మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. (Ram Charan Reveals His Dream Role) కెరీర్‌లో ఎన్నో విజయాల్ని అందుకున్నాడు. తండ్రికి తగ్గ తనయుడు మాత్రమే కాదు, తండ్రిని మించిన తనయుడిగానూ పేరు ప్రఖ్యాతులు దక్కించుకున్నాడు. ఓ వైపు నటన, ఇంకో వైపు నిర్మాణం.. రెండు పడవల మీద సాఫీగా సాగిపోతోంది రామ్ చరణ్ ప్రయాణం.
ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా చేస్తోన్న మెగా పవర్ స్టార్, కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ఆచార్య’ సినిమాలోనూ నటించే అవకాశముంది. అన్నీ అనుకున్నట్టు జరిగి వుంటే, ఈపాటికి ‘ఆచార్య’ సినిమా ఓ కొలిక్కి వచ్చేది. కరోనా దెబ్బకి అన్ని ప్లాన్స్ మారిపోయే పరిస్థితి ఏర్పడింది.
‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా షూటింగ్ ప్రారంభమైతే, ‘ఆచార్య’ కోసం చరణ్ డేట్స్ ఇవ్వడం కష్టమే కావొచ్చు. కానీ, ఆ సినిమాలో చేయడానికి మెగా పవర్ స్టార్ ఉవ్విళ్ళూరుతున్నాడు. ‘అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆ సినిమాలో నేనూ వుంటాను’ అని చరణ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.
ఈ సినిమాని రామ్ చరణ్, కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్న విషయం విదితమే. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించనుంది. ఇదిలా వుంటే, చరణ్ తన తాజా ఇంటర్వ్యూలో తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి చెప్పాడు.
‘స్పోర్ట్స్ డ్రామా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. గతంలో ఓ సినిమా (మెరుపు) అనుకున్నాం. కొన్ని కారణాలతో అది ఆగిపోయింది..’ అని చెప్పిన చరణ్, అలాంటి ఓ సినిమా (Ram Charan Reveals His Dream Role) ఖచ్చితంగా చేస్తానని అన్నాడు. ఇప్పుడెలాగూ స్పోర్ట్స్ నేపథ్యంలో సినిమాల జోరు పెరిగింది.
సో, దర్శక నిర్మాతలకు చరణ్ ఓ స్ట్రెయిట్ ఐడియా ఇచ్చేసినట్లే. చరణ్‌తో సినిమా అంటే దర్శక నిర్మాతలు ‘క్యూ’ కట్టేయడం మామూలే. కానీ, చరణ్ ముందు ‘ఆర్‌ఆర్‌ఆర్’ అనే చాలా పెద్ద లక్ష్యం వుంది. రాజమౌళి ప్రాజెక్ట్ అది. ఆ తర్వాతే చరణ్ తన తదుపరి ప్రాజెక్టుల గురించి ఆలోచించాల్సి వుంటుంది.
‘ఆర్‌ఆర్‌ఆర్’లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR) కలిసి నటిస్తోన్న విషయం విదితమే. తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి ఇది అతి పెద్ద మల్టీస్టారర్. ‘ఆర్‌ఆర్‌ఆర్’లో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ (Alia Bhatt) హీరోయిన్‌గా నటిస్తోంటే, యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన ఇంగ్లీష్ బ్యూటీ ఒలీవియా మోరిస్ నటిస్తోంది.
అజయ్ దేవగన్, సముద్రఖని తదితరులు ఈ సినిమాలో ఇతర ప్రధాన తారాగణం. డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.