Table of Contents
Prashant Kishor.. ఫలానా రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తే తమకు మేలు చేస్తుందా.? లేదా.? అని జనం ఆలోచించుకుని, ఓట్లేయాలి.
ప్రజలకు ఏం చేస్తే తమను కలకాలం గుర్తు పెట్టుకుంటారో ఆలోచించి, అందుకు అనుగుణంగా ఎన్నికల ప్రచారంలో చెప్పాల్సిన అంశాల్ని రాజకీయ పార్టీలు తయారు చేసుకోవాలి.
కానీ, రాజకీయం మారింది. రాజకీయంలోకి కార్పొరేట్ శక్తులు దిగబడ్డాయి. ఫలానా ఊళ్ళో, ఫలానా ఓటరు ఎవరికి ఓటు వెయ్యాలన్నది కార్పొరేట్ శక్తులు డిసైడ్ చేస్తున్నాయి.
Prashant Kishor.. వ్యాపారం తప్ప నైతికత ఏది.?
ఔను, ప్రశాంత్ కిశోర్ లాంటి రాజకీయ వ్యూహకర్తలు.. ఏ పార్టీ కోసం పని చేస్తే, ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తుంటారు తప్ప.. వాళ్ళకి ‘నైతికత’తో సంబంధం లేదు.
ఎన్నికల్లో ఆయా రాజకీయ పార్టీలకు గెలుపు వ్యూహాలు అందించేందుకోసం కోట్ల రూపాయల్లో ఫీజులు తీసుకోవాలి.! గెలిపించి, అంతకు మించిన మొత్తంలో ఫీజులు వసూలు చేసుకోవాలి.. తమ స్థాయి పెంచుకోవాలన్నదే ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే లాంటి రాజకీయ వ్యూహకర్తల ఆలోచనగా వుంటుంది.
కోడి కత్తి రాజకీయ ఆయుధంగా మారిందంటే, దానికి ప్రశాంత్ కిషోర్ లాంటి రాజకీయ వ్యూహకర్తలే కారణం.
గెలిపించడానికి ఎంతకైనా దిగజారాలా.?
రాజకీయ పార్టీలకు చెందిన నాయకుల మీద ‘ఇంక్’ చల్లడం, చీపుళ్ళతోనూ చెప్పులతోనూ రాజకీయ నాయకులపై దాడులు చేయించడం.. ఇవన్నీ కార్పొరేట్ రాజకీయ వ్యూహకర్తల వ్యూహాల్లో భాగం.
ఇన్ని తెలిసినోడు, రాజకీయ పార్టీ పెట్టేసి.. దేశంలో అధికారంలోకి వచ్చేసి.. కార్పొరేట్ రాజకీయం, కార్పొరేట్ పాలన చేసెయ్యొచ్చు కదా.?
‘సొంత వైద్యం పనికిరాదు..’ అని పెద్దలు అంటుంటారు. బహుశా దాన్ని ప్రశాంత్ కిషోర్ పాటిస్తున్నారేమో.! అప్పుడెప్పుడో ఏదో పార్టీలో చేరాడు, బయటకు వచ్చేశాడు. కాంగ్రెస్ పార్టీలో చేరతానన్నాడు, తూచ్ అనేశాడు.
కొత్త రాజకీయ కుంపటి అంటున్నాడు, పాదయాత్ర చేస్తానని ప్రకటించేశాడు. ఫీజు తీసుకుని ఆయా రాజకీయ పార్టీలకు కోడి కత్తి లాంటి సలహాలిచ్చిన ప్రశాంత్ కిషోర్ గనుక ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే, ఇంకెలాంటి చెత్త వ్యూహాలు అమలు చేస్తాడో.!
వెనక్కి తగ్గడానికి అదే కారణమేమో.!
బహుశా, 2024 ఎన్నికల కోసం ముందస్తుగానే ఆయా రాజకీయ పార్టీలతో ఒప్పందాలు చేసేసుకుని వున్నాడు కదా.! ఆ డీల్స్ ఎక్కడ చేజారిపోతాయోనని వెనకడుగు వేసినట్టున్నాడు ఈ ప్రశాంత్ కిషోర్.
కాంగ్రెస్ పార్టీలోకి (Congress Party) తాను వెళ్ళి, తనతోపాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనీ (YSR Congress Party), తెలంగాణ రాష్ట్ర సమితిని (Telangana Rashtra Samithi) కూడా కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షాలుగా మార్చెయ్యాలని ప్రశాంత్ కిషోర్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.
Also Read: పబ్బుకెళ్లి బజ్జీలు తినకూడదా అధ్యక్షా.?
ఇలాంటి రాజకీయాన్ని ఏమనాలి.? ఇది రాజకీయం కాదు, బ్రోకరిజం అంటే తప్పేముంది.? దీన్ని కార్పొరేట్ స్టైలింగ్ అనాల్సి వస్తే అంతకన్నా దిగజారుడుతనం ఇంకేమీ వుండదు.
దేశం పట్ల, దేశ ప్రజల పట్ల కనీసపాటి బాధ్యత లేనోళ్ళు రాజకీయ వ్యూహకర్తలుగా, దేశ రాజకీయాల్ని ప్రభావితం చేస్తుండడం ప్రజాస్వామ్యానికి పాతరేయడమే.!
ఔను, ప్రజాస్వామ్యం నుంచి ప్రజల్ని దూరం చేసేందుకే ఇలాంటి కార్పొరేట్ శక్తులు రాజకీయాల్లోకి వస్తున్నాయ్. వీటి పట్ల ప్రజలే అప్రమత్తంగా వుండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి.