Table of Contents
మలయాళ సినీ ప్రేక్షకులకి షకీలా (Richa Chadda As Shakeela In Biopic) అన్న పేరు సుపరిచితమే. ‘పెద్దలకు మాత్రమే’ తరహా సినిమాల్ని కుప్పలు తెప్పలుగా చేసేసిన షకీలా, ఆ తర్వాత తెలుగు సినిమాల్లో ‘వ్యాంప్’ తరహా పాత్రల్లో కనిపించింది. షకీలా చేసే సినిమాలకి ఒకానొక సమయంలో డిమాండ్ చాలా ఎక్కువగా వుండేది. అదెంత పెద్ద డిమాండ్ అంటే, ఆమె సినిమాలకున్న డిమాండ్ దెబ్బకి మలయాళంలో అగ్రహీరోలైన మోహన్‌లాల్, సురేష్ గోపీ లాంటివారు కూడా తమ సినిమా రిలీజ్ డేట్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునేంతలా.
ఇప్పుడీ షకీలా (Shakeela) గురించిన చర్చ ఎందుకంటే, ఆమె జీవితాన్ని వెండితెరపై ‘షకీలా’ పేరుతో ఆవిష్కరించబోతున్నారు. బాలీవుడ్ భామ రిచా చద్దా (Richa Chadda) ఈ సినిమాలో షకీలా పాత్రను చేయబోతోంది. షకీలాని కలిసి, ఆమె జీవితం గురించి పూర్తిగా తెలుసుకున్న రిచా చద్దా, తన పాత్ర తీరు తెన్నులపై సంపూర్ణ అవగాహన సంపాదించుకుంది. షకీలా జీవితం తెరచిన పుస్తకం ఏమాత్రం కాదనీ, ఆమె అంతరంగాల్లోకి తొంగి చూస్తే, ఎన్నో భావోద్వేగాలు కన్పిస్తాయని పలు సందర్భాల్లో చెప్పింది రిచా చద్దా (Richa Chadha).
ఫస్ట్ లుక్ బంగారం
బంగారు ఆభరణాలు ధరించిన రిచా చద్దా, ‘నగ్నంగా’ అనే భ్రాంతిని కలిగిస్తుంది ఫస్ట్ లుక్ చూసినవారికి. దీన్ని ఓ కాన్సెప్ట్ పోస్టర్‌గా కొందరు అభివర్ణిస్తున్నారు. బంగారాన్ని కాల్చి, సమ్మెట దెబ్బలు వేసి.. ఆభరణంగా తయారు చేస్తారు. ఆ బంగారు ఆభరణాల వెనుక అంత కథ వుంది. షకీలా జీవితం కూడా అంతేనట. కెరీర్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని షకీలా, ఓ పెద్ద తారగా మారింది. పెద్ద తార అయ్యాక కూడా ఆమె చాలా సమస్యల్ని ఎదుర్కోవాల్సి వచ్చిందట.
సినిమా రాజకీయాలే కీలకం
సినిమానీ రాజకీయాల్నీ వేరు చేసి చూడలేమని కొందరు అభిప్రాయపడుతుంటారు. కానీ సినిమా రంగంలోనే రాజకీయాలు వుంటే? ఆ రాజకీయాల ప్రభావంతో ఓ తార సినీ గమనం మారిపోతే! ఇలాంటి అనేక అంశాలు ‘షకీలా’ సినిమాలో చూపిస్తారట. ‘షకీలా’ సినిమాకి సంబంధించి ఇంకా చాలా సస్పెన్స్‌లు వున్నాయి. ఎవరెవరి జీవితాల్లోని చీకటి కోణాలు ఇందులో ఆవిష్కృతమవుతాయో ఇప్పుడే చెప్పలేమంటున్నారట ‘షకీలా’ మేకర్స్. కానీ, గాసిప్స్ కాలమ్స్‌లో ఈ సినిమా గురించి చాలా పుకార్లు షికార్లు చేసేస్తున్నాయి.
షకీలా బాటలో ఎందరో తారలు
‘కామేశ్వరి’ వంటి ఎన్నో సినిమాల్లో షకీలా నటించింది. వాటిల్లో కొన్ని హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లోకీ డబ్ అయ్యాయి. షకీలా సినిమాలు శుక్రవారం విడుదలైతే, సోమవారానికి థియేటర్లలోంచి ‘ఔట్’ అయిపోయేవి. తక్కువ ఖర్చుతోనే సినిమాలు రూపొందేవి గనుక, తక్కువ రోజులే థియేటర్లలో ఆడినా భారీ లాభాల్ని షకీలా సినిమాలు ఆర్జించేవి. దాంతో, షకీలా బాటలోనే కొందరు తారలు ఈ తరహా సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపారు. సింధు, రేష్మ వంటి తారలు షకీలా బాటలో నడిచినవారే.
వివాదాలు అడ్డుకోకుండా వుంటాయా?
షకీలా ‘పెద్దల సినిమాల’ స్టార్‌గా వున్నప్పుడే, ఆమెను నిలువరించేందుకు మలయాళ సినీ పరిశ్రమలో అనేక ప్రయత్నాలు జరిగాయి. అందులో భాగంగా నడిచిన కొన్ని కుట్రలు తన జీవితాన్ని మార్చేశాయని షకీలా (Richa Chadda As Shakeela In Biopic) చెబుతారు కూడా. ఆమె ఇప్పుడు సినిమాల్లో అంత యాక్టివ్‌గా లేరు. ఈ తరుణంలో షకీలా బయోపిక్‌గా వస్తున్న ‘షకీలా’ సినిమాని విడుదల కానిస్తారా? అనే చర్చ కూడా జరుగుతోంది.
మలయాళ ‘డర్టీపిక్చర్’ (Richa Chadda As Shakeela In Biopic)
సిల్క్ స్మిత జీవిత చరిత్రను ఆధారంగా తీసుకుని ‘డర్టీపిక్చర్’ (Dirty Picture) సినిమాని బాలీవుడ్లో విద్యాబాలన్ (Vidya Balan) ప్రధాన పాత్రలో తెరకెక్కించారు. సంచలన విజయాన్ని అందుకుంది ఆ సినిమా. ఆ కోవలోనే ‘షకీలా’ సినిమాని కూడా అర్థం చేసుకోవాల్సి వుంటుందని సినీ ప్రముఖులు కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే, సిల్క్ స్మిత జీవితం వేరు, షకీలా సినీ జీవితం (Richa Chadda As Shakeela In Biopic) వేరనేవారూ లేకపోలేదు.