Table of Contents
Pushpaka Vimanam Review ‘పెద్ద సినిమాలు’గా అభివర్ణించబడుతోన్న చాలా సినిమాల్లో కథ, కాకరకాయ్ ఏమీ వుండటంలేదు. కామెడీ పేరుతో కంగాలీ, యాక్షన్ పేరుతో బీభత్సం.. అబ్బో, చెప్పకుంటూ పోతే అదొక ప్రసహనం. కొన్ని చిన్న సినిమాలు మాత్రం, ఆసక్తి రేపే కథ, కథనాలతో ఆకట్టుకుంటున్నాయి.
బహుశా అందుకేనేమో, పెద్ద సినిమాల కంటే చిన్న సినిమాల పట్ల ప్రేక్షకులూ ఈ మధ్య బాగా ఆకర్షితులవుతున్నారు. ఓటీటీ పుణ్యమా అని, ఈ చిన్న సినిమాలకు అభిమానులు రోజురోజుకీ పెరిగిపోతున్నారు. అలాగని, అన్ని చిన్న సినిమాలూ అందంగా వుంటున్నాయని కాదు.
Pushpaka Vimanam Review, సరదా సరదాగా..
ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది ‘పుష్పక విమానం’ (Pushpaka Vimanam) సినిమా గురించి. థియేటర్లలో విడుదలైంది.. బాగానే వుందనిపించుకుంది. ఓటీటీలోకి వచ్చింది.. ఇంటిల్లపాదినీ ఎట్రాక్ట్ చేసింది.. ప్రోమోతో. ‘పెళ్ళాం లేచిపోవడం’ అనే కాన్సెప్ట్‌తో సినిమాలు గతంలోనూ వచ్చాయి. అయితే, ఇది ఫన్ నోట్‌తో వచ్చిన సినిమా.
ఈ సినిమాలో పూర్తిగా ఫన్ మాత్రమే వుంటుందనుకుంటే పొరపాటే. సరదాగా ప్రారంభమై, ఒకింత భారంగా ముగుస్తుంది. అయితే, ఆ భారమైన విషయాన్ని ముందే చెప్పేయడంతో, సినిమా పూర్తయ్యాక ప్రేక్షకుడికి మరీ అంత భారంగా అనిపించదు.
ఆనంద్ బంగారుకొండ..
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) సోదరుడు ఆనంద్ దేవరకొండ మంచి మంచి కథల్నే ఎంచుకుంటున్నాడు. పక్కింటి కుర్రాడిలా బాగానే సెట్టయిపోతున్నాడు. ఈ సినిమాతో ఇంకాస్త జనంలోకి బలంగా చొచ్చుకుపోయాడు నటుడిగా. హీరోయిన్లలో శాన్వి మేఘన (Saanve Megghana) ఆకట్టుకుంది. మరో హీరోయిన్ గీత్ శైనీ (Geeth Saini) కూడా ఓకే.

తన పెళ్ళాం లేచిపోయిందనే విషయం తెలిస్తే, అందరూ తనను ఎగతాళి చేస్తారనే భయం కొత్తగా పెళ్ళయిన హీరోకి వుంటుంది. పెళ్ళయ్యాక జస్ట్ రోజుల వ్యవధిలోనే అతని భార్య అతన్ని విడిచి వెళ్ళిపోతుంది. పెళ్ళాం తనను వదిలేసిందనే విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేక, వేరే అమ్మాయిని తన జీవిత భాగస్వామిగా తన సహచర ఉద్యోగులకు పరిచయం చేస్తాడు హీరో.
కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం..
కానీ, ఇంతలోనే తన అసలు భార్య చనిపోయిందని హీరోకి తెలుస్తుంది. ఎవరు చంపారు.? అన్నది తెలుసుకునే ప్రయత్నంలో, పోలీసుల నుంచి ‘హంతకుడు’ అన్న ముద్ర వేయించుకుని, ఆ కేసు నుంచి బయటపడటానికి నానా తంటాలూ పడతాడు హీరో. ఇంతకీ, ఆ హత్య చేసిందెవరు.? అది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Also Read: Ashu Reddy కాన్ఫిడెన్స్.. హాటుగా ఘాటుగా.?
సినిమాలో ప్రతి ఫ్రేమ్ అందంగా కనిపించింది. సంభాషణలకూ మంచి మార్కులే పడతాయి. సెకెండాఫ్‌లో కత్తెర పదును కాస్త అవసరం అనిపిస్తుంది. సంగీతం ఆకట్టుకుంటుంది. ఓవరాల్‌గా సినిమాలో పెద్దగా మైనస్‌లు ఏమీ లేవుగానీ, ఇంకాస్త క్రిస్పీగా వుంటే బావుండేదనిపిస్తుంది.
హర్షవర్ధన్, సీనియర్ నటుడు నరేష్, పోలీస్ అధికారి పాత్రలో సునీల్.. ఈ సినిమాకి అదనపు ‘స్పైస్’ యాడ్ చేశారు. ఓటీటీ బొమ్మ కనుక, సాగతీతగా అనిపించిన చోట ముందుకు నడిపేస్తూ, సినిమాని ఎంజాయ్ చేసెయ్యొచ్చు. టైమ్ పాస్‌కి (Pushpaka Vimanam Review) డోకా ఏమీ వుండదు.
– yeSBee
