Table of Contents
రాజమౌళి దర్శకత్వంలో (Ram Charan Rajamouli Jr NTR Mugguru Monagallu) ఓ సినిమా వస్తోందంటే, ఆ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటేస్తాయి. రామ్‌చరణ్ అయినా, చరణ్ అయినా.. అంతే మరి. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో రాజమౌళి ఇప్పటికే రెండు సినిమాలు చేసేశాడు. రామ్‌చరణ్‌కి ‘మగధీర’ లాంటి సినిమా ఇచ్చాడు రాజమౌళి.
మరి, ఈ ముగ్గురూ ఓ సినిమాలో నటిస్తే.. అది తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద మల్టీస్టారర్ అవుతుందని నిస్సందేహంగా చెప్పొచ్చు. అందుకే, ఈ సినిమాపై లెక్కలేనన్ని గాసిప్స్ విన్పిస్తున్నాయి. ఎన్టీఆర్ పాత్ర అదీ, చరణ్ పాత్ర ఇలా వుండబోతోంది.. బడ్జెట్ ఈ స్థాయిలో వుంటుందట.. ఫలానా హీరోయిన్ అట.. ఫలానా తేదీన సినిమా సెట్స్ మీదకు వెళుతుందట.. అంటూ కుప్పలు తెప్పలుగా గాసిప్స్ పుట్టుకొస్తున్నాయి. వీటిల్లో ఏది నిజం.?
‘బాహుబలి’ – అంతకు మించి..
తెలుగు సినిమా మరో మెట్టు ఎక్కడానికి సిద్ధంగా వుంది. ‘బాహుబలి’ తెలుగు సినిమా స్థాయిని మరింత పెంచిందన్నది నిర్వివాదాంశం. ఇండియన్ సినిమా సత్తా ఇదీ.. అని నిరూపించిన చిత్రం ‘బాహుబలి’. అది మన తెలుగు సినిమా.. అని తెలుగువారంతా గర్వంగా చెప్పుకునేలా ‘బాహుబలి’ని తెరకెక్కించిన ఘనుడు రాజమౌళి.
ఓ తెలుగు సినిమా వంద కోట్లు సాధించడమే కష్టం.. అని అంతా అనుకుంటున్న టైమ్‌లో.. ఏకంగా, వెయ్యి కోట్లు.. 1500 కోట్లు దాటేసి, బాలీవుడ్ వర్గాల్నే షాక్‌కి గురిచేసింది ‘బాహుబలి’. ఆ మాటకొస్తే, ఇండియన్ సినీ హిస్టరీలో, అత్యధిక వసూళ్ళను సాధించిన సినిమాగా బాలీవుడ్‌ని మించిపోయింది తెలుగు సినిమా.. బాహుబలి రూపంలో. ఇదీ రాజమౌళి భారతీయ బాక్సాఫీస్ చరిత్రలో సృష్టించిన సరికొత్త రికార్డ్. ఎంత సైలెంట్‌గా సినిమా షూటింగ్ చేసేశాడో, అంత వయొలెంట్‌గా రికార్డుల్ని కొల్లగొట్టేలా చేసిన ఘనత రాజమౌళికి కాక ఇంకెవరికి దక్కుతుంది.?
బాలరాముడే.. బాక్సాఫీస్ తారకరాముడు..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ విషయానికొస్తే, బాల నటుడిగా ‘బాల రామాయణం’లో నటించి మెప్పించాడు. ఆ తర్వాత మాస్ హీరోగా పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి, తిరుగులేని అభిమాన గణాన్ని సంపాదించుకున్నాడు.. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌గా అభిమానుల గుండెల్లో స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. ‘స్టూడెంట్ నెం.1’, ‘ఆది’, ‘సింహాద్రి’.. ‘టెంపర్’, ‘నాన్నకు ప్రేమతో’, ‘జనతా గ్యారేజ్’.. ఇలా చెప్పుకుంటూ పోతే, బోల్డన్ని సూపర్ హిట్ చిత్రాలు యంగ్ టైగర్ సొంతం.
సినిమా సినిమాకీ తనలోని నటుడ్ని కొత్తగా చూపించేందుకు యంగ్ టైగర్ పడే ఆరాటం అద్భుతం. ‘టెంపర్’ సినిమాలో నెగెటివ్ టచ్ వున్న రోల్‌లో యంగ్ టైగర్ మెప్పించిన తీరు నభూతో నభవిష్యతి. ‘జై లవ కుశ’ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నట విశ్వరూపాన్ని చూసేశాం. అలాంటి యంగ్ టైగర్‌ని రాజమౌళి ఇప్పుడెలా చూపించబోతున్నాడు.? ప్రస్తుతానికైతే ఇది సస్పెన్సే.
