ఆరోగ్యం సహకరించకపోవడం వల్లే కొత్త రాజకీయ పార్టీ పెట్టలేకపోతున్నానంటూ రాజకీయ రంగ ప్రవేశంపై సంచలన ప్రకటన విడుదల చేశారు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth Shocking Political Twist). తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ పోటీ చేస్తుందంటూ కొద్ది రోజుల క్రితమే రజనీకాంత్ ప్రకటించిన విషయం విదితమే.
రాజకీయ పార్టీని ఈ నెల 31న ప్రకటించాలని అందుకు తగ్గ ఏర్పాట్లను రజనీకాంత్ చేసుకున్నారు కూడా. అయితే, ఇంతలోనే కరోనా రూపంలో పెద్ద షాక్ తగిలింది. రజనీకాంత్ నటిస్తోన్న ‘అన్నాత్తె’ సినిమా షూటింగ్ హైద్రాబాద్‌లో జరుగుతుండగా, ఆ యూనిట్ సిబ్బందిలో కొందరికి కరోనా సోకింది.
అయితే, రజనీకాంత్‌కి మాత్రం కరోనా నెగెటివ్‌గా తేలింది. ఇంతలోనే, రజనీకాంత్ అనారోగ్యానికి గురయ్యారు. ఆసుపత్రిలో చేరాక, ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది. అయితే, ఆసుపత్రిలో ఏం జరిగిందోగానీ, ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక, చెన్నయ్‌కి వెళ్ళిన రజనీకాంత్, తాను రాజకీయ పార్టీ పెట్టబోవడంలేదంటూ అభిమానుల్ని ఉద్దేశించి ఓ ప్రకటన చేశారు.
అభిమానులు తనను క్షమించాలని కూడా కోరారు తమిళ సూపర్ స్టార్. అనారోగ్య కారణాల రీత్యా తాను రాజకీయ పార్టీ పెట్టలేకపోతున్నట్లు అందులో పేర్కొన్నారు.
‘నా ఆరోగ్య పరిస్థితుల రీత్యా నేను సాహసం చేయలేను. ప్రజలను ఇబ్బందుల్లో పెట్టలేను. కేవలం సోషల్ మీడియా ప్రచారంతో ఏ పార్టీ కూడా గెలవదు. నిజం మాట్లాడటానికి ఎప్పుడూ వెనుకాడను. రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రజా సేవ మాత్రం నిరంతరం కొనసాగిస్తాను..’ అని రజనీకాంత్, అభిమానులకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
తన నిర్ణయం అభిమానుల్ని బాధపెట్టినా, ఈ పరిస్థితుల్లో ఇంతకు మించి తానేమీ చేయలేనని రజనీకాంత్ వ్యాఖ్యానించడం గమనార్హం. నిజానికి, ఇది చాలా తెలివైన నిర్ణయంగా రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే, ఇప్పుడున్న రాజకీయాల్లో రజనీకాంత్ లాంటోళ్ళు రాణించడం దాదాపుగా అసాధ్యం.
రాజకీయాల్లోకి వస్తే, విమర్శలు చేయాలి.. ప్రతి విమర్శల్ని తట్టుకోవాలి. ఇంతా చేసి, రాజకీయాల్లో నెగ్గుకు రాలేకపోతే, అది అత్యంత అవమానకరంగా బావించాల్సి వస్తుంది. ఇవన్నీ ఈ వయసులో రజనీకాంత్‌కి అవసరమా.? పైగా, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ తర్వాత, రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితి చాలా సున్నితంగా మారిపోయింది.
తెరవెనుక ఏం జరిగింది.? అనే విషయాన్ని పక్కన పెడితే, సరైన సమయంలో రజనీకాంత్ (Rajinikanth Shocking Political Twist) మంచి నిర్ణయమే తీసుకున్నారు. సినిమాలతో వచ్చే అభిమానంతో పోల్చితే, రాజకీయాల్లో పోగొట్టుకునేదే ఎక్కువ.