కరోనా వైరస్ దెబ్బకి దేశమంతా అతలాకుతలమైపోయింది. సెలబ్రిటీలు తమకు తోచిన రీతిలో పేదల్ని ఆదుకునేందుకు ముందుకొచ్చారు. ఒక్కొక్కరు ఒక్కోలా తమ శక్తి మేర సాయం చేశారు. అందరిలోకీ, ప్రముఖ సినీ నటుడు సోనూ సూద్ (Sonu Sood The Real Hero) పేరు ప్రముఖంగా విన్పించింది.
అందుక్కారణం సోనూ సూద్, అవసరమైనవారికి అవసరమైన రీతిలో సాయం చేయడమే. సొంతూరికి దూరంగా ఎక్కడో చిక్కుకుపోయినవారికి, సొంతూళ్ళకు వెళ్ళేందుకు సాయం చేశాడు. ఓ నిరుపేద కుటుంబం కష్టాన్ని చూసి, రాత్రికి రాత్రి వాళ్ళింటి ముందు కొత్త ట్రాక్టర్ వచ్చేలా చేశాడు.
ఓ యువతి, కరోనా కష్టాల నేపథ్యంలో ఉద్యోగం కోల్పోతే.. ఆమెను ఆదుకుకోవడమే కాదు, ఉద్యోగం కూడా ఇప్పించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే, ఒకటా.? రెండా.? లెక్కలేనన్ని కన్పిస్తాయి. వెండితెరపై కరడుగట్టిన విలనిజం పండించేస్తాడు సోనూ సూద్.
కానీ, రియల్ లైఫ్‌లో రియల్ హీరో అన్పించుకున్నాడీ కండల వీరుడు. తనకు చేతనైనంత సాయం చేయడం కాదు.. అంతకు మించిన సాయం అందిస్తూ వస్తున్నాడు. సోషల్ మీడియా వేదికగా ఎవరన్నా తమ గోడు వెల్లగక్కుకుంటే చాలు, వారికి సాయమందించేందుకు ఒక్క క్షణం కూడా ఆలోచించడు.
‘నాకు అవసరమైనదానికంటే ఎక్కువే సంపాదించాను.. ఆ సొమ్మునే ఖర్చు చేస్తున్నాను. ఈ సమయంలో నేను ఆ సొమ్ముని ఖర్చు చేయకపోతే, అది నాకెప్పటికీ ఉపయోగపడదు..’ అంటాడు సోనూ సూద్.
‘నేనేమీ హీరోని కాదు.. సాధారణ మనిషిని మాత్రమే. నాకు అవకాశం వుంది నేను సాయం చేస్తున్నాను..’ అని మాత్రమే చెబుతూ వచ్చిన ఈ రియల్ హీరో, తన చుట్టూ ఎన్నో రాజకీయాలు నడుస్తున్నా, తన మీద ఎన్నో అడ్డగోలు విమర్శలు వస్తున్నా.. వాటిని అస్సలేమాత్రం పట్టించుకోవడంలేదు.
సాయం కొందరే చేయగలరు.. ఆ కొందరిలోనూ సోనూ సూద్‌లా సాయం చేసేవాళ్ళు చాలా చాలా తక్కువ. అందుకే, సోనూ సూద్‌ని (Sonu Sood The Real Hero) ఇప్పుడంతా రాజువయ్యా.. మహరాజువయ్యా అంటున్నారు.