మెగా – పవర్.. రామ్‌చరణ్
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ గురించి కొత్తగా చెప్పేదేముంది.? మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్‌చరణ్, ‘చిరుత’ నుంచి ‘రంగస్థలం’ దాకా చేసినవి తక్కువ సినిమాలే అయినా, తెలుగు సినిమా బాక్సాఫీస్‌పై తనదైన ముద్ర వేశాడు. ‘తండ్రిని మించిన తనయుడు’ అన్పించుకోవడం ఆషామాషీ విషయం కాదు. ఆ ఘనత దక్కించుకుని మెగా పవర్ స్టార్ అనే ఇమేజ్‌ని సంపాదించుకున్నాడు రామ్‌చరణ్. ‘మగధీర’ సినిమాతో తెలుగు సినిమా బాక్సాఫీస్ గత రికార్డుల్ని తిరగరాసిన రామ్‌చరణ్, పలు కమర్షియల్ సక్సెస్‌లతో ‘మెగా’ ఫ్యాన్ బేస్‌ని ఆకట్టుకుంటూ వచ్చాడు.
చరణ్ చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు.. ‘రంగస్థలం’ సినిమా ఒక్కటీ ఒక ఎత్తు. కథానాయకుడికి చెవిటితనం వుంటే ఆ పాత్రలో ఎవరైనా నటిస్తారా.? చరణ్ నటించాడు, మెప్పించాడు. విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. చరణ్ తప్ప ఇంకెవరూ ఆ పాత్రలో అంత బాగా చేయలేరేమో.. అని అంతా అనుకున్నారంటే, ఓ నటుడికి ఇంతకన్నా గొప్ప ప్రశంస ఇంకేముంటుంది.?
ఆర్.ఆర్.ఆర్.
రాజమౌళి.. రామారావు.. రామ్‌చరణ్.. ఇదీ సింపుల్‌గా ‘ఆర్.ఆర్.ఆర్.’ అంటే. ఇదేమీ సినిమా టైటిల్ కాదు. ‘ఆర్.ఆర్.ఆర్.’ హ్యాష్ ట్యాగ్ ద్వారా తొలిసారిగా ఈ ముగ్గురి కాంబినేషన్‌లో సినిమా అనౌన్స్ అయ్యింది. ప్రముఖ నిర్మాత డి.వివి. దానయ్య ఈ చిత్రానికి నిర్మాత. త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళబోతోంది. ‘అరవింద సమేత’ విడుదలైపోవడంతో యంగ్ టైగర్, ‘ఆర్‌ఆర్‌ఆర్’ కోసం రెడీ అయిపోయాడు. బోయపాటితో సినిమా ఓ కొలిక్కి వచ్చేస్తే, చరణ్ కూడా రాజమౌళి సినిమాకే అంకితమైపోవాల్సి వుంటుంది.
ఇంతకీ ఈ ‘ఆర్.ఆర్.ఆర్’లో ఏముంటుంది?
రాజమౌళి సాధారణంగా ఏ సినిమా చేసినా ముందే దాదాపుగా అన్నీ చెప్పేస్తాడు. కానీ ‘ఆర్‌ఆర్‌ఆర్’ గురించి ఏమీ చెప్పడంలేదు. చరణ్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారంతే. అయితే ఇందులో ఎన్టీఆర్‌ది నెగెటివ్ రోల్ అనే ప్రచారం జరుగుతోంది. ఇద్దరూ బాక్సర్లు.. అనే గాసిప్స్ విన్పిస్తున్నాయి. ముగ్గురు హీరోయిన్లు వుంటారనే ఇంకో ప్రచారం తెరపైకొచ్చింది.
ఆరు నెలల నుంచి సంవత్సరం లోపే సినిమా షూటింగ్ పూర్తయిపోతుందనేది ఇంకో గాసిప్. 300 కోట్ల పైనే బడ్జెట్ వుండబోతోందన్నది మరో వాదన. వీటిల్లో ఏది నిజం.? అనేది ముందు ముందు తేలుతుంది. వీలైనంత త్వరగా గాసిప్స్‌కి చెక్‌పెట్టి, చిన్నపాటి క్లారిటీ ఇవ్వాలని రాజమౌళి అనుకుంటున్నాడట. లెట్స్ వెయిట్ అండ్ వాచ్ ఫర్ దట్.