Revanth Reddy Telangana CM.. రవ్వంత రెడ్డీ.. రేటెంత రెడ్డీ.. ఇలా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీద, నానా రకాల రాజకీయ వెటకారాలూ చూశాం.
కానీ, ఇప్పుడా రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి పదవికి కూత వేటు దూరంలో వున్నారు. ‘మేం గెలిచేశాం..’ అని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీని అంచనా వేస్తున్నాయి దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డేనన్న చర్చ జోరందుకుంది.
Revanth Reddy Telangana CM ముఖ్యమంత్రి కళ.. కళ కళ.!
‘గెలిచినవారు రాజులు కాదు.. ఓడినవారు బానిసలూ కాదు.! ఇది ప్రజాస్వామ్యం.. అధికార పక్షం వుండాలి.. ప్రతిపక్షమూ వుండాలి. మేం వాళ్ళలా కాదు. మంచి పాలన అందిస్తాం.. అందరికీ సముచిత గౌరవం ఇస్తాం..’ అంటూ రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పోలింగ్ ముగిసిన తర్వాత, ఎగ్జిట్ పోల్ అంచనాలు వెల్లడయ్యాక, ఉత్సాహంగా రేవంత్ రెడ్డి మీడియా ముందుకొచ్చారు.
గతంలో, ప్రతిపక్షంలో వున్నప్పడు పరుషమైన మాటలు మాట్లాడామనీ, ఇప్పుడు మాత్రం బాధ్యతాయుతంగా వ్యవహరించబోతున్నామనీ రేవంత్ రెడ్డి చెప్పడం గమనార్హం.
మార్పు మంచిదే..
ముఖ్యమంత్రి పదవికి కూత వేటు దూరంలో వున్న రేవంత్ రెడ్డి నుంచి ఇలాంటి ‘మంచి మాటలు’ ఆహ్వానించదగ్గవే.
కానీ, ఇంకా ఎన్నికల ఫలితాలు రాలేదు. వచ్చినవి కేవలం ఎగ్జిట్ పోల్ అంచనాలు మాత్రమే. వీటికి అస్సలు విలువ లేదు. ఆ విషయం రేవంత్ రెడ్డికీ తెలుసు.
ఇదిలా వుంటే, ముఖ్యమంత్రి కాబోతోన్న రేవంత్ రెడ్డికి అదనపు భద్రత.. అంటూ అప్పుడే సోషల్ మీడియాలో హడావిడి షురూ అయ్యింది.
Also Read: రామ్ గోపాల్ వర్మని తిట్టాలా? ఇలా ట్రై చేసి చూడండి.!
ఒక్కటి మాత్రం నిజం.. తెలంగాణ రాజకీయాల్లో జీరో నుంచి హీరో స్థాయికి రేవంత్ రెడ్డి ఎదిగారు.! ఇందులో ఇంకో మాటకు తావు లేదు.
ఎగ్జిట్ పోల్ అంచనాలు నిజమై, కాంగ్రెస్‌లో కుమ్ములాటల్లేకుండా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలో కూర్చోగలిగితే.. ఖచ్చితంగా అదో మ్యాజికల్ మూమెంట్ అవుతుంది.
గెలిచాక కూడా, కాంగ్రెస్ పార్టీలో ఎవరూ ఆయన కుర్చీ కాళ్ళు ఇరక్కొట్టేయకూడదు.! ఇరక్కొడితే, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కుక్కలు చించిన విస్తరలా తయారవుతుంది.!