వస్తున్న రోజులవి. ఆ వీడియో తనది కాదు మొర్రో.. అని త్రిష నెత్తీ నోరూ బాదుకోవాల్సి వచ్చింది.
డీప్ ఫేక్ బాధితురాలు రష్మిక..
ఇక, రష్మిక వీడియో విషయానికొస్తే, ఆమె పోలీసుల్ని ఆశ్రయించింది.. ఆమెకు చాలామంది సినీ ప్రముఖుల నుంచి మద్దతు లభించింది కూడా.
ఇటీవలి కాలంలో ఇంకో చెత్త ట్రెండ్ షురూ అయ్యింది. అదేంటంటే, ‘నా దగ్గర ఫలానా నటి వీడియో వుంది.. అది కావాలంటే డీఎమ్ చేయండి..’ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం.

రీచ్ కోసం పడే పాట్లు ఇవి. ఇలా ఫేక్ వీడియోలు ప్రచారంలోకి తీసుకురావడం సర్వసాధారణమైపోయింది. సైబర్ క్రైమ్ విభాగం, ఇలాంటి వ్యవహారాల్ని లైట్ తీసుకుంటోందా.? అంటే, ఔననే అనాలేమో.
Pragya Nagra Deepfake.. కన్నీరు మున్నీరైన ప్రగ్యా నగ్రా..
కొద్ది రోజుల క్రితమే సినీ నటి ప్రగ్యా నగ్రాకి సంబంధించి ఇలానే ఓ వీడియో గురించి సోషల్ మీడియా వేదికగా పెద్ద రచ్చ జరిగింది.
తనకు సంబంధం లేని ఆ వీడియో విషయమై, ప్రగ్యా నగ్రా ఆవేదన చెందుతూ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇది ఇక్కడితో ఆగే వ్యవహారం కాదు.
సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది. కొత్త కొత్త యాప్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ని దుర్వినియోగం చేస్తూ ఫేక్ వీడియోలు సృష్టిస్తున్నారు.
సమాజానికి పట్టిన క్యాన్సర్..
ఇలాంటి డీప్ ఫేక్ వీడియోలు ఇటీవలి కాలంలో సర్వసాధారణమైపోయాయి. అవి, ఒరిజినల్ వీడియోల్ని తలదన్నేలా వుంటున్నాయి. మరి, ఈ రోగానికి చికిత్స ఏంటి.?
కేవలం సెలబ్రిటీలు మాత్రమే కాదు, సాధారణ మహిళలు కూడా ఈ డీప్ ఫేక్ వీడియోలకు బలైపోతున్న పరిస్థితిని చూస్తున్నాం. క్యాన్సర్ మహమ్మారి కంటే దారుణంగా తయారైందీ డీప్ ఫేక్ మహమ్మారి.
Also Read: కట్టుకున్న భార్యని రోడ్డు మీదకు లాగేసిన ‘పాండిత్యం’.!
అదే సమయంలో, కొంతమంది.. కనీసపాటి విజ్ఞత కూడా లేకుండా వ్యవహరిస్తున్నారు. అలాంటివారిపై సైబర్ క్రైమ్ విభాగం ఉక్కుపాదం మోపాల్సిందే. లేకపోతే, రానున్న రోజులు మరింత భయంకరంగా తయారవుతాయ్.!
ఈ తరహా వీడియోల్ని ఎవరైతే సర్క్యులేట్ చేస్తున్నారో, ఆ పరిస్థితి తమ కుటుంబంలోని మహిళలకూ వచ్చే ప్రమాదముందని వాళ్ళు గుర్తెరగాలి.